Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న కొనాలి

మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న కొనాలి

- Advertisement -

కొనుగోళ్లపై పరిమితిని ఎత్తివేయాలి
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
నిద్రమత్తులో రాష్ట్ర ప్రభుత్వం
స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం
రాజకీయాలకు అతీతంగా హక్కుల కోసం రైతులు పోరాటంలోకి రావాలి : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ రావు

నవతెలంగాణ – బోనకల్‌
మార్క్‌ఫెడ్‌ ద్వారా వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కొనుగోళ్లపై పరిమితిని వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్‌ మండల కేంద్రంలో సీపీఐ(ఎం), తెలంగాణ రైతు సంఘం మండల కమిటీల ఆధ్వర్యంలో రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. దెబ్బతిన్న మొక్కజొన్న కర్ర, కంకులతో తొలుత స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి ప్రదర్శనగా బోనకల్‌ గ్రామపంచాయతీ కార్యాలయం, స్థానిక ఖమ్మం బస్టాండ్‌ సెంటర్‌ మీదుగా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ మద్దెల రమాదేవికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తే కేవలం ఖమ్మం జిల్లాలోనే లక్ష ఎకరాల్లో సాగు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా మొక్కజొన్న పంట పండించే ఐదు మండలాల్లో బోనకల్‌ ఒకటని తెలిపారు. ఎకరానికి 25 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వాలు ప్రకటించడం దారుణమన్నారు. ఎకరానికి సుమారు 40 క్వింటాలు దిగుబడి వస్తుందని, మిగిలిన మొక్కజొన్న పంటను ఎవరు కొనుగోలు చేయాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర క్వింటా రూ.2400 ప్రకటించిందని, కానీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారులు గ్రామాల్లోకి రంగప్రవేశం చేసి కేవలం రూ.1600లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నా రన్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారన్నారు. ఈ ఏడాది అకాల వర్షాలు వల్ల పత్తి, మొక్కజొన్న పంట రైతులు తీవ్రంగా నష్టపోయా రని, వారికి వెంటనే పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

మొక్కజొన్న రైతులు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోకుండా, మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిద్రపోతున్నాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయకపోతే రాజకీయాలకు అతీతంగా రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్‌ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కిలారు సురేష్‌, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కొమ్మినేని నాగేశ్వరరావు, తుళ్లూరు రమేష్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -