రామమందిర విరాళాల చోరీపై చర్చ జరపాలి
ప్రధాని, హోంమంత్రులు సభకు ఎందుకు హాజరవడం లేదు?
నినాదాలతో హోరెత్తిన పార్లమెంట్ జోరు వర్షంలో ప్రతిపక్షాల ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ
బ్యూరోవిద్యార్థులు, యువతపై ఢిల్లీ పోలీసులు చేసిన క్రూరమైన దాడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని, అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీపై ఉభయ సభల్లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం పార్లమెంట్ ఆవరణంలో ప్రతిపక్షాలు జోరు వర్షంలో తమ ఆందోళనను కొనసాగించాయి. ఆందోళన చేస్తున్న సమయంలో భారీగా వర్షం పడుతున్నా
ఎంపీలు వెనక్కి తగ్గలేదు. వర్షంలో
తడుస్తూనే ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొడుగులు, ప్లకార్డులు పట్టుకుని, పార్లమెంట్ మకర ద్వారం ముందు నిరసన తెలిపారు. ‘చందా చోర్, గద్దె చోడ్’, ‘అమిత్ షా జవాబ్ దో’, ‘ చందా చోర్ కహాన్ మిలేంగే, బీజేపీ కే దఫ్తర్ మే’ వంటి నినాదాలు ఎంపీలు హోరెత్తించారు. ‘‘అమిత్ షా జవాబ్ దో’’ అంటూ భారీ బ్యానర్‌ను ప్రదర్శించిన ప్రతిపక్ష ఎంపీలు, జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో విద్యార్థులపై జరిగిన దాడికి కేంద్ర హోంమంత్రి సమాధానం ఇవ్వాలని, ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అమిత్ షా కనబడడం లేదని, పార్లమెంట్ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్ర హోం మంత్రి, ప్రధాని మోడీ సభకు హాజరుకాకపోవడంపై ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. జులై 20న ఢిల్లీలో నీట్ యూజీ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలు లాఠీఛార్జ్, పెల్లెట్ గన్లు, వాటర్ కెనాన్లు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హోం శాఖ పరిధిలోని పోలీసుల చర్యలపై అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే ఆ రోజు నుంచి అమిత్ షా పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. పార్లమెంట్ ఉభయ సభలకు హాజరుకావడం లేదు.
లోక్‌సభలో ఎంఎస్ఎంఈ సవరణ బిల్లు ఆమోదం
మహాత్మా గాంధీ దార్శనిక నాయకత్వంలో 1942 ఆగస్టు 9న ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమం 84వ వార్షికోత్సవాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గుర్తుచేసుకోవడంతో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి విద్యార్థులు, యువతపై ఢిల్లీ పోలీసులు చేసిన క్రూరమైన దాడికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని, అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీపై చర్చ జరపాలని డిమాండ్ చేశాయి. దీంతో సభ ప్రారంభమైన నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు తమ ఆందోళన మధ్య కేంద్రమంత్రి జీతన్ రామ్ మాంఝీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. 2006 చట్టం స్థానంలో వచ్చిన ఈ బిల్లు, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఉచిత, స్వచ్ఛంద నమోదు కోసం ఒక జాతీయ డిజిటల్ వేదికను నోటిఫై చేయడానికి వీలు కల్పిస్తుంది. ఎంఎస్ఎంఈల నుంచి వస్తువులు, సేవలను సేకరించడానికి సంబంధించిన ఇన్వాయిస్ సెటిల్మెంట్లను ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (టీఆర్ఈడీఎస్) ద్వారా నిర్వహించాలని అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను (సీపీఎస్ఈఎస్) తప్పనిసరి చేస్తుంది. ఈ బిల్లును ఎటువంటి చర్చ లేకుండా నిమిషాల్లోనే మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు.
కేంద్ర హోంమంత్రి ఒక ప్రకటన విడుదల చేయాలి : ఖర్గే
రాజ్యసభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. చైర్మెన్ సిపి రాధాకృష్ణన్ సభా కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ జులై 20న నిరసనకారుల మీద పోలీసుల చర్యపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ప్రకటన విడుదల చేయాలన్న తన డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. “ఆయన (కేంద్ర హోం మంత్రి అమిత్ షా) పార్లమెంటుకు రావడానికి భయపడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఆయన ఏదో కారణంతో రావడం లేదు. ఆయన రావాలి, సమాధానం చెప్పాలి, ఒక ప్రకటన చేయాలి. అందులో అంత పెద్ద విషయం ఏముంది? ఏదైనా తప్పు జరిగితే, బాధ్యత తీసుకోవాలి” అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు.
కాంగ్రెస్ విప్ జారీ
వివాదాస్పద ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా తమ పార్టీకి చెందిన ఉభయ సభల ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై ప్రభుత్వం చర్చ చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌సభ రెండింటిలోనూ కాంగ్రెస్ ఎంపీలు తప్పనిసరిగా హాజరు కావాలని అధిష్ఠానం స్పష్టం చేసింది. ఆగస్టు 10, 11, 12 తేదీల్లో తమ తమ సభల్లో తప్పనిసరిగా హాజరు కావాలని పార్లమెంటు సభ్యులను కోరింది. ఈ మేరకు రాజ్యసభలోని కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేశ్ విప్ జారీ చేశారు. ఈ సందర్భంగా ఆ మూడు రోజుల్లో రాజ్యసభలో చాలా ముఖ్యమైన అంశాలను చర్చకు తీసుకోనున్నట్టు జైరామ్ రమేశ్ తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సభ వాయిదా పడే వరకు తప్పనిసరిగా సభలో సభ్యులు ఉండాలని, పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించాలని కోరారు. మరోవైపు, లోక్‌సభలోని కాంగ్రెస్ సభ్యులకూ పార్టీ ఇదే విధమైన విప్ జారీ చేసింది. ఆ మూడు రోజుల పాటు కాంగ్రెస్ ఎంపీలంతా తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొంది.



