మరోసారి అర్హుల నుంచి స్వీకరించాలని నిర్ణయం
దశల వారీగా పింఛన్ల మంజూరు
నవతెలంగాణ – మల్హర్ రావు
చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత లబ్ధిదారుల వివరాల పునఃపరిశీలనతో పాటు, అర్హులైన వారికి కొత్త పింఛన్లు అందజేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు ఉండడంతో, ఆ తర్వాత మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిసింది. ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు జిల్లాల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వారికే ప్రాధాన్యత..
ఈనెల 15 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళల నుంచి తొలి ప్రాధాన్యతగా దరఖాస్తులు స్వీకరిస్తారు. తలసేమియా, సికిల్ సెల్ బాధితులను దివ్యాంగుల కేటగిరీగా పరిగణించి దశల వారీగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. వృద్ధాప్య పింఛన్ల విషయంలో లభ్యత ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోనున్నారు.
పరిశీలన ఇలా..
పింఛన్ కోసం అర్హులైన అభ్యర్థులు కొత్తగా రూపొందించిన దరఖాస్తు ఫారం నింపి ఆధార్ కార్డు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, తాజా పాస్పోర్ట్ సైజ్ ఫొటోను జతచేసి పంచాయతీ కార్యదర్శికి సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఎంపీడీఓ కార్యాలయంలో ఆన్ లైన్లో నమోదు చేశాక..ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా పరిశీలిస్తారు. దరఖాస్తుదారులకు కారు, బైక్, ఆటో వంటి వాహనాలు, సొంత భూమి, ఇతర ఆదాయ వనరులు ఉన్నాయా అని యాప్ ద్వారా తేల్చాక అర్హులను నిర్ధారిస్తారు. అలాగే, క్షేత్రస్థాయిలోనూ పరిశీలిస్తారు. కాగా, పింఛన్ల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలతో త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని తెలిసింది.



