నవతెలంగాణ – హైదరాబాద్: కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ కూచిపూడి నాట్య మహాసభలు డిసెంబర్ 25, 26, 27 తేదీల్లో ప్రపంచ స్థాయిలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహాసభల్లో భాగంగా డిసెంబర్ 27న నిర్వహించనున్న ‘గీతా సారం – నాట్యవేదం’ మహాబృందనాట్య కార్యక్రమానికి అంకురార్పణ కార్యక్రమం, బృందనాట్యానికి సంబంధించిన వీడియో ఆవిష్కరణ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కూచిపూడి సాంప్రదాయ నృత్య ప్రదర్శనలో కుమారి శ్రీహిత ప్రతాప ఆకట్టుకున్నారు. అలాగే త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ కళాకారులు ‘రాజగోపాలం రాధాలోలం’, ‘వందే వాణి భవాని’ అంశాలను కూచిపూడి నృత్య రూపంలో ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
ఈ కార్యక్రమంలో కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ గౌరవ అధ్యక్షులు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య పసుమర్తి రామలింగ శాస్త్రి, గౌరవ సలహాదారు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ డా. భాగవతుల సేతురామ్, ‘యక్షగాన కంఠీరవ’ డా. పసుమర్తి శేషుబాబు, ‘నాట్య కులశేఖర’ డా. ఏలేశ్వరపు చలపతి శాస్త్రి, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత డా. తాడేపల్లి, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి ఓలేటి రంగమణి, కళారత్న శ్రీమతి సువర్ణలత, డా. కె. రమాదేవి, డా. శ్రీ సుధాకర్, డా. రత్నశ్రీ, పసుమర్తి ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ఉపాధ్యక్షులు వెంపటి సత్యప్రసాద్, కమిటీ నిర్వహణ సభ్యులు శ్రీమతి మాడభూషిణి రమణి సిద్ధి, శ్రీమతి ఇందిరా పరాశరం, శ్రీమతి ఉమామహేశ్వరి, శ్రీమతి రాజేశ్వరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రపంచ కూచిపూడి నాట్య మహాసభలను విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత డా. వేదాంతం వెంకట నాగ చలపతి అభినందనలు తెలిపారు. కూచిపూడి కళను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు ఈ మహాసభలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి వేదికను అందించి సహకరించిన సుందరయ్య విజ్ఞాన కేంద్రం యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.



