నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుకను వెలికితీసి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు.శనివారం కొలనుపాక వాగు పరిసర ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆలేరు పోలీస్‌స్టేషన్‌కు చెందిన PC-4323 జె. నవీన్, HG-36 జి. వెంకటేష్‌లు కొలనుపాక వాగు పరిసరాల్లో పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వాహనం ద్వారా వాగు నుంచి ఇసుకను అక్రమంగా వెలికితీసి ట్రాలీలో నింపుతున్నట్లు గుర్తించారు. వెంటనే వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా ట్రాలీలో ఇసుక నింపి ఉన్నట్లు గుర్తించారు.
వాహన డ్రైవర్‌ను విచారించగా కొలనుపాక గ్రామానికి చెందిన మాచర్ల గణేష్ (23)గా గుర్తించారు. అతను TS 36 T 6195 నంబర్ గల అశోక్ లేలాండ్ వాహనం ద్వారా కొలనుపాక వాగు నుంచి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను వెలికితీసి బచ్చన్నపేట వైపు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని,మాచర్ల గణేష్‌పై చట్ట ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వాగులు, చెరువుల నుంచి అనుమతులు లేకుండా ఇసుకను వెలికితీసి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.



