– రైతు సంఘాల డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో శనివారం అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్), అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బస్టాండ్ సెంటర్‌లో దిష్టిబొమ్మ దహనం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావం కారణంగా మొలకెత్తిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు అందించాలని, రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేసి కొత్తగా వడ్డీ లేని పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే సమగ్రమైన పంట బీమా పథకాన్ని అమలు చేయడంతో పాటు, ప్రాజెక్టులలోని లోపాలను సవరించి ఎండిపోతున్న పంటలకు తక్షణమే సాగునీరు అందించాలని కోరారు. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 200 రోజుల ఉపాధి కల్పించి, రోజువారీ కూలీని రూ.700 లకు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా నెలకు రూ.7,500 జీవనభృతి అందించాలని డిమాండ్ చేశారు.
ఎల్-నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో గ్రామాలకు తాగునీరు, పశుగ్రాసం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాలను కోరారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకునే చర్యలు వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతాంగ సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు గోకినపల్లి ప్రభాకర్, ఏఐయూకేఎస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కంగాల కల్లయ్య, డివిజన్ కార్యదర్శి నకిరేకంటి నాగేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు, కావడిగుండ్ల సర్పంచ్ బాడిస లక్ష్మణరావు, మండల నాయకులు వాసం పోతిరాజు, మడకం రామకృష్ణ, సోడెం ముత్యాలు, కంగాల కన్నయ్య, కారం రాజులు, కంగాల వెంకటేష్, కారం వెంకటేష్, సోడెం పౌల్‌రాజు, కంగాల పెద్ద వంగరావు, సరియం లక్ష్మణ్‌రావు, మడివి నాగేశ్వరరావుతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.



