– కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి
– ఆగస్టు 10 జైలు భరోను విజయవంతం చేయాలి
– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తొలగించి, కొంతమంది పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించి అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు.ఆగస్టు 10న నిర్వహించే జైలు భరో కార్యక్రమాన్ని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
శనివారం అశ్వారావుపేట హమాలీ అడ్డ వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మిక చట్టాలు అమలులో ఉన్న సమయంలో హమాలీ కార్మికులు ఐక్యంగా పోరాడి ఎగుమతి, దిగుమతి రేట్లను సాధించుకోవడంతో పాటు బేరసారాలు చేసే హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. అయితే నూతన లేబర్ కోడ్‌ల ద్వారా హమాలీలు, అసంఘటిత రంగ కార్మికులకు ఉన్న హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించిందని విమర్శించారు.
ఏ చట్టంలోనైనా మార్పులు చేస్తే అవి కార్మికులు, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలే గానీ, ఇప్పటికే ఉన్న హక్కులను తొలగించేలా ఉండకూడదని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగే జైలు భరో కార్యక్రమంలో కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు ఏసు, రమేష్, మధు, నాగేంద్రరావు, కాసిం, హనుమంతరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.



