Sunday, August 9, 2026
E-PAPER
Homeజాతీయంప్రశ్నలతో ఆగొద్దు..పరిష్కారాలు చూపండి

ప్రశ్నలతో ఆగొద్దు..పరిష్కారాలు చూపండి

- Advertisement -

యువత సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఉంది
వారి ఆలోచనలు, నిర్ణయాలే వికసిత్‌ భారత్‌కు దిశానిర్దేశం : ప్రధాని మోడీ
ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు

న్యూఢిల్లీ : దేశ యువత సమస్యలను గుర్తించి ప్రశ్నించడం మాత్రమే కాకుండా, వాటికి పరిష్కారాలను కనుగొనే దిశగా ఆలోచించాలని ప్రధాని మోడీ సూచించారు. యువత సామర్థ్యాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పిలుపునిచ్చారు. ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోడీ..పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ఇప్పుడు అడుగుపెడుతున్న ప్రపంచం వేగంగా మారుతోందని చెప్పారు. సాంకేతికతతో పాటు అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయ న్నారు. రాబోయే 20–30 ఏండ్లలో ప్రపంచంలో ఎలాంటి మార్పులు వస్తాయో ముందుగానే చెప్పడం సాధ్యం కాదని చెప్పా రు. అందువల్ల యువతలో ఎప్పుడూ నేర్చుకోవాలనే ఆసక్తి ఉండా లన్నారు. జీవితాంతం విద్యార్థులుగా కొనసాగాలని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త విషయాలను నేర్చుకునేవారే విజయాన్ని అందుకుంటారని తెలిపారు.

సమస్యలను చూసి భయపడొద్దు
జీవితంలో వచ్చే సమస్యలను చూసి భయపడాల్సిన అవసరం లేదని, పెద్ద సవాళ్లను చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటికి పరిష్కారాలను అన్వేషించాలని మోడీ సూచించారు. కొత్త ఆలోచనలు, వినూత్న పరిష్కారాలను కనుగొనే ధైర్యం ఉంటే సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవచ్చునన్నారు. ప్రతి తరానికీ దేశం పట్ల బాధ్యత ఉంటుందని మోడీ వివరించారు. రాబోయే 30–35 ఏండ్లలో యువత తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలే వికసిత్‌ భారత్‌ దిశను ప్రభావితం చేస్తాయని అన్నారు. తాము తీసుకునే ప్రతి నిర్ణయం దేశానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో యువత ఆలోచించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాల కోసం తాము ఏమి చేయగలమనే ప్రశ్నను ప్రతి యువకుడు తనకు తాను వేసుకోవాలని మోడీ సూచించారు.

​విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం
స్నాతకోత్సవంలో ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు దీన్‌దయాల్‌ శర్మ స్వర్ణ పతకం, డైరెక్టర్‌ స్వర్ణ పతకాలను మోడీ ప్రదానం చేశారు. పురస్కారాలు అందుకున్నవారిలో మహిళల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. మరింత మంది మహిళలు ఈ స్థాయిలో ప్రతిభ చూపాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఐఐటీ ఢిల్లీ సోనిపత్‌ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత సూపర్‌ కంప్యూటింగ్‌ కేంద్రం ‘పరం ప్రజ్ఞ’ను ప్రధాని ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -