నగరాల్లో చుక్కలు చూపుతున్న భూముల ధరలు
ప్రీమియం ఇండ్లకు డిమాండ్..మరోవైపు అమ్మకాలు డీలా
న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పట్టణీకరణ వేగంతో పాటు సామాన్యుడి సొంతింటి కల మరింత దూరమవుతోంది. నగరాల్లో స్వంత ఇల్లు కొనుగోలు చేయాలని ఆరాటపడే పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటు ధరల ఇళ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెరిగిన స్థలాల ధరలు, భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం, ప్రభుత్వ పన్నుల భారం, లాభాపేక్షే ధ్యేయంగా వ్యవహరిస్తున్న ప్రయివేటు రియల్ ఎస్టేట్ డెవలపర్ల వైఖరి వల్ల పట్టణ భారతదేశంలో గృహ సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది.
పడిపోయిన అందుబాటులోఉన్న ఇండ్ల సరఫరా..
రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో అందుబాటు ధరల ఇండ్ల కొరత ఏకంగా 96 లక్షలకు చేరుకుంది. 2018లో ముంబయి, ఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నయ్, కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్ వంటి ఎనిమిది ప్రధాన నగరాల్లో కొత్తగా ప్రారంభమైన మొత్తం ఇళ్లలో రూ. 45 లక్షల లోపు ఇళ్ల వాటా 52 శాతంగా ఉండగా.. 2026 నాటికి అది దారుణంగా 15 శాతానికి పడిపోయింది. అదే సమయంలో రూ. 1 కోటి, అంతకంటే ఎక్కువ విలువైన లగ్జరీ ఇళ్ల వాటా 14 శాతం నుండి ఏకంగా 62 శాతానికి పెరగడం సామాన్యులను సొంతింటి కళకు పూర్తి దూరంగా నెట్టివేస్తోంది.
లాభాల బాటలో డెవలపర్లు..
సరసమైన ధరల ఇళ్ల నిర్మాణంలో లాభాల మార్జిన్ కేవలం 10 నుండి 12 శాతానికే పరిమితమవ్వడంతో ప్రయివేటు డెవలపర్లు ఈ విభాగం నుండి వేగంగా తప్పుకుంటున్నారు. 25 నుండి 30 శాతం అధిక లాభాలు ఇచ్చే లగ్జరీ ప్రాజెక్ట్‌ల వైపే మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు పలు రకాల అనుమతుల్లో వచ్చే తీవ్ర జాప్యం, రెరా నిబంధనలు, భూముల కొనుగోలు వ్యయం పెరగడం వల్ల ప్రయివేటు రంగానికి ఈ ప్రాజెక్ట్‌లు ఆర్థికంగా ఏమాత్రం లాభదాయకంగా మారడం లేదు.
భారంగా ప్రభుత్వ పన్నులు..
గత ఐదేళ్లలో మెట్రో నగరాల్లో భూముల ధరలు 40 నుండి 55 శాతం వరకు పెరగ్గా, నిర్మాణ వ్యయం మరో 30 శాతం పెరిగింది. ఒక ఇల్లు విక్రయించే ధరలో దాదాపు 50 శాతం వరకు స్టాంప్ డ్యూటీ, డెవలప్‌మెంట్ ఛార్జీలు, జిఎస్‌టి రూపంలో ప్రభుత్వాలకే పన్నులుగా వెళ్తుండటం ధరలను మరింత పెంచేస్తోంది. నగరాల్లో స్థలాల ధరలు భరించలేక డెవలపర్లు నగర శివార్లలో నిర్మిస్తున్నప్పటికీ అక్కడ సరైన రవాణా, మౌలిక వసతులు, పాఠశాలలు లేకపోవడంతో ప్రజలు ప్రయాణాలకే రోజూ గంటల సమయం వెచ్చించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దిశానిర్దేశం లేని పట్టణ ప్రణాళికలు..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ (పిఎంఎవై-యు) అంతంతమాత్రమే తోడ్పడినప్పటికీ.. వేగంగా పెరుగుతున్న పట్టణ జనాభా అవసరాలను తీర్చడంలో ఇది ఏమాత్రం సరిపోవడం లేదు. పోర్ట్ ట్రస్ట్, రైల్వేలు, రక్షణ శాఖల వద్ద వృథాగా ఉన్న ప్రభుత్వ భూములను పేదల ఇళ్లకు కేటాయించకపోవడం, పన్నుల సడలింపులు ఇవ్వకపోవడం వల్ల పరిస్థితి మరింత క్షీణిస్తోంది. ఏకీకృత రవాణా వ్యవస్థ, ప్రాధాన్యత ఆధారిత భూ కేటాయింపులు చేపట్టి నగరాల్లో జీవన వ్యయాన్ని తగ్గించనంత కాలం సామాన్యుడికి సొంతింటి కల నెరవేరని స్వప్నంగానే మిగిలిపోనుంది.
పెరిగిన నిల్వలు..
భారత రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారుతుండటంతో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య కూడా వేగంగా పేరుకుపోతోందని నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్‌లో వెల్లడయ్యింది. 2026 ప్రథమార్థంలో దేశంలోని ఎనిమిది ప్రధాన మెట్రో నగరాల్లో విక్రయించని ఇళ్ల సంఖ్య గతేడాదితో పోలిస్తే 4 శాతం పెరిగి 5.25 లక్షల యూనిట్లకు చేరింది. అయితే, సామాన్య మరియు మధ్యతరగతి వర్గాలకు చెందిన రూ. 50 లక్షలలోపు ఇళ్ల నిల్వలు 7 శాతం తగ్గి కొంత ఊరటనివ్వగా, రూ. 1 కోటి కంటే ఎక్కువ విలువ కలిగిన లగ్జరీ, ప్రీమియం విభాగంలోనే అమ్ముడుపోని ఆస్తుల భారం విపరీతంగా పెరుగుతోందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ముఖ్యంగా రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల మధ్య ఉండే ఇళ్ల నిల్వలు ఏకంగా 43 శాతం పెరిగి 65,671 యూనిట్లకు చేరగా.. రూ. 20 కోట్ల నుంచి రూ. 50 కోట్ల అత్యంత విలాసవంతమైన విభాగంలో నిల్వలు 52 శాతం మేర రికార్డు స్థాయిలో పెరిగాయి. ప్రీమియం విభాగంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం మితిమీరడం, దానికి అనుగుణంగా కొనుగోళ్ల వేగం లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అమ్ముడుపోని ఇళ్లు పూర్తిగా అమ్ముడవడానికి పట్టే సమయాన్ని సూచించే క్వార్టర్స్ టు సెల్ (క్యూటిఎస్) సూచీ జాతీయ స్థాయిలో 6 త్రైమాసికాలకు పెరిగింది. నగరాల వారీగా పరిశీలిస్తే అహ్మదాబాద్‌లో అత్యధికంగా 8.1 త్రైమాసికాలు, ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిధిలో 7.6 త్రైమాసికాల సమయం ఈ నిల్వలు ఖాళీ అవడానికి పడుతుందని అంచనా వేయగా, పూణే, చెన్నయ్ నగరాలు వేగవంతమైన విక్రయాలతో మెరుగైన స్థితిలో ఉన్నాయి.



