ఆరోగ్యంపై వదంతులను తోసిపుచ్చిన ఇరాన్… వీడియో విడుదల
టెహ్రాన్ : సుప్రీం నేత అయతొల్లా మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులను ఇరాన్ తోసిపుచ్చింది. ఆయనజీవించే ఉన్నారని స్పష్టం చేసింది. ఇందుకు సాక్ష్యంగా ఓ వీడియోను విడుదల చేసింది. అయితే దానిని ఎప్పుడు రికార్డు చేసిందీ తెలుపలేదు. ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయిల్ దళాలు దాడులు ప్రారంభించిన మొదటి రోజే సుప్రీం నేత అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ దాడులలో అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత మొజ్తాబా ఇరాన్ నూతన సుప్రీం నేతగా ఎన్నికైనప్పటికీ ఇప్పటి వరకూ ప్రజలకు కన్పించలేదు. కాగా ‘విప్లవ నేత అయతొల్లా సయ్యద్ మొజ్తాబా ఖమేనీ వీడియోను తొలిసారిగా విడుదల చేస్తున్నాం’ అని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ మెహర్ తన వెబ్‌సైటులో వీడియోతో పాటు పోస్ట్ చేసింది. పన్నెండు సెకన్ల వీడియోలో మొజ్తాబా మంచి ఆరోగ్యంతో కన్పించారు. మూసి ఉన్న తరగతి గదిలో కార్పెట్‌పై ఆయన కూర్చొని ఉన్నారు. తెల్లని దుస్తుల పైన లేత బూడిద రంగు అంగీని, నల్లని తలపాగాను ధరించిన మొజ్తాబా తన చుట్టూ తివాచీపై కూర్చుని ఉన్న వారితో సంభాషిస్తూ కన్పించారు.
అయితే ఈ వీడియోను ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో తెలియలేదు. మార్చి 20వ తేదీన ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్‌ఐబీ కూడా మొజ్తాబాకు చెందిన ఇలాంటి వీడియోనే షేర్ చేసింది. కాగా సుప్రీం నేతగా ఎన్నికైన తర్వాత మొజ్తాబా ప్రభుత్వ వార్తా సంస్థల ద్వారా అనేక లిఖిలపూర్వక ప్రకటనలు విడుదల చేశారు. కానీ చిత్రాలను, వాయిస్ రికార్డింగులను పోస్ట్ చేయలేదు. మొజ్తాబాతో మాట్లాడడం ‘ఈ సమయంలో చాలా కష్టం’ అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కొద్ది రోజుల క్రితమే చెప్పారు. ‘ప్రస్తుతం ఆయనతో మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ ఆయన ఉనికి మనకు గొప్ప బలాన్ని ఇస్తోంది. దానిని మనం కొనసాగిద్దాం’ అని అన్నారు. తాను ఆయనతో అనేక ఫలప్రదమైన సమావేశాలు జరపగలిగానని పెజెష్కియాన్ తెలిపారు.
మొజ్తాబా జీవించే ఉన్నారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



