వ్యాపార దృక్పథంతోనే అమెరికా దాడులు
భవిష్యత్‌లో తీవ్రం కానున్న ఎరువుల కొరత
అమెరికా చెప్పినట్టు ఆడుతున్న మోడీ : సెమినార్లో ఆర్థిక, సామాజిక విశ్లేషకులు డి.పాపారావు
నవతెలంగాణ -ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సామ్రాజ్యవాద అమెరికా, ఇజ్రాయిల్.. ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో కాలి బూడిద అవుతున్నది యుద్ధ ట్యాంకులు, మిస్సైల్స్, డ్రోన్స్ మాత్రమే కాదు.. మూడో ప్రపంచ దేశాల్లోని కార్మికులు -కర్షకులు, సామాన్యుల శ్రమశక్తి అని ఆర్థిక సామాజిక విశ్లేషకులు డి.పాపారావు అన్నారు. దేశీయ ఇంధన అవసరాల్లో 80% పైగా దిగుమతులపై ఆధారపడటంతో యుద్ధం వల్ల ప్రధానంగా ప్రభావమవుతున్న దేశాల్లో మన దేశం ఒకటి అన్నారు. వ్యాపార దృక్పథంతోనే అమెరికా ఈ యుద్ధం చేస్తోందని చెప్పారు. ఖమ్మంలోని బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బీవీకే) ఆధ్వర్యంలో స్థానిక మంచికంటి ఫంక్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన ‘సామ్రాజవాద యుద్ధం – ప్రజలపై ప్రభావం’ సెమినార్లో పాపారావు మాట్లాడారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం తెలంగాణలోని ఉత్పాదక పరిశ్రమల కార్మికులపై ప్రభావం చూపుతోందన్నారు. ముఖ్యంగా ఎల్ఎన్జీ వంటి ముడి పదార్థాల కొరత ఏర్పడటంతో పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వస్తోందన్నారు. రసాయనాలు, ప్లాస్టిక్లు, ఆహార ప్రాసెసింగ్ వంటి పరిశ్రమలు ఉత్పత్తి మందగించాయన్నారు. సిరామిక్, ఉక్కు, వస్త్ర, ఫ్యాబ్రికేషన్ యూనిట్లను పెద్ద ఎత్తున మూసివేయడానికి కారణమవుతోందన్నారు. ఇండిస్టియల్ గ్యాసెస్, కెమికల్స్ వంటి ముఖ్యమైన ముడి పదార్థాల కొరతకు దారితీసిందన్నారు. కొన్ని తయారీ యూనిట్లలోని పారిశ్రామిక క్యాంటీన్లు ఇప్పటికే మూతపడ్డాయన్నారు. ఈ అస్థిరత తెలంగాణ నుంచి గల్ఫ్ ప్రాంతానికి జరిగే ఎగుమతులకు అంతరాయం కలిగించిందన్నారు. భవిష్యత్‌లో ఎరువుల కొరత తీవ్రం అవుతుందన్నారు.
ఇరాన్‌తో యుద్ధానికి దిగేముందే అమెరికా అంచనా గాడి తప్పిందని తెలిపారు. యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. సీఎన్జీ కొరతతో అనేకమంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని చెప్పారు. విదేశాలకు వెళ్తున్న భారతీయుల్లో దేశంలోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలకు వెళ్తున్న వైట్ కాలర్ ఉద్యోగుల కంటే గల్ఫ్ కంట్రీస్‌లో ఉపాధి పొందుతున్న కార్మికులే అధికమన్నారు. గల్ఫ్ దేశాలలో సుమారు 90 లక్షల మంది భారతీయ కార్మికులు ఉంటే.. తెలంగాణ నుంచి సుమారు 15 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్నారని వివరించారు. భారతదేశ వ్యవసాయ రంగంలో కీలకమైన ఖరీఫ్ సీజన్‌కు ముందు యుద్ధం కారణంగా ఖతార్ నుంచి ఎల్ఎన్జీ రవాణా నిలిచిపోవడం దేశీయ యూరియా తయారీని ప్రభావితం చేస్తోందన్నారు.
యూరియా ఉత్పత్తిలో 70% వ్యయం సహజ వాయువుదేనని తెలిపారు. రామగుండం పెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సిఎల్)పై గ్యాస్ కొరత ప్రభావం ఉందన్నారు. ఆర్.ఎఫ్.సి.ఎల్ యూరియా ఉత్పత్తిలో దాదాపు సగభాగం రాష్ట్రానికే సరఫరా అవుతుందని తెలిపారు. దేశ ఇంధన అవసరాలను తీర్చడానికి ఇరాన్ సహజ వాయువును పైప్‌లైన్ ద్వారా తీసుకొచ్చే ప్రాజెక్టు నుంచి అమెరికా ఆంక్షల కారణంగా భారతదేశం వైదొలిగిందన్నారు. పైప్ లైన్ పూర్తి చేసి ఉంటే, నేడు ఎంతో చౌక ధరకు ఇరాన్ నుంచి సహజవాయువు మనకు అందేదని చెప్పారు. ప్రపంచ ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపించేది కమ్యూనిస్టులు మాత్రమేనని తెలిపారు. భవిష్యత్ కమ్యూనిస్టులదేనని అన్నారు. బీవీకే జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో బండారు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అమెరికా చేతిలో మోడీ కీలుబొమ్మ
భారతదేశ పాలకవర్గాలు అమెరికన్ సామ్రాజ్యవాదానికి లొంగిపోతున్న కారణంగా నేడు దేశంలోని కార్మికులు, కర్షకులు, సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. వ్యాపార, వాణిజ్య రంగంలో శతాబ్దాలుగా ఇరాన్‌తో భారత్‌కు అనుబంధం ఉందన్నారు. దశాబ్దాలుగా మిత్రదేశాలుగా ఉన్నాయని తెలిపారు. దీనికి భిన్నంగా మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్, అమెరికన్ సామ్రాజ్యవాదంతో అంటకాగుతోందన్నారు. మన ప్రభుత్వం ఏం చేయాలో అమెరికా నిర్ధారిస్తుందన్నారు.



