మొత్తం ఓటర్లు 3,38,26,448 మంది
ఫారాలు అందజేయని వారు 73,95,954
హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కనిష్ట నమోదు
90 శాతం మార్కు దాటిన జిల్లాలు మెదక్, యాదాద్రి, జనగాం
తెలంగాణలో 20 శాతానికిపైగా తగ్గే అవకాశం
‘సర్’ ప్రక్రియకు నేడే చివరి రోజు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) దెబ్బకు రాష్ట్రంలో దాదాపు 60 లక్షలకు పైగా ఓట్లకు గండి పడే అవకాశం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నెల 9 వరకు 78.14 శాతం మంది ఓటర్లు ఓటరు నమోదు ఫారాలను పూరించి బూత్‌లెవల్ ఆఫీసర్(బీఎల్ఓ)లకు అందజేశారు. ఇంకా 21.86 శాతం మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను పూరించి ఎన్నికల సంఘానికి అందజేయా ల్సి ఉంది. రాష్ర్టంలో ఏ జిల్లాలోనూ 100 శాతం సర్ ప్రక్రియ పూర్తి కాలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అత్యల్పంగా నమోదైంది. సర్ ఫారాల అందజేతకు నేడే చివరి
రోజు కావడంతో భారీ ఎత్తున ఓటర్ల కోత తథ్యమని భావిస్తున్నారు. రాష్ర్టంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుకు 100 శాతం ఎన్యుమరేషన్ ఫారాలను ఎన్నికల సంఘం గత నెల14 వరకు అందజేసింది. ఆగస్టు 3 వరకు ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫారాల అందజేత పూర్తి కాకపోవడంతో ఎన్నికల సంఘం గడువును ఆగస్టు 10 వరకు పొడిగించింది. గడువు పొడిగించినా 21 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటరు నమోదు ఫారాలను అందజేయడంలో విఫలమయ్యారు. గడువుకు ఒక రోజు ముందు వరకు (ఆగస్టు9) 2,64,30,494 ఓటర్లు (78.14 శాతం) ఓటరు నమోదు ఫారాలను పూరించి బూత్లెవర్ ఆఫీసర్(బీఎల్ఓ)లకు అందజేయగా, 73,95,954 శాతం మంది మాత్రం ఇంకా అందజేయాల్సి ఉంది.
అత్యల్పంగా హైదరాబాద్‌లో 58.58 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 63.82 శాతం, రంగారెడ్డి జిల్లాలో 64.91 శాతం మంది ఓటర్ నమోదు ఫారాలను బీఎల్ఓలకు అందజేశారు. నాలుగు జిల్లాల్లో మాత్రమే 90 శాతానికి పైగా సర్ ప్రక్రియ పూర్తయింది. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 94.30, జనగాం జిల్లాలో 91.69, మేదక్ జిల్లాలో 90.54, సూర్యపేట జిల్లాలో 90.43 శాతం మంది ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. అపార్ట్మెంట్ కల్చర్, తరచూ వలసలు, తప్పుడు చిరునామాల వల్ల గ్రామీణ జిల్లాలతో పోలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల్లో ఎన్యుమరేషన్ ఫారాల దాఖలు ఆశించిన స్థాయిలో జరగ లేదని తెలుస్తోంది. ఇండ్లు మారిన వారు ఫారాలు అందుకోలేని సందర్భంలో బీఎల్ఓలు చాలా చోట్ల వారి ఓటును డిలీట్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఆధారాలు సమర్పించడంలో ఇబ్బందులు…
ఎన్నికల సంఘం 2002లో నిర్వహించిన సర్‌లో తాము గానీ తమ వారసులు గాని ఓటరుగా నమోదు కాని వారు ఆధారాలు సమర్పించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చి చాలా ఏండ్లుగా నివాసం ఉంటున్న వారిలో చాలా మందికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్ప ఇతర గుర్తింపు కార్డులు లేవని తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలతో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం పట్టణాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 డ్యాక్యుమెంట్లు లేని వ్యక్తులు కూడా అందుబాటులో ఉన్న వివరాలను సమర్పించవచ్చని ఎన్నికల సంఘం కొంత సడలింపు ఇచ్చింది. ఫారాలు నింపిన ప్రతి ఓటరు ఓటు హక్కుపై నిర్ణయం తీసుకునే ముందు వారికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తుంది. క్షేత్రస్థాయి విచారణ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది. ఓటు తొలగించినా మూడు దశల్లో అప్పిల్ చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అప్పీలు సమయంలో ఓటర్ తగిన ఆధారాలు సమర్పించాలి. అయినా కొన్ని జిల్లాల్లో ఫారాలు సమర్పించడంతో ఓటర్లు ఆసక్తి చూపడం లేదు.
దేశ సగటు కంటే…..
మొదటి, రెండో విడత సర్ ప్రక్రియ జరిగిన 10 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 58.43 కోట్ల ఓట్లకు గాను 5.14 కోట్ల ఓట్లు తగ్గాయి. సగటున 9.6 శాతం ఓట్లకు కొత పడింది. అత్యధికంగా యూపీలో 13.27 శాతం, గుజరాత్ లో 13.4 శాతం ఓట్లు తగ్గాయి. జాతీయ సగటుతో పోల్చినా, రాష్ట్రంలో మ్యాపింగ్ కాని శాతం(69 శాతం)తో పోల్చినా 10 నుంచి 12 శాతం (దాదాపు 40 లక్షలు) ఓట్లు తగ్గుతాయని భావించారు. అయితే జాతీయ సగటుకు భిన్నంగా దాదాపు 60 లక్షలకు పైగా తగ్గుదల ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.



