కార్పొరేట్ శక్తుల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వాలు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య
ఇచ్చిన హామీల అమలులో
ప్రభుత్వాలు విఫలం : రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నాగయ్య, సీనియర్
నాయకులు రాములు, వాసుదేవరెడ్డి
నవతెలంగాణ-సుబేదారి
పేదల పెన్నిధి కామ్రేడ్ పుచ్చకాయల చంద్రారెడ్డి(పీసీఆర్) అని కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా దీన్ దయాల్‌నగర్‌లోని ఉపాధ్యాయ భవన్‌లో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కామ్రేడ్ పుచ్చకాయల చంద్రారెడ్డి సంస్మరణ సభను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర సీనియర్ నాయకులు జి.రాములు, సారంపల్లి వాసుదేవ రెడ్డితోపాటు వీరయ్య.. చంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీసీఆర్ 92 ఏండ్లు నిండు జీవితం గడిపి సీపీఐ(ఎం) కోసం సుదీర్ఘకాలం పని చేశారన్నారు. కార్మికులు, రైతులు, కూలీలు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడారని, కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల అచంచలమైన విశ్వాసంతో ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం రాజీపడకుండా పనిచేసిన ఆయన జీవితం.. నేటి తరానికి ఆదర్శప్రాయమని తెలిపారు. సమాజంలో దోపిడీ, అసమానతలు, అన్యాయాలు అంతరించి సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, మానవ విలువలు నెలకొన్న సోషలిస్టు సమాజం ఏర్పడాలన్నది చంద్రారెడ్డి జీవిత ఆశయమని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అన్నారు. ఆయన స్ఫూర్తితో నిరంతరం ప్రజా పోరాటాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు. కుర్చీల కోసం తప్ప ప్రజల సమస్యలు పట్టడం లేదని వాపోయారు. తెలంగాణలో 30లక్షల మందికి సొంత ఇల్లు లేదని, భూమి ఎవరి సొంతం కాదని, భూమి మీద జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని చెప్పారు. ఢిల్లీ హైకోర్టు పేదలకు ఇండ్లు ఇవ్వాలని చెప్పినా పాలకులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పీఎం ఆవాస్ యోజన సొంత ఇల్లు ఒక్కటీ కూడా రాలేదని అన్నారు.
ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వాలు విఫలం
12 సంవత్సరాల కిందటే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ఆ హామీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తుంగలో తొక్కిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నాగయ్య, నాయకులు రాములు, వాసుదేవరెడ్డి విమర్శించారు. పాలకవర్గాలిచ్చిన హామీలను అమలు చేయడం లేదని తెలిపారు. బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 420 వాగ్ధానాలు చేసి, అందులో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనలో జెన్-జీ పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ చంద్రారెడ్డి ఆశయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చుక్కయ్య , బొట్ల చక్రపాణి, రాగుల రమేష్, టి. ఉప్పలయ్య, గొడుగు వెంకట్, వంకుడోతూ వీరన్న, డి. తిరుపతి, మంద సంపత్, మెట్టు రవి, వేలు రజిత, జీ. రాములు, గాదె రమేష్, ఓరుగంటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
పేదల పెన్నిధి కామ్రేడ్ ‘పుచ్చకాయల చంద్రారెడ్డి’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



