– రైతులకు, రైతు కూలీలకు వెంటనే ప్రభుత్వం పునరావాసం ఇవ్వాలి
– రైతు బతికితేనే దేశం బతుకుతుంది
– బి. రాంచందర్, సంగారెడ్డి జిల్లా వ్య.కా.స అధ్యక్షులు
నవతెలంగాణ – ఝరాసంగం
నిమ్జ్ ప్రాజెక్టు కింద ఎల్గొయి రైతుల మూడు పంటలు పండే సారవంతమైన భూములను బలవంతంగా రైతుల నుండి తీసుకోవద్దని, ఇప్పటికే రైతుల నుండి తీసుకున్న భూములకు సంబంధించి ప్రభుత్వం రైతులకు, రైతు కూలీలకు పునరావాసం వెంటనే ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జైల్ భరో కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుండి ప్రధాన కూడలి వరకు భారీ ఎత్తున రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్జ్ ప్రాజెక్ట్ కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం 123 జి.ఓ కింద తీసుకున్న భూములకు సంబంధించి రైతులకు వ్యవసాయ కూలీలకు పునరావాసం ఇవ్వాలని కోర్టును ఆశ్రయిస్తే రైతులకు, కూలీలకు పునరావసం ఇవ్వాలని కోర్టులు తీర్పులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అధికారులు తక్షణమే కోర్టు ఆదేశాలను అమలు చేసి పునరావాసం కల్పించే వరకు వారి భూముల్లోకి పోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తే ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని ఆగ్రహంతో చెప్పారు. పెరిగిన ధరల మూలకంగా ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని, భవిష్యత్తులో మోడీ విధానాలను మార్చుకోకపోతే ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు ఉదృతం చేస్తామన్నారు.

రైతులకు అందించే కరెంటుపై కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టాలని చూస్తోందనీ, దీని మూలంగా రైతు బతికే పరిస్థితి లేదని, రైతు బతికితేనే దేశం బతుకుతుందన్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా రైతులందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం మార్చడం మూలంగా గ్రామాలలో కూలీలు బతికే పరిస్థితి లేదని, భవిష్యత్తులో పని దొరికే పరిస్థితి అసలే లేదని పేర్కొన్నారు. రోడ్డుపై బైఠాయించిన రైతులను, కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కె.చంద్రన్న, వివోలు,అంగన్వాడి కార్యకర్తలు, నాయకులు శంకర్,సంజివులు, ఖైరత్ అలీ, బాలాప్ప, సంగన్న, ఎసప్ప,రాజు, సిరాజ్, రైతులు,రైతు కూలీలకు తదితరులు పాల్గొన్నారు.



