నవతెలంగాణ-మర్రిగూడ
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 1996-97 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు సోమవారం “ఏబీఆర్ కన్వెన్షన్ హాల్ తుర్కయంజాల్” లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, చదువుకున్న పాఠశాలపై మమకారాన్ని చాటుకుంటూ, ఎన్నో ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలిసిన పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాసం, నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ”కాలం మనల్ని ఎంత దూరం తీసుకెళ్లినా.. మనల్ని తీర్చిదిద్దిన పాఠశాల జ్ఞాపకాలు మాత్రం మన హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోవు” అని అన్నారు. గురువులు అందించిన విద్య, క్రమశిక్షణ, విలువలే తమ జీవితాలకు బలమైన పునాదులుగా నిలిచాయని పేర్కొన్నారు. “స్నేహానికి దూరం అడ్డంకి కాదు..జ్ఞాపకాలకు కాలం అడ్డు కాదు. ఏళ్ల తర్వాత కలిసినా చిన్ననాటి స్నేహం నిన్నటిలాగే అనిపిస్తుంది” అంటూ పూర్వ విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాత స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, పాత సంఘటనలను గుర్తుచేసుకుంటూ కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వారికి విద్య నేర్పిన గురువులను సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాం పల్లి సర్పంచ్ లపంగి నరసింహ,చెరుకు శ్రీరామ్ గౌడ్,వడ్డే ముత్యాలు,సత్యం,శివ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.



