ఐసీసీపై అసోసియేట్ క్రికెట్ బోర్డుల ఆగ్రహం
2027 ప్రపంచకప్ ఫార్మాట్ మార్పుపై అభ్యంతరం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై అసోసియేట్ క్రికెట్ బోర్డులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. గ్లోబల్ పోటీతత్వం తట్టుకుని, ప్రపంచకప్‌లో పోటీపడేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తుండగా.. ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా ఉన్నట్టుండి వన్డే ప్రపంచకప్ అర్హత ప్రక్రియలో మార్పులు తీసుకురావటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. స్కాట్లాండ్, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డులు సంయుక్త లేఖ రాయగా.. నమీబియా, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ కెప్టెన్లు ఐసీసీ విధానాన్ని తప్పుబట్టారు. అయినా, ఐసీసీ నుంచి స్పందన లేకపోవటం ‘అగౌరవంగా’ భావిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశాయి.
న్యూఢిల్లీ : 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫార్మాట్, క్వాలిఫయింగ్ ప్రక్రియలో అనూహ్య మార్పులు తీసుకొచ్చిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై అసోసియేట్ సభ్య దేశాలు స్కాట్లాండ్, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. వన్డే ప్రపంచకప్ ఫార్మాట్, అర్హత ప్రక్రియలో ఎటువంటి సమాచారం లేకుండా ఏకపక్షంగా మార్పులు తీసుకురావటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రపంచకప్ ఫార్మాట్ మార్పు నిర్ణయం అసోసియేట్ సభ్య క్రికెట్ బోర్డులకు కలిగిస్తున్న నష్టంపై సవివరంగా ఐసీసీకి విన్నవించాయి. స్కాట్లాండ్, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డులు ఇప్పటికే ఈ అంశంపై రెండు పర్యాయాలు సమావేశం అయ్యాయి. రెండో సమావేశం జరిగి రెండు వారాలైనా.. ఐసీసీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవటం ‘నిరుత్సాహానికి గురి చేయటంతో పాటు అగౌరవంగా’ భావిస్తున్నామని తాజాగా మరో సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
ఫార్మాట్లో ఏం మారిందంటే
2019, 2023 వన్డే ప్రపంచకప్‌లో పది జట్లు పోటీపడ్డాయి. గ్రూప్ దశలో అన్ని జట్లు రౌండ్ రాబిన్ పద్దతిలో తలపడగా.. టాప్-4 జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. ఈ పద్దతికి ముగింపు పలికిన ఐసీసీ.. 2027 ప్రపంచకప్‌ను పది జట్ల నుంచి 14 జట్లకు పెంచింది. 2027 ప్రపంచకప్‌కు 14 జట్లు అర్హత సాధించే విధానంపై గతంలోనే స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించింది. 14 జట్లు నేరుగా ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతుండగా.. గ్రూప్ దశలో ఏడేసి జట్ల చొప్పున పోటీపడతాయి. కానీ నూతన విధానంలో 14 జట్లు పోటీపడుతున్నా… మూడంచెల ఫార్మాట్ తీసుకొచ్చారు. దీనిలో భాగంగా తొలుత సూపర్ సిరీస్ నిర్వహిస్తారు. ర్యాంకింగ్స్‌లో 12, 13, 14వ స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిరీస్‌లో పోటీపడతాయి. ఈ ముక్కోణపు సిరీస్‌లో విజేతగా నిలిచిన జట్టు 12వ జట్టుగా గ్రూప్ దశ టోర్నమెంట్‌కు అర్హత సాధించనుంది. మిగతా రెండు జట్లు ప్రధాన టోర్నమెంట్లో ఆడకుండానే ఇంటిముఖం పడతాయి. ఈ ముక్కోణపు సూపర్ సిరీస్‌ను సైతం ప్రపంచకప్‌కు ఎంతో ముందే నిర్వహిస్తారు. 12 జట్లు గ్రూప్ దశలో ఆరేసి జట్లుగా తలపడతాయి. గ్రూప్ దశలో టాప్-3లో నిలిచిన జట్లతో పాటు రెండు గ్రూప్‌ల్లో కలిపి మెరుగైన నాల్గో స్థానంలో నిలిచిన జట్టు సూపర్7కు చేరుకుంటుంది. సూపర్7లో రౌండ్ రాబిన్ పద్దతిలో పోటీపడతాయి. టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి.
ఎందుకీ అభ్యంతరమంటే
2027 వన్డే వరల్డ్‌కప్ పాత పద్దతి ప్రకారం వరల్డ్ కప్ లీగ్2 ముగియగా.. స్కాట్లాండ్, యుఎస్ఏ, నెదర్లాండ్స్, ఓమన్‌లు వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌కు అర్హత సాధించాయి. నమీబియా, నేపాల్, యుఏఈ, కెనడాలు వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ప్లే ఆఫ్స్‌తో మరో అవకాశం దక్కించుకున్నాయి. తాజాగా కొత్త ఫార్మాట్‌తో ఈ టోర్నమెంట్‌కు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. పాత పద్దతిలో అసోసియేట్ దేశాల జట్లు నేరుగా ప్రధాన టోర్నమెంట్లో పోటీపడే అవకాశం ఉండేది. కొత్త ఫార్మాట్లో అసోసియేట్ సభ్య దేశాలు కనీసం రెండు ప్రధాన టోర్నమెంట్‌కు వెళ్లలేకపోతున్నాయి. క్వాలిఫయింగ్ టోర్నమెంట్ల ప్రతిభతో ఎటువంటి సంబంధం లేకుండా, నేరుగా ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారణంగా ఒక్క ముక్కోణపు సూపర్ సిరీస్‌తో అదృష్టం పరీక్షించుకోవాల్సిన వస్తుంది.
పాత పద్దతి ప్రకారం ముక్కోణపు సూపర్ సిరీస్‌లో ఆడే మూడు జట్లకు ప్రధాన టోర్నమెంట్లో ఆడే అవకాశం లభించేది. అసోసియేట్ క్రికెట్ బోర్డులు అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వానికి నిలబడుతూ ప్రపంచకప్‌లో ఆడటం ద్వారా ఆటకు, జట్టుకు రెట్టించిన ఉత్సాహం, ఆదరణ తీసుకొచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తుండగా.. ఐసీసీ అర్థరహిత విధాన నిర్ణయాలతో ఇన్నేండ్లు చేసిన కష్టం వృథాగా మారే ప్రమాదం ఉందని స్కాట్లాండ్, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అసోసియేట్ క్రికెట్ బోర్డుల అభ్యంతరాలను పట్టించుకోకపోవటం ప్రపంచ క్రికెట్ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది.
మా మొర వినరా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



