మొబైల్ లోన్ యాప్‌లతో కొత్త చిక్కులు
అప్పుల ఊబిలో మధ్యతరగతి ప్రజలు, యువత
ఒక రుణం తీర్చేందుకు మరో రుణం
చివరకు సిబిల్ స్కోరు దెబ్బ.. మానసిక వేదన
రుణ వసూలు పేరుతో ఏజెంట్ల వేధింపులు, బెదిరింపులు
తీవ్ర ఆర్థిక భారంతో కుటుంబాలు సతమతం
స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని నిమిషాల్లో రుణం లభిస్తుందనే సౌలభ్యం లక్షలాది భారతీయ కుటుంబాలను ప్రమాదకరమైన అప్పుల చక్రవ్యూహం లోకి నెడుతోంది. చిన్న మొత్తంతో మొదలైన రుణం.. ఆ తర్వాత మరో రుణానికి దారి తీస్తూ చివరకు కుటుంబ ఆదాయాన్నే మింగేస్తోంది. వైద్య ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు, ఉద్యోగ, ఉపాధి నియామకాల్లో కోతలు, రోజువారీ అవసరాలు, పెరుగుతున్న జీవన వ్యయం, వేతనాల్లో స్తబ్దత వంటి సమస్యలతో దేశంలోని సామాన్య ప్రజానీకం ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో సులభంగా లభిస్తున్న డిజిటల్ రుణాలు కలిసి దేశంలో కొత్త ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ : ఒకప్పుడు బ్యాంకు రుణం పొందాలంటే అనేక పత్రాలు, వారాల తరబడి నిరీక్షణ అవసరమయ్యేది. ఇప్పుడు మొబైల్ ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసి, ఆధార్-పాన్ వివరాలు నమోదు చేస్తే చాలు.. నిమిషాల్లోనే డబ్బు ఖాతాలో జమవుతోంది. ఈ సౌలభ్యం ఎంతోమందికి ఉపశమనం కలిగించినప్పటికీ.. ఇదే ఇప్పుడు లక్షలాది కుటుంబాలను అంతులేని అప్పుల ఉచ్చులోకి నెడుతోందని తాజా అధ్యయనాలు, నిపుణుల విశ్లేషణలు చెప్తున్నాయి.
చిన్న రుణంతో మొదలై…
లక్నోకు చెందిన ఒక ఇంజినీరింగ్ విద్యార్థి రిషబ్ శుక్లా చివరి సంవత్సరం చదువుతున్న సమయంలో మొదటిసారి లోన్ యాప్ ద్వారా ఒక చిన్న మొత్తం రుణం తీసుకున్నాడు. లోన్ కోసం అనుమతి సులభంగా రావడం, ఈఎంఐ కూడా తక్కువగా ఉండటంతో అవసరం వచ్చినప్పుడల్లా అదే యాప్‌ను ఆశ్రయిం చాడు. మొదట అత్యవసరాల కోసం తీసుకున్న రుణాలు.. తర్వాత రోజువారీ ఖర్చులు, అసవరాలకూ విస్తరించాయి. ఒక దశలో ఈఎంఐ చెల్లించకపోవడంతో మరో యాప్‌లో రుణం తీసుకొని మొదటి రుణాన్ని తీర్చాడు. అలా ఒక రుణం రెండైంది.. రెండు నాలుగయ్యాయి.. చివరకు అప్పులు చెల్లించడానికే కొత్త అప్పులు తీసుకునే పరిస్థితి వచ్చింది. దీంతో ఆయన సిబిల్ స్కోరు దెబ్బతిని.. బ్యాంకుల నుంచి సాధారణ రుణాలు కూడా పొందలేని పరిస్థితి ఏర్పడింది.
రెండో రుణంతోనే అసలు సమస్య…
నిపుణుల అభిప్రాయం ప్రకారం… అసలు ప్రమాదం మొదటిసారి తీసుకున్న రుణంలో లేదు. అయితే ఆ రుణాన్ని తీర్చడానికి మరో రుణం తీసుకోవడంలోనే ఉంది. ఇలా రుణంపై రుణం తీసుకుంటూ వెళ్లడం వల్ల అప్పు తగ్గకపోగా.. మరింత పెరుగుతూ కుటుంబాలను దీర్ఘకాలిక ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. ఇన్‌ఫోమెరిక్స్ రేటింగ్స్ ప్రధాన ఆర్థికవేత్త మనోరంజన్ శర్మ ప్రకారం… దేశంలో వాస్తవిక ఆదాయాలు పెద్దగా పెరగకపోవడం, సామాజిక భద్రత తక్కువగా ఉండటంతో ప్రజలు రుణాల పైనే ఆధారపడుతున్నారు. అయితే చెల్లించే సామర్థ్యానికి మించి అప్పులు పెరిగితే కుటుంబాలు అప్పుల చక్రంలో ఇరుక్కుపోతాయని ఆయన హెచ్చరిస్తున్నారు.
60 శాతం కుటుంబాల ఆదాయం ఈఎంఐలకే!
రుణ పరిష్కార సంస్థ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ నిర్వహించిన సర్వే ఆందోళనకర వాస్తవాలను బయటపెట్టింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిలో దాదాపు 60 శాతం మంది కనీస ఈఎంఐ మాత్రమే చెల్లిస్తుండటం, పూర్తిగా చెల్లింపులు నిలిపివేయడం చేశారని వెల్లడైంది. ప్రతి ఐదుగురిలో ఒకరికి ఇప్పటికే రుణదాతల నుంచి లీగల్ నోటీసులు వచ్చాయి. దాదాపు 60 శాతం కుటుంబాల్లో నెలవారీ ఈఎంఐలు కుటుంబ మొత్తం ఆదాయంతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. మరో 40 శాతం మంది పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు లేదా క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. దీంతో నెలవారీ ఆదాయంలో పెద్ద భాగం అప్పులకే వెళ్తుండగా.. నిత్యావసరాలు, పిల్లల చదువు, అద్దె వంటి ఖర్చులకు కూడా డబ్బు మిగలడం లేదు.
జీతానికి విరుద్ధంగా జీవనశైలి
ముంబయిలో లోన్ రికవరీ ఏజెంట్‌గా పని చేస్తున్న సురేశ్ గౌడ మాట్లాడుతూ… రూ.25 వేల నుంచి రూ.30 వేల జీతం పొందుతున్న యువ ఉద్యోగులు రూ.7 వేల నుంచి రూ.15 వేల వరకు సులభంగా రుణాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కనిపించే జీవనశైలి అనుకరించాలనే ఒత్తిడి, రెస్టారెంట్లు, ట్రిప్పులు, ఖరీదైన వస్తువుల కొనుగోలు వంటి కారణాలతో చాలా మంది ఆలోచించకుండా అప్పులు చేస్తున్నారు. ఇక జీతాల పెరుగుదల మాత్రం చాలా స్వల్పంగా ఉండటంతో ఖర్చులు, ఆదాయం మధ్య అంతరం మరింత పెరుగుతోంది.
జీవన వ్యయం పెరుగుదల
పలు గణాంకాల ప్రకారం 2016 నుంచి 2025 మధ్య దేశంలో ధరలు దాదాపు 40-45 శాతం పెరిగాయి. అంటే పదేండ్ల క్రితం లక్ష రూపాయలతో లభించిన కొనుగోలు శక్తికి ఇప్పుడు దాదాపు లక్షన్నర రూపాయలు అవసరమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యువతకు ప్రారంభ జీతాలు పెరిగినట్టు కనిపించినప్పటికీ… జీవన వ్యయం మరింత వేగంగా పెరగడంతో ఆ ఆదాయం సరిపోవడం లేదు.
రుణ వసూలు పేరుతో వేధింపులు
రుణాలు చెల్లించడంలో ఆలస్యం జరిగితే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది. రోజుకు వందలాది ఫోన్ కాల్స్, కుటుంబ సభ్యులకు, ఆఫీస్‌లకు ఫోన్లు, లోన్ రికవరీ ఏజెంట్లు ఇంటి వద్దకు, పని చేసే ప్రదేశానికి వెళ్లి అవమానించడం, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం, చట్టపరమైన చర్యలతో బెదిరింపు వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని బాధితులు చెప్తున్నారు. కొంత మంది మానసికంగా తీ ఒత్తిడికి గురై ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని వెల్లడించారు.
అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు?
ఓ సర్వే ప్రకారం.. ప్రజలు విలాసాల కోసం కాకుండా ప్రధానంగా అవసరాల కోసమే రుణాలు తీసుకుంటున్నారు. ఇందులో వైద్య అవసరాలు (26 శాతం), కుటుంబ అవసరాలు, విద్య, వివాహాలు (22 శాతం), ఉద్యోగ నష్టం, వ్యాపార ఇబ్బందులు (18 శాతం), రోజువారీ కుటుంబ ఖర్చులు (15 శాతం) వంటివి ఉన్నాయి. ఇల్లు, విద్య, వ్యాపారం వంటి భవిష్యత్తులో ఆదాయం పెంచే అవసరాల కోసం తీసుకునే రుణాలు ఉపయోగకరమైనవేనని నిపుణులు చెప్తున్నారు. అలా కాదని నిత్యావసర ఖర్చులు, పాత రుణాలు తీర్చడం, క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించడం కోసం రుణాలు తీసుకోవడం అత్యంత ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు.
లోన్‌యాప్‌ల టార్గెట్ కార్మిక వర్గం
బ్లూమ్‌బర్గ్ రచయిత ఆండీ ముఖర్జీ విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం భారత్‌లో వ్యక్తిగత రుణాల్లో ఐదింటిలో నాలుగు డిజిటల్ రుణాలే. 2022లో 270 బిలియన్ డాలర్లుగా ఉన్న డిజిటల్ రుణాల మార్కెట్ 2023లో 350 బిలియన్ డాలర్లకు చేరింది. లోన్ యాప్‌ల వార్షిక వ్యాపారం 23 బిలియన్ డాలర్లకు చేరగా.. గత మూడేండ ్లలో ఇది రెండున్నర రెట్లు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ ఆధారిత లోన్ యాప్ లలో 82 శాతం భారత్‌లోనే ఉపయోగిస్తు న్నారని నివేదికలు చెప్తు న్నాయి. అయితే తక్కువ ఆదాయం, పెరుగుతున్న జీవన వ్యయం, సుల భంగా లభించే రుణాలు కలిసి దేశంలోని కార్మిక వర్గాన్ని అప్పుల చక్రవ్యూహంలోకి నెడుతున్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
సులభ రుణం.. సుదీర్ఘ సంక్షోభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



