Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలోచించి ఆరుతడి, పామాయిల్ పంటలు సాగు చేసుకోవాలి

ఆలోచించి ఆరుతడి, పామాయిల్ పంటలు సాగు చేసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని, రాబోయే రెండు నెలల్లో దీని ప్రభావం మరింత పెరిగి వర్షాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. అందువల్ల రైతులు ఆలోచించి ఆరుతడి, పామాయిల్, కూరగాయల పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా పెద్దమందడి రైతు వేదికలో రైతులకు శాస్త్రజ్ఞుల ద్వారా కల్పిస్తున్న అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నీళ్లు వస్తున్నాయి కదా అని తొందరపడి వరి నార్లు వేసుకోవద్దని, రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నట్లు రైతుల దృష్టికి తీసుకువచ్చారు.

గత సంవత్సరం పెద్దమందడి మండలంలో ఆగస్టు నాటికి 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఈ సంవత్సరం కేవలం 76 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్లు తెలిపారు. గత సంవత్సరం పెద్దమందడి మండలంలో 22 వేల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, 18 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేసినట్లు గణాంకాలు తెలిపారు. అయితే ఈ సంవత్సరం వరి సాగుకు సరైన నీళ్లు వచ్చే అవకాశం లేదన్నారు. భూగర్భజలాలు సైతం గణనీయంగా తగ్గిపోతున్నాయని, రానున్న రోజుల్లో మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే పెద్దమందడి మండల రైతులు తెలివిగా ఆలోచించి ఆరుతడి పంటలైన వేరుసెనగ, మినుములు, కూరగాయలు, పామాయిల్ సాగు చేసుకుని ఇతర మండలాలకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. ఆరుతడి పంటలకు అవసరమైన మేలురకం, లాభదాయకమైన విత్తనాలు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ పామాయిల్ సాగు కోసం ప్రభుత్వం అత్యధికంగా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తోందని, రైతులు పామాయిల్ సాగు చేసుకుని అధికంగా లాభాలు ఆర్జించాలని సూచించారు. వరి సాగుకు ఒక ఎకరాకు వాడే నీటితో పామాయిల్ పంటను మూడు ఎకరాలు సాగు చేసుకోవచ్చని తెలిపారు. పామాయిల్ దిగుబడి ఎకరానికి ఐదు నుంచి ఏడు టన్నులు వస్తుందని, ఇప్పటికే పామాయిల్ సాగు చేసిన రైతులు ప్రతి నెల లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నట్లు తెలిపారు. కూరగాయల సాగుకు ప్రభుత్వం ఎకరానికి రూ.9,600 సబ్సిడీ ఇస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకుని కూరగాయలు పండించి లాభాలు ఆర్జించవచ్చన్నారు. రైతుల తరపున వెంకటరెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో గత ఐదు సంవత్సరాల కంటే ముందు ఆరుతడి పంటలే వేసుకునేవారని, జిల్లాకు సాగునీరు విస్తృతంగా ఇవ్వడం వల్ల కష్టం లేని వరి సాగుకు రైతులు అలవాటు పడిపోయారని తెలిపారు. వరి పంటకు మంచి గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వం బోనస్ ఇస్తున్న పరిస్థితుల్లో రైతులు వరి సాగు కాకుండా ఇతర పంటలు ఎందుకు సాగు చేస్తారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆరుతడి పంటల విత్తనాలను మేలురకంగా ఇవ్వడంతో పాటు వీటికి కూడా బోనస్ చెల్లించాలని కోరారు. నాణ్యమైన వేరుసెనగ విత్తనాలు అందిస్తే రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపుతారని అన్నారు. మండల వ్యవసాయ అధికారి సైదులు, సర్పంచ్ సూర్యగంగమ్మ సైతం మాట్లాడి రైతులను ఆరుతడి పంటల వైపు వెళ్లాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీఓ పర్ణిత, సింగిల్ విండో చైర్మన్ సత్యారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -