Wednesday, August 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు‌సర్‌ ‌పేర అర్హుల ఓట్ల తొలగింపుపై పోరాటం

‌సర్‌ ‌పేర అర్హుల ఓట్ల తొలగింపుపై పోరాటం

- Advertisement -

దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించే అవకాశం
అర్హులైన ఓటర్ల హక్కులు కాపాడేందుకు చర్యలు
కొండల్‌‌రెడ్డికి భూకేటాయింపులపై సమగ్ర విచారణ జరపాలి
​టెస్సరాక్ట్‌ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూమి కేటాయింపా?
వాస్తవాలు తేలేవరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టం : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సర్‌ ప్రక్రియలో అర్హులైన కొంతమంది ఓటర్ల పేర్లు తొలగించబడుతున్న‌ట్టు కనిపిస్తోందనీ, అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా న్యాయపరంగా, పార్టీ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) స్పష్టం చేశారు. అర్హులైన ఓట్లు తొలగించకుండా పోరాటం చేస్తామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌లో ‌సర్‌ కమిటీతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లా‌డుతూ సర్‌ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు. సర్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో మొత్తం 3.39 కోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పారు. అందులో దాదాపు 74 లక్షల ఓట్లు ‘అన్‌కలెక్టబుల్‌’గా ఉన్నాయనీ, వాటి నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదని ఎన్నికల కమిషన్‌ చెప్తోందన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు అన్‌కలెక్టబుల్‌గా ఉండటం, వాటిలో చాలా ఓట్లు తొలగించబడే అవకాశం ఉందనే పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. సుమారు 60 లక్షల ఓట్లలో అనామలీస్‌ ఉన్నట్టు సమాచారం ఉందన్నారు. సర్‌ ప్రక్రియ పూర్తయ్యే నాటికి కేవలం రెండు కోట్ల ఓట్లు మాత్రమే ఎలాంటి సమస్యలు లేకుండా మిగిలే పరిస్థితి కనిపిస్తోంద‌నీ, మిగిలిన ఓట్లలో కొన్ని తొలగిపోయే అవకాశం ఉందనీ, మరికొన్నింటిలో తప్పులు, అనుమానాలు ఉన్నట్టు ఎన్నికల కమిషన్‌ నుంచి సమాచారం వస్తోందని చెప్పారు.

అర్హులైన వారి ఒక్క ఓటు కూడా అన్యాయంగా తొలగిపోకుండా చూడటం అత్యంత ముఖ్యమని అన్నారు. ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తామని ఎన్నికల అధికారులు చెప్తున్నారని తెలిపారు. ఆ జాబితా ప్రచురణ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ఇప్పటికే పార్టీ లీగల్‌ సెల్‌తో సమావేశమై, న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నామని వివరించారు. రేపు, ఎల్లుండి కొన్ని సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నామని అన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో చర్చించిన అనంతరం ఆ సమావేశాల పూర్తి వివరాలు, కార్యాచరణను వెల్లడిస్తామన్నారు. జిల్లాల వారీగా జరిగే సమావేశాల్లో స్థానిక పరిస్థితులను సమీక్షించి, అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

సీఎం సోదరుడికి భూకేటాయింపులపై విచారణ చేపట్టాలి
​ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు ఎనుముల కొండల్‌రెడ్డికి చెందిన టెస్సరాక్ట్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ కంపెనీకి విలువైన ప్రభుత్వ భూమి కేటాయించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎనుముల కొండల్‌రెడ్డి తన లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో టెస్సరాక్ట్‌ అడ్వాన్స్‌‌డ్‌ సిస్టమ్స్‌, భూపాల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు తాను బాధ్యత వహిస్తున్న‌ట్టు పేర్కొన్నారని అన్నారు. టెస్సరాక్ట్‌ సంస్థ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగంలో పనిచేస్తున్నట్టు అమెరికా కాన్సుల్‌ జనరల్‌ కూడా పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. అనంతరం యూఎస్‌–ఇండియా స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరమ్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో టెస్సరాక్ట్‌ అడ్వాన్స్‌‌డ్‌ సిస్టమ్స్‌ చై‌ర్మెన్‌గా కొండల్‌రెడ్డి ఎనుముల చేరినట్టు సంబంధిత సంస్థ స్వయంగా ప్రకటించిందని వివరించారు. 2025 మార్చి 31 నాటికి ఆ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేరనీ, ఉద్యోగుల సంఖ్య సున్నా అని కంపెనీ వివరాల్లోనే పేర్కొన్నారని చెప్పారు.

కంపెనీ పెయిడ్‌అప్‌ క్యాపిటల్‌ కేవలం రూ.లక్ష మాత్రమేననీ, పటాన్‌చెరు ప్రాంతంలో ఒక చిన్న చిరునామాను కార్యాలయంగా చూపిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆర్థిక సామర్థ్యం ఉన్న కంపెనీకి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సుమారు ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిందనీ, ఆ భూమి విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని కేటీఆర్‌ ఆరోపించారు. ఆ భూమిని సుమారు రూ. కోట్లకే, గజానికి సుమారు రూ.3,700 చొప్పున కేటాయించినట్లు తమకు అందిన వివరాలను ‌బట్టి తెలుస్తుందని అన్నారు. “ఒక్క ఉద్యోగి లేని, రూ.లక్ష పెయిడ్‌అప్‌ క్యాపిటల్‌ ఉన్న కంపెనీకి రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించడం ఎలా సాధ్యమైందనీ? ఇది కుంభకోణం కాదా?”అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

సంబంధం లేదని శ్రీధర్‌‌బాబు ఎలా చెప్తారు?
టెస్సరాక్ట్‌ కంపెనీకి, ముఖ్యమంత్రి సోదరుడు ఎనుముల కొండల్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీధర్‌బాబు చెప్తున్నారని కేటీఆర్‌ అన్నారు. అయితే కొండల్‌రెడ్డి స్వయంగా తన లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో టెస్సరాక్ట్‌ చైర్మెన్‌గా పేర్కొన్నారనీ, యూఎస్‌–ఇండియా స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరమ్‌ కూడా ఆయనను టెస్సరాక్ట్‌ చైర్మెన్‌గా పేర్కొన్నదనీ, సంబంధం లేదని మంత్రి ఎలా చెప్తారని ప్రశ్నించారు. “మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? ముఖ్యమంత్రి సోదరుడికి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా?” అని శ్రీధర్‌బాబును కేటీఆర్‌ నిలదీశారు.

ఎనుముల జగదీశ్‌‌రెడ్డితో రూ.వెయ్యి కోట్ల ఒప్పందం
ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి అమెరికా పర్యటనలో ఆయన మరో సోదరుడు ఎనుముల జగదీశ్‌రెడ్డి స్వచ్ఛ్‌ బయో సంస్థతో సుమారు రూ.వెయ్యి కోట్ల ఒప్పందానికి సంబంధించిన ఒప్పందం జరిగిందని కేటీఆర్‌ ‌చెప్పారు. ఆ ఒప్పందం తర్వాత ఆ సంస్థకు ఎక్కడైనా భూములు కేటాయించారా? పెట్టుబడులు వచ్చాయా? అనే అంశాలను కూడా వెలికి తీస్తామన్నారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్‌రెడ్డికి సంబంధించిన రూ.1,137 కోట్ల అమృత్‌ కాంట్రాక్టులపై గతంలోనే ప్రశ్నించామని కేటీఆర్‌ గుర్తుచేశారు. సింగరేణి, సైట్‌ విజిటేషన్‌ సర్టిఫికెట్లు, ఇతర కాంట్రాక్టుల్లోనూ అక్రమాలు జరిగాయనీ, తాము గతంలో ఆధారాలతో సహా ప్రజల ముందుంచామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి మరో సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డికి ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా కొడంగల్‌లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కలెక్టర్లు, ఎస్పీలు ఆయన సమక్షంలో పాల్గొంటున్నారనీ, అధికారిక ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

లగచర్లలో భూసేకరణ అనంతరం ప్లాట్ల పంపిణీ కార్యక్రమంలోనూ ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారని గుర్తు చేశారు. “అధికారిక హోదా లేని వ్యక్తికి ఇంత ప్రొటోకాల్‌ ఎలా వస్తోంది? ముఖ్యమంత్రి సోదరులకు ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా?” అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన అన్ని భూములు, కంపెనీలు, కాంట్రాక్టుల వివరాలను ప్రజల ముందుంచుతామని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన కాంట్రాక్టులు, కంపెనీలపైనా తాము గతంలో ప్రశ్నలు లేవనెత్తామని అన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ వనరులు, భూములు, కాంట్రాక్టులు దక్కుతున్నాయా అనే అంశంపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు.

కర్నాటకలో ఒక న్యాయం… తెలంగాణలో మరో న్యాయమా?
కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణికి భూమి కేటాయింపు వ్యవహారాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు. మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో భూముల కేటాయింపుపై ఆరోపణలు రావడంతో అక్కడ తీవ్ర రాజకీయ, న్యాయపరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. “కర్ణాటకలో మూడెకరాల భూ కేటాయింపుపై ఇంతటి విచారణ, రాజకీయ ప్రకంపనలు వచ్చినప్పుడు తెలంగాణలో రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కేటాయింపుపై ఎందుకు విచారణ జరగకూడదని కేటీఆర్‌ ప్రశ్నించారు. కర్ణాటకలో ఒక న్యాయం, తెలంగాణలో మరో న్యాయం ఎలా ఉంటుందని నిలదీశారు. టెస్సరాక్ట్‌ భూ కేటాయింపు వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. త్వరలోనే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామనీ, సమగ్ర విచారణ జరిపించాలని కోరుతామని అన్నారు. అవసరమైతే లోకాయుక్తను, న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్‌‌రెడ్డి సోదరుడైతే ఏమైనా చేయొచ్చా?అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్‌ తేల్చిచెప్పారు.

జీఆర్‌ఎంబీ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరించాలి
​తెలంగాణలో నీటి ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఏడు తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతుందనీ, ఆ అంశాన్ని గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (జీఆర్‌ఎంబీ) ఎజెండాలో చేర్చడం దారుణమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీల వైఖరి దారుణమని విమర్శించారు. “8 + 8 = 0” అని ఊరికే అనలేదనీ, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే ఎంపీలు రాష్ట్రంలో లేరని చెప్పారు. పంపులు ఆన్‌ చేయకుండా యాగాలు చేస్తే రైతులకు నీళ్లు రావనీ, మానవ ప్రయత్నం కూడా అవసరమని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -