17 రోజులకే తొలగింపు ఉత్తర్వులు
కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలే కారణం ?
నూతన కార్యదర్శిగా దీప్తి గౌర్ ముఖర్జీ నియామకం
న్యూఢిల్లీ : 1993 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి దీప్తి గౌర్ ముఖర్జీని కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా నియమించింది. గత నెల 23న జారీ చేసిన ఉత్తర్వును పాక్షికంగా సవరించి సోమవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఈ నియామకాన్ని జరిపింది. పదిహేడు రోజుల క్రితం ఆ పోస్టులో నియమితులైన నరేష్ పాల్ గంగ్వార్‌ను ఆ పోస్టు నుంచి తప్పించింది. నీట్ (యూజీ)ని నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కేంద్ర ఉన్నత విద్యా శాఖ పర్యవేక్షిస్తోంది. మే 3న జరిగిన నీట్ (యూజీ) పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అవడంతో ఆ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసి తిరిగి నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్ఏటీని వివాదాలు చుట్టుముట్టాయి.
కుటుంబంపై సబ్సిడీల స్వాహా ఆరోపణలు
గంగ్వార్ బదిలీ సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని ప్రభుత్వ సీనియర్ అధికారులు చెబుతున్నారు. అయితే జూలై 23న గంగ్వార్ నియమితులైన తర్వాత ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో వచ్చిన ఓ కథనం దుమారాన్ని రేపింది. నేషనల్ హార్టీకల్చర్ బోర్డ్ పథకం కింద గంగ్వార్ భార్య, కుమారుడు ప్రభుత్వ సబ్సిడీల రూపంలో రూ.1.16 కోట్లకు పైగా పొందారన్నది ఆ కథనం సారాంశం. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై సీపీఐ (ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ స్పందిస్తూ ‘ఇదో పెద్ద ప్రహసనం. పరీక్షల కుంభకోణాలు, పేపర్ లీకేజీలపై జవాబుదారీ కోరుతుంటే ప్రభుత్వం నరేష్ పాల్ గంగ్వార్‌ను ఉన్నత విద్యా శాఖ నూతన కార్యదర్శిగా నియమించింది. ఈ ఐఏఎస్ అధికారి తల్లి, భార్య, కుమారుడు కలిసి వాణిజ్య పంటలను (దోస సాగు) ప్రోత్సహించే పథకం కింద ప్రభుత్వ సబ్సిడీల రూపంలో రూ.1.16 కోట్లకు పైగా పొందారు. ప్రధాని జవాబుదారీతనాన్ని నిర్ధారించే పద్ధతి ఇదేనా?’ అని ప్రశ్నించారు. ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా నియమితులు కావడానికి ముందు గంగ్వార్ పశు సంవర్థక, పాడి పరిశ్రమ శాఖలో కూడా కార్యదర్శిగా పనిచేశారు.
పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం
క్యాబినెట్ నియామకాల కమిటీ మరో ఆరుగురు కార్యదర్శి స్థాయి అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ 1994 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి గంగ్వార్‌ను ఏ శాఖలో నియమించిందీ తెలుపలేదు. నీట్ (యూజీ) ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా దేశ రాజధానిలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన జరిపిన సమయంలోనే 1992 బ్యాచ్ మణిపూర్ కేడర్ ఐఏఎస్ అధికారి వినీత్ జోషీ స్థానంలో గంగ్వార్‌ను ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా కేంద్రం గత నెల 23న నియమించింది. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కూడా విద్యార్థులు పట్టుబట్టడంతో ఆయన ఎట్టకేలకు జూలై 25న పదవి నుంచి వైదొలిగారు.



