Wednesday, August 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయజ్ఞాలు కాదు..రావాల్సిన నీటి వాటా కోసం పోరాడండి

యజ్ఞాలు కాదు..రావాల్సిన నీటి వాటా కోసం పోరాడండి

- Advertisement -

ఖరీఫ్‌ సాగుపై అఖిలపక్ష సమావేశం పెట్టాలి
కేఆర్ఎం సమావేశంలో నికర జలాలపై చర్చించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్

​తెలంగాణ ప్రభుత్వం వర్షాల కోసం యజ్ఞం చేయడం కాదు.. రావాల్సిన నీటి వాటాల కోసం పోరాటం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. అలాగే, వర్షాభావం వల్ల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఖరీఫ్ సాగుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చించాలని కోరారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులఫై ఈనెల 13వ తేదీన జరిగే కృష్ణానది మేనేజ్‌‌మెంట్‌ ‌బోర్డులో వివరించాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావం వల్ల ఆల్మట్టి ప్రాజెక్టులోకి నీరు చేరి 129 టీఎంసీల సామర్థ్యానికిగాను 124 టీఎంసీల నీరు ఉందన్నారు. అక్కడి నుంచి నారాయణపుర్ ప్రాజెక్టుకు, దాన్నుంచి జూరాలకు 35 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారని చెప్పారు. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 23 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని తెలిపారు. శ్రీశైలంలో 182 టీఎంసీలు నీరు చేరిందని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌కు 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. శ్రీశైలం నుం‌చి పోతిరెడ్డిపాడు ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు పంపుతున్నారని తెలిపారు. డ్యాములన్నీ నిండిన తర్వాతనే సాగర్‌కు నీటిని విడుదల చేస్తామనడం అన్యాయమన్నారు. ఉన్న నీటిని కాలువలకు వదలడం వల్ల బోర్లు, బావులకు భూగర్భ జలాలు పెరుగుతాయని, దీంతో మెట్ట పంటలకు ఉపయోగపడుతుందని తెలిపారు.

మిర్యాలగూడ ప్రాంతంలో వందలాది రైస్‌ ‌మిల్లులు ఉన్నాయని, మిల్లులు నడవకపోతే అందులో పనిచేసే వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోవడమే కాక బియ్యం ధరలూ పెరుగుతాయని హెచ్చరించారు. రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు నీటిని వదిలి సేద్యమయ్యేలా చూడాలన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో పూడిక బాగా పెరగడం వల్ల నీటి నిల్వ తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారని తెలిపారు. పూడికను తొలగించడం వల్ల సుమారు 100 టీఎంసీల నీరు రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుందని సూచించారు. యజ్ఞయాగాలు చేయడం వల్ల ప్రయోజనం అంతగా ఉండదని, ఉన్న నీటి ఏ విధంగా వాడుకోవాలో ఆలోచించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు,జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి, పరుశరాములు, పట్టణ కమిటీ కార్యదర్శి భావండ్ల పాండు ఉన్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -