నిర్వహణ పనులను మరింత ముమ్మరం చేయాలి : టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్
సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో ప్రజా/బస్తీ బాట కార్యక్రమం
నవతెలంగాణ- సిటీబ్యూరో
వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరాయే తమ లక్ష్యమని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జితేష్ వి.పాటిల్ అన్నారు. నిర్వహణ పనులను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా/బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని పారడైజ్ డివిజన్, లాలాగూడ సెక్షన్‌లోని వడ్డెర బస్తీ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికులను విద్యుత్ సరఫరా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. వడ్డెర బస్తీలోని అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ (డీటీఆర్)ను పరిశీలించి దాని చుట్టూ ఎఫ్‌ఆర్‌పీ (ఫైబర్ రీ ఇన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్) ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ పరికరాల సమీపంలో పిల్లలు సంచరించే అవకాశం ఉన్నందున భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.
వినాయక ఆలయ ప్రాంగణంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా అనువైన ప్రదేశానికి తరలించాలని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ఉండేందుకు విద్యుత్ లైన్లు, డీటీఆర్ నిర్మాణాలు, ఫీడర్లు, స్తంభాల నిర్వహణ పనులను నిరంతరం చేపట్టాలని తెలిపారు. ప్రతి ఫిర్యాదునూ సీరియస్‌గా తీసుకుని పరిష్కరించాలని సూచించారు.
ప్రత్యేకంగా సీతాఫల్‌మండి 33/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి వెలువడుతున్న 11 కేవీ గాంధీ స్టాచ్యూ ఫీడర్‌లో తరచూ సంభవిస్తున్న ట్రిప్పింగ్‌లను తనిఖీలు నిర్వహించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న “వాక్ అలోంగ్ ది లైన్” కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రతి విద్యుత్ లైన్, డీటీఆర్, ఫీడర్‌నూ క్రమం తప్పకుండా పరిశీలిస్తూ లోపాలను ముందుగానే గుర్తించి సరిదిద్దాలని సూచించారు. చెట్ల కొమ్మల తొలగింపు, లూజ్ లైన్ల బిగింపు, డీటీఆర్ యార్డుల శుభ్రత, క్రిపర్స్ తొలగింపు, వంగిపోయిన స్తంభాల సరిదిద్దడం వంటి పనులను నిరంతరం కొనసాగించాలని తెలిపారు.ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ప్రజా/బస్తీ బాట కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేందుకు అధికారులు, సిబ్బంది ప్రజలతో నేరుగా మమేకమవుతూ సేవలందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీజీఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.నర్సింలు, మెట్రో జోన్ చీఫ్ ఇంజినీర్ పి.కరుణాకర్ బాబు, సికింద్రాబాద్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎల్.గోపయ్య, పారడైజ్ డివిజనల్ ఇంజినీర్ బ్రహ్మానందం, ఏడీఈలు ఈ.రమణయ్య, ఆదినారాయణ, ఏఈలు బాలరాజు, కిష్టయ్య, సబ్ ఇంజినీర్ నరేష్, లాలాగూడ సెక్షన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.
నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



