ఇసుక క్వారీల్లో ‘లోడింగ్’ దందా?
లారీకి రూ.3 వేల వరకు కాంట్రాక్టర్‌ల వసూళ్లు
అధికారుల నియంత్రణ ఏదీ?
నవతెలంగాణ-జి.శేఖర్(ఉప్పల్)
ఇసుక క్వారీలలో కాంట్రాక్టర్‌ల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ‘దోపిడే మా మార్గం.. మేము ఎవరి మాట వినం.. మేము చెప్పినంత ఇవ్వాల్సిందే లేకుంటే లోడింగ్ చెయ్యం.. ఇదే ఫైనల్’ అంటూ రాష్టంలోని పలు జిల్లాల్లో ఇసుక క్వారీల్లో లోడింగ్ పేరుతో కాంట్రాక్టర్లు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని లారీ యజమా నులు ఆరోపిస్తున్నారు. తమకు నిర్దేశించిన మొత్తాన్ని చెల్లిస్తేనే లారీలు లోడ్ చేస్తామని కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొండయ్యగూడెం, సాంబా యిగూడెం, జనంపేట, కొమ్ముగూడెం, ములుగు జిల్లాలోని వాడేగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్‌పూర్-1, పుష్కపల్లి-1, పలుగుల-3 తదితర క్వారీల్లో లోడింగ్, కంట, సీరియల్, గ్రామపంచాయతీ తదితర పేర్లతో ఒక్కో లారీ నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని లారీ యజమానులు చెబు తున్నారు. క్వారీలో రోజుకు సుమారు 150 లారీలు లోడ్ అవుతాయని, ఈ లెక్కన ఒక్కో క్వారీలో రోజుకు లక్షల రూపాయల మేర వసూళ్లు జరుగుతున్నాయని వారు పేర్కొ న్నారు. ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లను నియంత్రించాల్సిన అధికారులే చూసీచూడనట్లు వ్యవహ రిస్తున్నారని ఆరోపించారు.
ఫోన్లు చేసినా స్పందించని ఎస్‌ఆర్‌ఏలు
ఇసుక క్వారీల్లో సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కరించాల్సిన ఎస్‌ఆర్‌ఏలు ఫోన్ చేసినా స్పందించడం లేదన్న విమర్శలు వినిపి స్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి క్వారీల్లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
టీజీఎండీసీ కార్యాలయం ఎదుట ఆందోళన
రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ఇసుక క్వారీల్లో జరుగుతున్న అక్రమ వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేస్తూ జంట నగరాల ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మంగళవారం హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని టీజీఎండీసీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. సంఘం నాయకులు సురభి రాజుగౌడ్, నర్రి వెంకన్న, కాసుల జంగయ్యగౌడ్, బలవంతరెడ్డి మాట్లాడుతూ.. క్వారీల్లో లోడింగ్, సీరియల్, కంట తదితర పేర్లతో ఒక్కో లారీ యజమాని నుంచి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత క్వారీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. క్వారీల్లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ ఇసుకను కూడా అరికట్టాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఆ కాంట్రాక్టర్లను
బ్లాక్ లిస్టులో పెట్టాలి
లోడింగ్ పేరుతో ఒక్కో లారీ నుంచి రూ.2,700 వరకు అక్ర మంగా వసూలు చేస్తూ యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి.
మోటే సత్తయ్య ఇసుక లారీ యజమాని
చెప్పినంత ఇస్తేనే లోడింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



