కేటీఆర్ చొరవతో స్వదేశానికి రాక
జీవితాంతం రుణపడి ఉంటానన్న మహాముదా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గల్ఫ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నకిలీ ఏజెంట్లు చేస్తున్న మోసాలకు మరో మహిళ బలైంది. టూరిస్ట్ వీసాపై మస్కట్‌కు వెళ్లిన వరంగల్‌కు చెందిన ఓ మహిళ నరకయాతనను అనుభవించింది. అడుగడుగునా భయంతో బతికింది. 25 రోజులపాటు ఆమె జీవితం అక్కడ బందీ అయ్యింది. ఆమె పాసుపోర్టును లాక్కుని స్వదేశానికి వెళ్లకుండా అడ్డంకులు సృష్టించారు. జైలు పేరు చెప్పి సబ్ ఏజెంట్ భయపెట్టారు. రూ.1.13 లక్షలు ఇస్తేనే విడుదల చేస్తామని హెచ్చరించారు. ఆర్‌టీవీ యాంకర్ మనోజ్ గుర్తించి బలగం టీవీ సీఈవో, జర్నలిస్టు బాలు కాయితికి వివరించారు. మహాముదా దీనగాథను కేటీఆర్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. కేటీఆర్ వెంటనే స్పందించి స్వదేశానికి తీసుకొచ్చే బాధ్యతను తీసుకున్నారు. రెస్క్యూ యంత్రాంగం వెంటనే కదిలింది. మస్కట్‌లోని బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ అధ్యక్షుడు ఆహ్మద్ రంగంలోకి దిగారు. సబ్‌ఏజెంట్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని సమకూర్చారు. మహాముదాను భారత రాయబార కార్యాలయానికి తరలించారు. ఎంబసీ, పోలీసుల సమన్వయంతో మహాముదా బయటపడ్డారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఆమె స్వదేశానికి మంగళవారం సురక్షితంగా చేరుకున్నారు. ఆమెను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఖర్చును కేటీఆర్ వ్యక్తిగతంగా భరించారు. హైదరాబాద్‌కు ఆమె చేరుకున్న తర్వాత కేటీఆర్‌కు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. టూరిస్ట్ వీసాలపై గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లొద్దని కేటీఆర్ కోరారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారు తప్పనిసరిగా సంబంధిత కంపెనీ వీసా లేదా చెల్లుబాటు అయ్యే వర్క్ వీసాతోనే వెళ్లాలని సూచించారు. నకిలీ ఏజెంట్ల మాటలు నమ్మి టూరిస్ట్ వీసాలపై వెళ్లడం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విదేశాలకు వెళ్లే ముందు ఏజెంట్, కంపెనీ, ఉద్యోగం, వీసా తదితర వివరాలను పూర్తిగా నిర్ధారించుకోవాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
మస్కట్‌లో ఓ మహిళ నరకయాతన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



