వారి హక్కుల కోసం యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చించాలి : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రయివేటు ఆస్పత్రుల్లో పని చేసే నర్సులకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవటం బాధకరమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో తనను కలిసిన ప్రయివేటు హాస్పిటల్స్ నర్సులతో ఆమె మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రయివేటు హాస్పిటల్స్ యాజమాన్యాలు పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. అయినా ఆయా హాస్పిటల్స్ లో పనిచేసే సిబ్బందికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని విమర్శించారు. కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్లకు లేకపోవడం సరికాదన్నారు. వెంటనే ఈ విషయంపై ప్రభుత్వం ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి ఇన్సూరెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా పని వేళలు, జీతాలు, ఓవర్ టైమ్ వంటి అంశాల్లో తెలంగాణాకు చెందిన ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోని ప్రయివేటు హాస్పిటల్స్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రయివేటు ఆస్పత్రుల సిబ్బందికి, నర్సులకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రయివేటు ఆస్పత్రుల్లో నర్సులకు హెల్త్ ఇన్సూరెన్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



