Wednesday, August 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపెండింగ్ ప్రాజెక్టులపై ప్రజా ఉద్యమం

పెండింగ్ ప్రాజెక్టులపై ప్రజా ఉద్యమం

- Advertisement -

​పాలకులు నిర్లక్ష్యం వీడి నిధులు విడుదల చేయాలి
29, 30, 31తేదీల్లో భువనగిరి నుంచి హైదరాబాద్‌‌కు పాదయాత్ర
31న ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మహాధర్నా : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్

నవతెలంగాణ – భువనగిరి
​యాదాద్రి భువనగిరి జిల్లా సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో గత, ప్రస్తుత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. పెండింగ్‌ ‌ప్రాజెక్టులపై ఈ నెల 29, 30, 31 తేదీల్లో భువనగిరి నుంచి హైదరాబాద్‌‌కు పాదయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రాజెక్టుల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం నిర్మిస్తున్నట్టు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌‌లో మంగళవారం విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కీలక ప్రాజెక్టులైన బస్వాపురం, గంధమల్ల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, నవాబ్ పేట రిజర్వాయర్ ప్రాజెక్టు, చిన్న నీటి పారుదల కాలువలైన ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బునాదిగాని, ఆసిఫ్ నగర్ కాలువ పునరుద్ధరణ పనులు పూర్తి చేయడంలో పాలకులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పేరిట రైతు లు, నిర్వాసితులు, ప్రజలతో కలిసి పాదయాత్ర చేపట్ట నున్నట్టు తెలిపారు. 29న జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పాదయాత్ర ప్రారంభమై 31న హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌కు చేరుకుంటుందన్నారు. మహాధర్నాలో రైతులు, వ్యవసాయ కార్మికులు, నిర్వాసితులు, వృత్తిదారులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

నిధుల జాప్యంపై వివరణ ఇవ్వాలి
90 శాతం పూర్తయిన బస్వాపురం ప్రాజెక్టుకు మిగతా నిధులు ఇవ్వడంలో జాప్యంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని జహంగీర్‌ ‌కోరారు. సుమారు 420 కోట్లకు పైచిలుకు డబ్బులు నిర్వాసితులకు చెల్లించాల్సి ఉందన్నారు. రూ.80 కోట్లు మంజూరు చేసినట్టు చెబుతున్న ఫైనాన్స్ కమిటీ వద్దే సంవత్సరం నుంచి నిధులు నిలిచిపోయాని చెప్పారు. అరకోర, అత్తెసరు నిధులు కేటాయిస్తూ దశాబ్దాల తరబడి ప్రాజెక్టు పూర్తి చేయకుండా జాప్యం చేస్తున్నారని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, ఏదుల రిజర్వాయర్ ద్వారా డిండి ప్రాజెక్టుకు నీళ్లు తేవాలన్నారు. డిండి ప్రాజెక్టు ద్వారా రాచకొండ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి రిజర్వాయర్ ద్వారా నారాయణపూర్, చౌటుప్పల్ మండలాల గ్రామాలకు గ్రావిటీ ద్వారా సాగు నీరు అందించాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా నవాబుపేటకు నీళ్లు ఇస్తామని సుమారు 15 సంవత్సరాల కింద కాల్వలు తొవ్వారని, అవి నిరుపయోగంగా ఉన్నాయని గుర్తు చేశారు. ధర్మారెడ్డిపల్లి కాలువ వెడల్పు పనులు నిలిచిపోయాయన్నారు. పిలాయిపల్లి, బునాదిగాని కాలువల పనులు అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు. కాలువల కింద 30 కల్వర్టులు కట్టాల్సి ఉందన్నారు.

డీపీఆర్‌ ఏదీ..?
మూసీ ప్రక్షాళన, గోదావరి జలాల అనుసంధానం కోసం ప్రభుత్వం దగ్గర డీపీఆర్ లేదని జహంగీర్‌ విమర్శించారు. బస్వాపురం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపడానికి పూర్తిస్థాయిలో ప్రణాళికలు రూపొందించి నిధులు కేటాయించాలని, శామీర్‌‌పేట కాల్వ ద్వారా బొమ్మలరామారం, బీబీనగర్, భువనగిరి, పోచంపల్లి మండలాలకు సాగునీరు అందించాలన్నారు. ఈ నెల16న భువనగిరిలో సాగు తాగునీటి సమస్య పరిష్కారం కోసం వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల నేతలు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -