నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ, విద్యారంగ ప్రధాన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ (జాక్టో) డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్ లోని ఎస్టీయూ భవన్‌లో మంగళవారం జాక్టో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. తొలిదశలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలుత పాఠశాల విద్యా సంచాలకులు నవీన్ నికోలస్ తో భేటీ అయ్యారు. అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్‌కు 12 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో తదుపరి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని జాక్టో నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా జాక్టో చైర్మెన్ జి. సదానందం గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు. 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలనీ, పెండింగ్‌లో ఉన్న బిల్లులు, 5 డీఏలను సత్వరమే విడుదల చేయాలనీ, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని తదితర డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. పర్యవేక్షక పోస్టుల భర్తీ, ఉమ్మడి సర్వీస్ నిబంధనల రూపకల్పనతో పాటు బదిలీలు, పదోన్నతులు తదితర డిమాండ్ల తో పాటు మోడల్ స్కూళ్లు, ఎయిడెడ్ స్కూళ్లు, కేజీబీవీ, యుఆర్ఎస్, గురుకులాల ఉపాధ్యాయుల డిమాండ్లను జాక్టో ప్రస్తావించింది. ఈ కార్యక్రమంలో జాక్టో సెక్రెటరీ జనరల్ కె. కృష్ణుడు, కో-చైర్మన్ పర్వతి సత్యనారాయణ, నాయకులు హేమచంద్రుడు, జయబాబు, రాములు, అలీం, మల్లికార్జున రెడ్డి, నగేష్ యాదవ్, గీతాంజలి, రాజభాను చంద్ర ప్రకాష్, నయీం, జుట్టు గజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలి : జాక్టో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



