Wednesday, August 12, 2026
E-PAPER
Homeజాతీయంఅమిత్ షా పార్ల‌మెంట్‌కు రావాలి

అమిత్ షా పార్ల‌మెంట్‌కు రావాలి

- Advertisement -

విద్యార్థుల‌పై ఢిల్లీ పోలీసుల క్రూర‌మైన దాడికి స‌మాధానం చెప్పాలి
ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న… పోటీగా అధికార ఎన్డీఏ నిరసన
లోక్‌స‌భ‌లో రెండు బిల్లులు, రాజ్య‌స‌భ‌లో ఒక బిల్లు ఆమోదం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల చివరి దశలో అధికార, ప్ర‌తిపక్షాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఢిల్లీలో విద్యార్థులు, యువ‌కుల‌పై ఢిల్లీ పోలీసులు, కేంద్ర బ‌ల‌గాల క్రూర‌మైన దాడి, అయోధ్య రామమందిర విరాళాల అపహరణకు నిరసనగా ప్ర‌తిపక్ష ఎంపీలు ఆందోళ‌న‌ చేపట్టారు. అయితే దానికి పోటీగా అధికార ఎన్డీఏ ఎంపీలు జార్ఖండ్‌లో ఉద్యోగార్థులపై పోలీసుల చర్యకు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపారు. మంగళవారం పార్లమెంట్ మ‌క‌ర‌ ద్వారం వద్ద ప్ర‌తిపక్ష ఎంపీలు నిరసనలు చేపట్టారు. ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలంటూ నినాదాలతో హోరెత్తించారు. అయితే దీనికి పోటీగా ఎన్డీఏ ఎంపీలు ప్ల‌కార్డులు ప‌ట్టుకుని ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో పార్లమెంట్ మ‌క‌ర‌ ద్వారం వద్ద ఎన్డీఏ, ప్ర‌తిపక్ష ఎంపీలు పోటాపోటీగా నినాదాలు చేశారు. జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనలపై చర్చ నుంచి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పారిపోతున్నారని ఎన్డీయే ఎంపీలు ఆరోపించారు. ఢిల్లీలో జులై 20న జరిగిన నిరసనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా జవాబుదారీతనం వహించాలని ప్ర‌తిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.

​పార్ల‌మెంట్ ఉభ‌య సభల‌కు గైర్హాజరైన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా… ఎన్డీఏ ఎంపీల మంగళవారం నాటి సాధారణ సమావేశానికి (మంగళ్ మిలన్) హాజరయ్యారు. జార్ఖండ్‌లో ప్రశ్నపత్రాల లీకేజీకి, దానిపై పోలీసుల చర్యకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనను ప్రతిపక్షం నుంచి త‌మ‌నుతాము ర‌క్షించుకోవ‌డానికి ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని సమావేశం నిర్ణ‌యించింది. దీని తరువాత, ఎన్డీఏ ఎంపీలు ప్లకార్డులు, నినాదాలతో మకర ద్వారం వద్ద ఆందోళ‌న చేప‌ట్టారు. ఇంతలో, అక్కడ నిరసన చేస్తున్న ప్రతిపక్ష ఎంపీలకు వ్యతిరేకంగా అధికార పార్టీ ఎంపీలు నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో భద్రతా అధికారులు పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య ‘గోడ’ నిర్మించాల్సి వచ్చింది. మ‌రోవైపు వర్షాకాల సమావేశాలు ముగియడానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ… ప్రధాని, హోంమంత్రి సభకు వచ్చి ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం చేయకపోవడం గమనార్హం.

​అమిత్ షాను తప్పుడు కథలు ప్రచారం చేయడానికి అనుమ‌తించ‌ం
​మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌లో ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగింది. స‌భ‌ను స్పీక‌ర్ ఓం బిర్లా ప్రారంభిస్తూ ప్ర‌శ్నోత్త‌రాల నిర్వ‌హించడానికి ప్ర‌య‌త్నించారు. అయితే రామ మందిర దోపిడీపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్ర‌తిప‌క్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళ‌న చేప‌ట్టారు. స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని స్పీక‌ర్ ఓంబిర్లా కోరారు. సభలో పలుమార్లు అంతరాయాలు కలిగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. సభలో మనం చర్చలు, సంప్రదింపులు జరపాలని సూచించారు. కేంద్ర హోం మంత్రి స‌మాధానం ఇస్తార‌ని అన్న‌ప్పుడు ఎందుకు ఆందోళ‌న చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. దీనికి ప్ర‌తిప‌క్షాలు స్పందిస్తూ విద్యార్థులపై క్రూర‌మైన దాడి, విరాళాల‌ దోపిడీ రెండూ ముఖ్యమైన అంశాలని, రెండింటిపై చర్చ జరిగేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. కేంద్ర హోం మంత్రి స‌భ‌కు వ‌చ్చి స‌మాధానం చెప్పాల్సిందేన‌ని ప్ర‌తిప‌క్షాలు త‌మ ఆందోళ‌నను కొన‌సాగించాయి. విద్యార్థులపై క్రూర‌మైన దాడి గురించి అమిత్ షా చెప్పే ‘రంగుల కథలు’ వినడానికి తమకు ఆసక్తి లేదని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులను అణచివేసేందుకు జరిగిన క్రూరమైన ప్రయత్నానికి ఎవరు బాధ్యులు అనే ప్రశ్నకు సమాధానం దొరకాలని కోరాయి. అమిత్ షాను తప్పుడు కథలు ప్రచారం చేయడానికి అనుమతించబోమని కూడా ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. దీంతో స్పీక‌ర్ బిర్లా స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లో ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న మ‌ధ్యే కేర‌ళ పేరు మార్పు బిల్లు, నేష‌న‌ల్ కోఆప‌రేటివ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ స‌వ‌ర‌ణ బిల్లును ఎటువంటి చ‌ర్చా లేకుండా మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నారు.

​కేరళ పేరును కేరళంగా మార్చే బిల్లు
​కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లును స‌భ‌లో హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెడతార‌ని ప్రకటించినప్పటికీ… ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు. ప్ర‌తిపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే బిల్లును సభలో ప్రవేశపెట్టి మూజువాణి ఓటుతో ఆమోదించారు. రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కోరుతూ కేరళ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. రాష్ట్ర అధికారిక పేరును మలయాళంలో ‘కేరళం’గా ఉపయోగిస్తున్న నేపథ్యంలో అదే పేరును రాజ్యాంగపరంగానూ అమలు చేయాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించింది.

​జాతీయ స‌హ‌కార అభివృద్ధి బిల్లు
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లు కూడా లోక్‌సభ చర్చ లేకుండానే ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలపై జాతీయ సహకార అభివృద్ధి సంస్థ పట్టును మరింత బిగించే నిబంధనలున్న ఈ బిల్లును… సహకార శాఖ ఇన్‌చార్జిగా ఉన్న అమిత్ షా ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆయన గైర్హాజరీలో, సహాయ సహకార శాఖ మంత్రి మురళీధర్ మోహోల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం అనంత‌రం స‌భ‌ను నేటి (బుధ‌వారం)కి వాయిదా వేశారు.

​రాజ్య‌స‌భ‌లో ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు ఆమోదం
రాజ్య‌స‌భ‌లో కూడా ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న కొన‌సాగింది. స‌భ‌ను చైర్మెన్ సిపి రాధాకృష్ణన్ ప్రారంభించారు. వెంట‌నే ప్ర‌తిప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. రామ మందిర దోపిడీపై ప్రధాని మోడీ, జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల దాడిపై హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు హోరెత్తించారు. దీంతో చైర్మెన్‌ స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లోనూ ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌తో స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వాయిదా వేశారు. అనంత‌రం ప్రారంభ‌మైన స‌భ‌లో ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లును ఆమోదించారు. దేశంలోని వివిధ ట్రిబ్యునల్స్‌కు చైర్‌పర్సన్‌లు, సభ్యులను ఎన్నుకోవడానికి ఈ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంత‌రం స‌భ‌ను నేటి (బుధ‌వారం)కి వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -