Tuesday, March 31, 2026
E-PAPER
Homeజాతీయంస్టాలిన్‌, విజయ్ నామినేషన్లు దాఖలు

స్టాలిన్‌, విజయ్ నామినేషన్లు దాఖలు

- Advertisement -

తమిళనాడులో నామినేషన్ల ప్రక్రియ షూరు

చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రెండో దశకు చేరుకున్నాయి. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమయింది. ఏప్రిల్‌ 23న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఎలక్షన్‌ కమిషన్‌ సోమవారం అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అర్చన పట్నాయక్‌ తమిళనాడు ప్రభుత్వ గెజిట్‌లో వెల్లడించారు. ఈ నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సోమవారం ఉదయం 11 గంటల నుంచే తమ నామినేషన్లను దాఖలు చేసుకోవడానికి అవకాశం లభించింది. సోమవారం ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌, టీవీకే వ్యవస్థాపకులు, నటులు సి జోసెఫ్‌ విజయ్ తమ నామినేషన్లను సమర్పించారు. కొలతూర్‌ నియోజకవర్గం నుంచి స్టాలిన్‌ నామినేషన్‌ వేశారు. ఇందుకోసం సోమవార ఉదయం ముందుగా పేపర్‌ మిల్స్‌ రోడ్డులో ఉన్న గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఇంటిగ్రేటెడ్‌ బిల్డింగ్‌కు స్టాలిన్‌ చేరుకున్నారు. తన అఫిడవిట్‌ను రిటర్నింగ్‌ ఆఫీసర్‌ శాంతికి సమర్పించారు.

స్టాలిన్‌ వెంట పార్టీ సీనియర్‌ నాయకులు పికె శేఖర్‌ బాబు, కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. అనంతరం స్టాలిన్‌ మీడియాతో మాట్లాడుతూ కొలతూర్‌ నియోజకవర్గ ప్రజలు తనను నాలుగోసారి కూడా అసెంబ్లీకి పంపుతారనే విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే మరోవైపు సోమవారం విజయ్ కూడా తన నామినేషన్‌ సమర్పించారు. పెరంబూర్‌ నియోజకవర్గం నుంచి విజయ్ సోమవారం నామినేషన్‌ వేశారు. సోమవారం ముందుగా వ్యాసర్‌పాడిలోని జిసిసి భవనానికి చేరుకున్న విజయ్ అక్కడ తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి గీతకు సమర్పించారు. కాగా విజయ్ తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. సోమవారం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం అభ్యర్థులు తమ నామినేష్లను దాఖలు చేయడానికి ఏప్రిల్‌ 6 వరకూ గడువు ఉంది. ఏప్రిల్‌ 7న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్లను ఉపసంహరణకు ఏప్రిల్‌ 9 వరకూ గడువు ఉంది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు ఏప్రిల్‌ 23న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

2న ఈరోడ్‌లో స్టాలిన్‌ ప్రచారం
ఏప్రిల్‌ 2న ఈరోడ్‌ జిల్లాలో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ప్రచారం నిర్వహించనున్నారు. డిఎంకె కూటమి అభ్యర్థుల తరుపున స్టాలిన్‌ ప్రచారం చేయనున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు చిథోడ్‌లో జరిగే ఎన్నికల బహిరంగ సభలో స్టాలిన్‌ పాల్గొంటారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లోని అభ్యర్థులకు ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గానూ ఐదు స్థానాల్లో అంటే ఈరోడ్‌ (వెస్ట్‌), పెరుందురై, భవానీ, అంతియూర్‌, గోబిచెట్టిపాళయంల్లో డిఎంకె అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరో మూడు స్థానాల్లో డిఎంకె మిత్రపక్షాలైన సిపిఐ ( భవానీసాగర్‌ (ఎస్‌సి)), కాంగ్రెస్‌ (ఈరోడ్‌ (ఈస్ట్‌)), ఎండిఎంకె (మోడక్కురి) పోటీలో ఉన్నాయి.

డీఎంకే సంక్షేమ పథకాలు సామాజిక పెట్టుబడులు:కనిమొళి
డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న, తాజా మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ సామాజిక పెట్టుబడులుగా ఆ పార్టీ పార్లమెంటరీ నేత కనిమొళి అభివర్ణించారు. పార్టీ మేనిఫెస్టోలో వివిధ అంశాలను ఆమె వివరిస్తూ ప్రజల వద్ద ఉండే డబ్బు వారి కొనుగోలు శక్తిని పెంచి, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరుస్తుందని పేర్కొన్నారు. ‘మహిళలకు రూ.1,000 ఇచ్చే ‘మగళిర్‌ ఉరిమై తిట్టం’ వారి కొనుగోలు శక్తిని పెంచుతుంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం మహిళలు ఉద్యోగాలను వెతుక్కుంటూ ప్రయాణించేందుకు వీలు కల్పించింది. ఇలాంటి పథకాలపై ప్రభుత్వం వ్యయం చేసే డబ్బు ఒక సామాజిక పెట్టుబడి. సామాజిక న్యాయానికి వ్యతిరేకించేవారే ఈ పథకాలను వ్యతిరేకిస్తారు’ అని కనిమొళి స్పష్టం చేశారు.

అన్నాడీఎంకే మ్యానిఫెస్టోను డీఎంకే కాపీ చేసిందనే ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు. అన్నాడిఎంకె ఇచ్చిన హామీలను ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆమె తెలిపారు. డీఎంకే మ్యానిఫెస్టోకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఎలక్ట్రానిక్‌ వస్తువుల కొనుగోలు కోసం మహిళలకు రూ 8 వేల కూపన్‌ ఇచ్చే ఇల్లతరసి పథకం గురించి కనిమొళి మాట్లాడుతూ సమయం ఎక్కువగా తీసుకునే ఇంటి పనుల నుంచి మహిళలకు విముక్తి కల్పించి, వారి ఇష్టాలను కొనసాగించడానికి ఎక్కువ సమయం ఇవ్వడమే ఈ పథకం లక్ష్యమని కనిమొళి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -