Saturday, August 15, 2026
E-PAPER
Homeజాతీయంరాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట

- Advertisement -

సావర్కర్‌పై వ్యాఖ్యల కేసు కొట్టివేత
న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వినాయక్ దామోదర్ సావర్కర్‌పై గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన క్రిమినల్ పరువునష్టం కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అంతకుముందు లక్నో కోర్టు జారీ చేసిన సమన్లను కూడా కోర్టు రద్దు చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షిల్ నాగుతో కూడిన ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణకు అవసరమైన అనుమతిని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి పొందలేదని, అందువల్ల ఇది విచారణార్హం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో రాహుల్‌పై నమోదైన క్రిమినల్ పరువునష్టం కేసును కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై తమ అనుమతి తీసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు తమ వద్ద లేదని చెబుతూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా 2022, నవంబర్ 17న మహారాష్ట్రలోని అకోలాలో పర్యటిస్తుండగా రాహుల్ గాంధీ.. సావర్కర్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు.

అయితే, రాహుల్ ఉద్దేశపూర్వకంగా సావర్కర్ గౌరవాన్ని తగ్గించే లక్ష్యంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని, ఆయన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ నృపేంద్ర పాండే అనే లాయర్.. రాహుల్‌పై ఫిర్యాదు చేశాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లక్నో కోర్టు దీనిపై విచారణ జరిపి, రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరారు.స్పందించిన సుప్రీంకోర్టు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనికి యూపీ ప్రభుత్వం బదులిస్తూ ఒక అఫిడవిట్ సమర్పించింది. ఈ కేసులో రాహుల్ గాంధీపై 153 ఏ సెక్షన్ ప్రకారం కేసు నమోదైందని, దీనిపై విచారణ జరిపేందుకు అవసరమైన అనుమతుల్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి తీసుకోలేదని సుప్రీంకోర్టు గుర్తించింది. యూపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో కూడా ఈ వివరణ ఉంది. దీంతో రాహుల్ గాంధీపై నమోదైన పిటిషన్‌పై విచారణకు అర్హత లేదని భావిస్తూ.. సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేసింది. ఇదే సమయంలో.. స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన అంశాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రాహుల్‌కు సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -