సొరంగ ప్రమాదంలో ఏడుగురు మృతి
చమోలీలోని హెచ్‌సీసీ జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద ఘటన
సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఆర్మీ సిబ్బంది
చమోలి : ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పీపల్‌కోటి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలోకి ఒక్కసారిగా భారీగా నీరు, బురద రావడంతో అందులో కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మరణించినట్టు అధికారులు తెలిపారు. సొరంగంలోకి చిక్కుకున్న కార్మికుల్లో 19 మందిని బయటకు తీసి గోపేశ్వర్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ 19 మందిలో ఏడుగురు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. మిగతా వారికి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. మరొక యువకుడిని మెరుగైన చికిత్స కోసం శ్రీనగర్‌లోని బేస్ ఆస్పత్రికి రిఫర్ చేశామని గోపేశ్వర్‌లోని జిల్లా ఆస్పత్రి డాక్టర్ ఆయుష్ తెలిపారు. ఇదిలా ఉండగా, సొరంగంలో చిక్కుకున్న మిగతా కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు సొరంగంలో భారీ ప్రవాహంలో నీరు చేరిందని, పక్కల నుంచి కూడా నీరు లీకవుతోందని ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్ కమాండర్ అమృత్‌లాల్ మీనా తెలిపారు.
ఏం జరిగింది..?
ఈ ప్రమాదం జరిగిన సమయంలో సొరంగం లోపల దాదాపు 22 మంది కార్మికులు ఉన్నారని టీహెచ్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) కుమార్ శరద్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించామన్నారు. పీపల్‌కోటి పరిధిలోని మాయాపూర్ వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం (విష్ణుగడ్-పిపల్‌కోటి హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్) నిర్మాణ పనులు జరుగుతున్నాయి. హిందుస్తాన్ కన్ స్ట్ర క్షన్ కంపెనీ ఈ నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోంది. గురువారం సాయంత్రం సుమారు 7 గంటల మధ్య సొరంగంలో తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. క్షణాల వ్యవధిలో భారీ ప్రవాహంతో నీరు, పెద్దఎత్తున బురద, శిథిలాలు సొరంగంలోకి దూసుకొచ్చాయి. దీంతో అందులో పనిచేస్తున్న కార్మికులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. నీటి ఉధృతి, బురద ఎక్కువగా ఉండి ఇరుక్కుపోవడంతో వారంతా లోపల చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డెహ్రాడూన్‌లోని రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ కార్యాలయం నుంచి ఆయన ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
చమోలీలో పదే పదే విపత్తులు
పర్వత ప్రాంతాలతో కూడిన చమోలీ జిల్లా ప్రకృతి పరంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా మారుతోంది. గతంలో సంభవించిన జోషిమఠ్ భూ కుంగుబాటు, రైనీ గ్రామం వద్ద పెను విపత్తులు ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వంటి పరిణామాలు సహాయక చర్యలకు తీవ్ర సవాళ్లు విసురుతున్నాయి. అయినప్పటికీ అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.



