అంబేద్కర్ ఆశయాలు గుర్తుంచుకోవాలి
మూడు రంగుల జెండా స్వాతంత్ర్యానికి ప్రతీక
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని జాతిని ఉద్దేశించి ప్రసంగం
న్యూఢిల్లీ : దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పునస్కరించుకొని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను గుర్తుంచుకోవాలని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ పని చేయాలని సూచించారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందాలని ఆమె ఆకాంక్షించారు. అలాగే దేశ న్యాయ వ్యవస్థను, చట్టసభలను గౌరవించాలని ప్రజలకు సందేశమిచ్చారు. తాజాగా లోక్సభలో మొట్టమొదటిసారిగా ఆలపించిన వందేమాతరం గేయాన్ని పౌరులంతా గౌరవించాలని ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము కోరారు. మరికొన్ని గంటల్లో మనం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగనున్నాయనీ, దేశ ప్రజలతో పాటు విదేశాల్లోని భారతీయులు సైతం జెండా పండుగలో సగర్వంగా పాల్గొననున్నారని తెలిపారు. ‘‘మూడు రంగుల జెండా స్వాతంత్య్రానికి ప్రతీక. ఈ పతాకాన్ని మనం ఎంతో గౌరవంతో ఎగురవేస్తాం. 1947, ఆగస్టు15వ తేదీన బ్రిటీష్వారి కబంద హస్తాల నుంచి మన నేలకు స్వేచ్ఛ లభించింది.
మనదేశంలోని విద్యార్థులు, టీచర్లు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అభివృద్ధి కోసం ఆతృతగా ఉన్నారు. అలానే వైద్యులు, వైద్యరంగంలోని సిబ్బంది ఆరోగ్య రంగంలో కృషి చేస్తున్నారు. రైతులు పంటలు పండించడం ద్వారా దేశ నిర్మాణంలో భాగమవుతున్నారు. మిగతా రంగాల్లోని వారు సైతం రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను నిర్వర్తిస్తున్నారు. వారందరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అని ముర్ము తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో ఎందరో పౌరులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ‘‘సామాజిక సంస్కరణలు, దేశం పట్ల ప్రేమకు సంబంధించిన విలువైన, ఆచరణీయమైన విషయాలను బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించారు. ఈరోజు ఆగస్టు 14. ఈ రోజును విభజన భయానక దృశ్యాలను గుర్తుచేసుకునే రోజు. విభజన సమయంలో చెలరేగిన మతపరమైన హింస కారణంగా లక్షలాది మంది బలవంతంగా శరణార్ధులుగా మారారు. అయినా సరే ఇప్పటికీ వారు తమ గుర్తింపును మాత్రం వదులుకోలేదు’’ అని ఆమె తెలిపారు.
ఫూలే, సావ్రితిబాయి దంపతుల కృషి చారిత్రాత్మకం
ప్రజల ఆశయాలు చట్టసభల్లో తెలియజేయడం ప్రజాప్రతినిధుల బాధ్యతనీ, పౌరులు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందించాల్సిన బాధ్యత చట్టాలను అమలు చేసేవాళ్లపై ఉందని అన్నారు. ఏ ఒక్కరు కూడా న్యాయానికి దూరమవ్వకుండా చూడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థలోని ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతిని నిర్వహించుకున్నామని గుర్తు చేసిన రాష్ట్రపతి… విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత వంటి అంశాల్లో ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులు చారిత్రాత్మకమైన కృషి చేశారని కొనియాడారు. వారి స్ఫూర్తితోనే అణగారిన వర్గాల అభివృద్ధికి ఈమధ్య ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.



