Saturday, August 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగ్లోబల్‌ సమ్మిట్‌ 2.0

గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0

- Advertisement -

‌డిసెంబర్‌ 7,8,9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో..
ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో ఉపసంఘం..హిల్ట్‌ పాలసీ దరఖాస్తు గడువు పొడిగింపు
ప్రభుత్వ, వివాదాల్లేని భూ సమస్యలు పరిష్కరిస్తాం..
క్యూర్‌ పరిధిలో ఎలక్ట్రిక్‌ వాహనాలుగా ఆటోలు
7 రకాల సన్నాలకే బోనస్‌..స్కిల్స్‌ వర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్‌‌లు..7 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్‌ గురుకులాలు మంజూరు..నేడు సంగారెడ్డిలో ఘనంగా స్మార్ట్‌ రేషన్‌‌కార్డుల పంపిణీ
మంత్రివర్గం నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గతేడాది తరహాలోనే ఈ ఏడాది కూడా డిసెంబర్‌ ఏడు, ఎనిమిది, తొమ్మిది తేదీల్లో ఫ్యూచర్‌‌సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సమ్మిట్‌ ‌నిర్వహణ కోసం ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రులు శ్రీధర్‌‌బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి సభ్యులుగా ఉన్నారు. గతేడాది తెలంగాణ రైజింగ్-2047 విజన్‌ ‌డాక్యుమెంట్‌‌ను ఆవిష్కరించినట్టే ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్‌తో సదస్సు‌ నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా రాష్ట్రంలో రక్షణ, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో పరిశ్రమలు, పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ సదస్సు జరగనుంది. వివిధ రంగాల్లో ఇప్పటికే తెలంగాణ స్టార్టప్‌లు, పరిశ్రమలు సాధించిన విజయాలు, వివిధ రంగాల కొత్త ఆవిష్కరణలకు సంబంధించి ఎగ్జిబిషన్, స్టాళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ముఖ్యమంత్రి ఎ రేవంత్‌‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని డాక్టర్‌‌ బిఆర్‌ అంబేద్కర్‌ ‌రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు.

ఇందులో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. 22ఏ పరిధిలో కొన్ని వాస్తవమైన దరఖాస్తులున్నట్టు తమ దృష్టికి వచ్చిందని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వ, నిషేధిత జాబితాలో లేకుంటే, న్యాయస్థానాల్లో వివాదాల్లేని భూముల దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదన్నారు. ఒక్క అంగుళం కూడా నష్టపోకుండా చూస్తామని చెప్పారు. క్యూర్‌ ‌పరిధిలో ఉండే 46 మంది సబ్‌ ‌రిజిస్ట్రార్లతో సమీక్ష చేశామనీ, 22ఏకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలిచ్చామని అన్నారు. ఏమైనా సమస్యలుంటే తన నెంబర్‌‌కు పంపాలనీ, వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మంత్రివర్గ నిర్ణయాలివే…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో 2.81 కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులుంటే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. కొత్తగా కుటుంబీకుల పేర్లను కూడా నమోదు చేసింది. 62 లక్షల మందికి కొత్తగా లబ్ధి చేకూర్చింది. రాష్ట్రంలో 3.42 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులున్నారు. వారికి స్మార్ట్ కార్డుల జారీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాల్లోనూ ఇన్‌‌చార్జీ మంత్రులు పంపిణీ చేస్తారు.

​హిల్ట్‌ ‌పాలసీ దరఖాస్తు గడువు అక్టోబర్‌ 31 ‌వరకు పెంపు
హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను నగర శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన హిల్ట్‌ పాలసీ దరఖాస్తుల గడువును మరో మూడు నెలలు రాష్ట్ర మంత్రివర్గం పొడిగించింది. దరఖాస్తుదారుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

​7 రకాల సన్నాలకే రూ.500 బోనస్‌
వానాకాలం పంట‌కు సంబంధించి ఏడు ర‌కాల స‌న్న ధాన్యం సాగును ప్రోత్సహించి, సాగును పెంచడానికి రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదిక‌ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుందని వివరించింది. ఈ ఏడాది నుంచి ఆ ఏడు ర‌కాల స‌న్నాల‌కే మద్దతుధరతోపాటు రూ.500 బోన‌స్‌ చెల్లించాల‌ని తీర్మానించింది.

​మిగులు ధాన్యం ఈ-వేలం
యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని మంత్రివర్గం తెలిపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులకు కనీస మద్ధతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొంది. అందులో 63.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం సేకరించింది. మిగతా 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇటీవల మొక్కజొన్న వేలంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం రాబ‌ట్టుకున్న నేప‌థ్యంలో ఈ మిగులు ధాన్యానికి కూడా క్వింటాలుకు రూ.2,389 కనీస ధర నిర్ణయించి ఈ వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించింది.

​శక్తి శాఖ పరిధిలోకి స్కిల్స్‌ ‌వర్సిటీ
రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోకి తేవ‌డానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు సాంకేతిక విద్యాశాఖ ప‌రిధిలో ఉన్నాయి. వాటిని తెలంగాణ ఎడ్యుకేష‌న్ యాక్ట్ నుంచి తొల‌గించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న వాటన్నింటినీ ఇకపై శక్తి శాఖ పరిధిలోకి విలీనం చేసేందుకు క్యాబినెట్ తీర్మానించింది.

ఈవీలుగా 18,766 ఆటోలు
కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్‌) పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబా‌ద్‌‌లో ప్రస్తుతం 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలున్నాయి. వాటిని ఎలక్ట్రిక్‌ ‌వాహనాలు (ఈవీ)గా మార్చేందుకు రూ.200 కోట్లతో ప్రత్యేక పథకం (తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్) అమలుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల సబ్సిడీ ఇవ్వనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఆటోకు విద్యుత్ కిట్ అమర్చుకోవటం లేదా పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త విద్యుత్ ఆటో కొనుగోలు చేసుకునేందుకు ఈ పథకం ద్వారా అవకాశం కల్పించనున్నట్టు తెలిపింది.

​కొడంగల్‌ ఎత్తిపోతల ఫేజ్‌-2 పనులకు రూ.2,100 కోట్ల అంచనా
మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోత‌ల పథకం ఫేజ్‌-2 పనుల కోసం రూ.2,100 కోట్ల అంచనా వ్యయానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు ల‌క్ష ఎక‌రాల‌కు సాగు నీరు, ఆ ప్రాంతంలో తాగు నీరు, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు ఈ ఎత్తిపోత‌ల నుంచి నీళ్లు అందుతాయని పేర్కొంది. గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామ‌ర్థ్యాన్ని 1.19 టీఎంసీ నుంచి 15 టీఎంసీల‌కు పెంచటంతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‌ నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

​వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటిగ్రేటెడ్‌ ‌గురుకులాల్లో తరగతులు
ఆదిలాబాద్‌, నిర్మల్, ముధోల్‌, బోథ్‌, సిర్పూర్‌, గజ్వేల్, దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో తొలివిడ‌త‌గా 113 నియోజ‌క‌వ‌ర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల కాంప్లెక్స్‌‌లను నిర్మించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 86 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ ‌గురుకుల కాంప్లెక్స్‌లకు అనుమతులు మంజూరయ్యా‌ యని తెలిపింది. మిగిలిన నియోజక వర్గాల్లోనూ వీలైనంత తొందరగా స్థల సేకరణ చేసి, నిర్మాణాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ గురుకులాలను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఆదేశించారని పేర్కొంది. నిర్మాణాలు పూర్తయిన చోట వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ నిర్ణయించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -