Saturday, August 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమార్క్సిజమే ప్రతి సమస్యకూ పరిష్కారం

మార్క్సిజమే ప్రతి సమస్యకూ పరిష్కారం

- Advertisement -

దేశానికి సోషలిజం-సెక్యులరిజమే మార్గం
ఫాసిస్ట్‌ విధానాలు అమలు చేస్తోన్న మోడీ
ఆదర్శ కమ్యూనిస్టు పుచ్చకాయల చంద్రారెడ్డి: సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని
80 ఏండ్ల తర్వాత కూడా తగ్గని అసమానతలు
దోపిడీ పోయేంత వరకు పోరాటాలుంటాయి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
చంద్రారెడ్డి సంస్మరణ సభలో నేతలు పీసీఆర్ చిత్రపటానికి ఘన నివాళి

నవతెలంగాణ-నర్సంపేట
మార్స్కిజమే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతుందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో శనివారం సీపీఐ(ఎం) సీనియర్ నేత పుచ్చకాయల చంద్రారెడ్డి సంస్మరణ సభ మండల కార్యదర్శి బోళ్ల సాంబయ్య అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన తమ్మినేని మాట్లాడుతూ కుల, మత ప్రాతిపదికన కొనసాగుతున్న రాజకీయాలు సమాజాన్ని కలుషితం చేస్తున్నాయన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మతోన్మాద, ఫాసిస్టు విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. బీజేపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికితుందన్నారు. ఈ దేశానికి సోషలిజం , సెక్యులరిజమే మార్గం చూపుతాయని సీపీఐ(ఎం) భావిస్తుందన్నారు. మార్క్సిజం మహోన్నతమైన సిద్ధాంతమన్నారు. సమాజంలోని సకల సమస్యలకూ సరైన పరిష్కారం మార్క్సిజమే చూపుతుందన్నారు. దేశంలో సోషలిస్టు, సెక్యులర్‌ ‌భావజాలాన్ని దెబ్బతీసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక కుటిలయత్నాలు చేస్తోందని విమర్శించారు.

సోషలిజం, సెక్యులరిజం దిశలో పుచ్చకాయల చంద్రారెడ్డి తన జీవితాంతం కొనసాగించారన్నారు. నమ్మిన సిద్ధాంతాన్ని వీడకుండా ఎర్ర జెండా చేత బూని అనేక ఉద్యమాలను చేపట్టారన్నారు. ఆదర్శ కమ్యూనిస్టు అంటే ఇలా ఉండాలని ఆయన నిరూపించారని కొనియాడారు. ఒక మనిషి చనిపోతే అతని కుటుంబ బంధుత్వం ఏడుస్తుందని, అదే ఒక కమ్యూనిస్టు మరణిస్తే సమాజం నివాళులర్పిస్తుందన్నారు. కమ్యూనిస్టు సమాజమే ఉదాత్తమనుకొని ఆలంబన చేసుకొని పనిచేశాడన్నారు. అందుచేతనే సమాజం కన్నీటితో నివాళులర్పిస్తుందని తెలిపారు. చంద్రారెడ్డి ఆశయాలను ప్రతి కార్యకర్త ప్రతిజ్ఞ తీసుకుని పని చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. చంద్రారెడ్డి భావాలను తన కుటుంబ సభ్యులు పాటిస్తూ పార్టీకి సేవలందించడం అభినందనీయమన్నారు.

​పీసీఆర్ స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి: జాన్ వెస్లీ
​పుచ్చకాయల చంద్రారెడ్డి అందించిన స్ఫూర్తి కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులు, కార్మికులు, అన్ని రంగాల ప్రజల హక్కులను కాలరాస్తోందన్నారు. 80 యేండ్ల స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలోనూ దేశంలో ఇప్పటికీ ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నాయన్నారు. దోపిడి, అసమానతలను నిర్మూలించడం, ఆత్మగౌరవం , సోషలిస్టు సమాజ స్థాపన ప్రధాన లక్ష్యంగా ఎర్రజెండా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ దిశలో చంద్రారెడ్డి ఎన్ని ఆటంకాలు వచ్చినా సగౌరవంగా నిలబడ్డారని కొనియాడారు.

​నీతికి నిజాయితీకి నిదర్శనం పీసీఆర్: జి. నాగయ్య
పుచ్చకాయల చంద్రారెడ్డి నీతికి నిజాయితీకి నిదర్శనమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య అన్నారు. నిర్బంధాలు, హత్యలు వంటి భయంకరమైన వాతావరణంలో పుచ్చకాయల చంద్రారెడ్డి పార్టీని నిలబెట్టేందుకు విశేషంగా కృషి చేశారన్నారు. 1982 కు ముందు నర్సంపేటలో నరమేధం సాగిందని, అలాంటి పరిస్థితుల్లో పార్టీని రక్షించడానికి చంద్రారెడ్డి ధైర్య సాహసాలు ప్రదర్శించి ముందుకు సాగారన్నారు. విచ్ఛిన్న రాజకీయాలను పీసీఆర్‌ విభేదించారని ‌గుర్తు చేశారు. 15 యేండ్ల పాటు డివిజన్ కార్యదర్శిగా సైకిల్‌‌పై గ్రామాల్లోకి వెళ్లి పార్టీని పునర్నిర్మించాడని కొనియాడారు. ఆయన ఆశయాలను మార్క్సిస్ట్‌ కార్యకర్తలు కొనసాగించాలని సూచించారు.

​నమ్మిన ఆశయం కోసం కడదాకా ఉన్నారు : పోతినేని
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ విప్లవోద్యమంలో చంద్రారెడ్డి క్రియాశీలక పాత్ర పోషించాడన్నారు. నమ్మిన ఆశయం కోసం కడదాకా ఉన్నాడన్నారు. భవనానికి పునాది ఎంతటిదో పార్టీకి చంద్రారెడ్డి అంతటి వారని అన్నారు. అసమాన ధైర్య శీలి పీసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) వరంగల్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు సూరి కృష్ణారెడ్డి, వరంగల్ జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య, అనుమకొండ జిల్లా కార్యదర్శి గాద ప్రభాకర్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, ములుగు జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు, భూక్య సమ్మయ్య, సీపీఐ నాయకులు వీరగోని శంకరయ్య,
ఎంసీపీఐ(యూ) నాయకులు సింగటి శంకరయ్య , బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు భానోతు సంగులాల్, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) జిల్లా నాయకులు నున్న అప్పారావు, గ్రామ సర్పంచ్ పెండ్యాల రాజు, పీసీఆర్ కుటుంబ సభ్యులు భార్య పుచ్చకాయల మల్లక్క, కుమారుడు పుచ్చకాయల భాస్కర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, కూతురు అరుణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -