Saturday, August 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుజోడెడ్ల‌లా సంక్షేమం..అభివృద్ధి

జోడెడ్ల‌లా సంక్షేమం..అభివృద్ధి

- Advertisement -

​మేమేంటో మా ప‌నితీరే చెబుతున్న‌ది ..ఆదాయానికి గండికొట్టే చ‌ర్య‌ల‌ను అడ్డుకుంటున్నాం
అసెంబ్లీలో విమ‌ర్శ‌ల‌ను స్వీక‌రిస్తున్నాం
ప్ర‌తిప‌క్షాలకు కావాల్సినంత స‌మ‌య‌మిస్తున్నాం
ప్రారంభించిన ప్ర‌తీ ప‌నినీ పూర్తి చేస్తాం
పార్టీ వ్య‌వ‌హారాల‌ను పీసీసీ చీఫ్ చూసుకుంటారు
బీజేపీ, మోడీ విధానాల‌తో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేదు

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి… రెండింటినీ జోడెడ్ల‌లా ప‌రిగెత్తిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణను నెంబ‌ర్‌వ‌న్‌గా నిల‌బెట్ట‌ట‌మే త‌మ ధ్యేయ‌మ‌ని చెప్పారు. ఇందుకోసం తాను, త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. అయినా ప్ర‌తిప‌క్షాలు, ముఖ్యంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీ.ఆర్‌.ఎస్‌. ప‌ని గ‌ట్టుకుని ప్ర‌భుత్వంపైనా, త‌న పైనా ప‌స‌లేని విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. బీ.ఆర్‌.ఎస్‌, బీజేపీ నేత‌ల అర్థప‌ర్థం లేని మాట‌ల‌కు, వాద‌న‌ల‌కు అదిరేది లేదు.. బెదిరేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. తామేంటనే విష‌యాన్ని త‌మ ప‌నితీరే చెబుతుంద‌ని అన్నారు. ఆదాయానికి గండికొట్టే చ‌ర్య‌ల‌ను అడ్డుకోవ‌టం ద్వారా అప్పులు, వ‌డ్డీల‌ను స‌మ‌న్వ‌యం చేస్తున్నామ‌ని వివ‌రించారు. బీజేపీ, మోడీ విధానాల‌తో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చిచెప్పారు. న‌వ‌తెలంగాణ 11వ వార్షికోత్స‌వాలు కొన‌సాగుతున్న వేళ సీఎం…ప‌త్రిక‌కు, యాజ‌మాన్యానికి, విలేక‌ర్లు, సిబ్బందికి శుభాకాంక్ష‌లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా న‌వ‌తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్ బి.వి.య‌న్‌.ప‌ద్మ‌రాజుకు…ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఇంట‌ర్వ్యూ విశేషాలివి…

న‌వ‌తెలంగాణ ఇంట‌ర్వ్యూలో ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
బి.వి.యన్‌.పద్మరాజు

​అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేండ్లు దాటింది, ఈ కాలంలో మీ ప‌రిపాల‌న మీకు సంతృప్తినిచ్చిందా…?
​పూర్తి సంతృప్తినిచ్చింది. అభివృద్ధి.. సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను జోడెద్దుల్లా ప‌రిగెత్తిస్తున్నాం..

ఆరు గ్యారెంటీల అమ‌లుకు ఆర్థిక ప‌రిస్థితులు అడ్డొస్తున్నాయ‌ని మీరు చెబుతున్నారు… దీన్ని ఎలా అధిగ‌మిస్తారు…?
​ఆరు గ్యారెంటీల్లో ఇందిర‌మ్మ ఇండ్లు, మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, 200 యూనిట్ల‌లోపు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ పంపిణీ ఉన్నాయి. వీట‌న్నింటినీ ప‌క్కాగా అమ‌లు చేస్తున్నాం.. గ‌త ప్ర‌భుత్వం చేసిన అప్పులు, వ‌డ్డీల భారం మా ప్ర‌భుత్వానికి గుదిబండ‌గా మారాయి. ఆ అప్పుల‌ను త‌క్కువ వ‌డ్డీతో రీక‌న్‌స్ట్ర‌క్చ‌న్ చేస్తున్నాం. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విభాగాల్లో బోగ‌స్ ఉద్యోగుల పేర్ల‌తో ఏజెన్సీలు చేస్తున్న దోపిడీకి అడ్డుక‌ట్ట వేశాం. నిజంగా ప‌ని చేస్తున్న వారినే కొన‌సాగిస్తున్నాం. మైనింగ్‌, ఇత‌ర విభాగాల్లో ఆదాయానికి గండికొట్టే చ‌ర్య‌ల‌ను అడ్డుకుంటున్నాం. ఫ‌లితంగా క్రమంగా ఆదాయం పెరుగుతోంది. హామీల అమ‌లుకు ఆ నిధులను వెచ్చిస్తున్నాం. ప్రారంభించిన ప్ర‌తి ప‌ని పూర్త‌య్యేలా చూస్తాం.

​అప్పులు, వ‌డ్డీలు, జీతభ‌త్యాల ప‌రిస్థితి ఇబ్బందిగా ఉంద‌ని అనేక వేదిక‌ల మీద మీరు చెప్పారు…మ‌రి రానున్న రెండున్న‌రేండ్ల‌లో ఈ ప‌రిస్థితిని అధిగ‌మించేందుకు మీ ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోబోతోంది?
​క‌చ్చితంగా అధిగ‌మిస్తాం.. ఇందుకు అనేక చ‌ర్య‌లు చేప‌ట్టాం.. ఎక్కువ వ‌డ్డీరేటుతో తెచ్చిన రుణాల‌ను రీక‌న్‌స్ట్ర‌క్చ‌న్ చేసి త‌క్కువ వ‌డ్డీల‌కు తీసుకుంటున్నాం. దీంతో చెల్లింపుల భారం త‌గ్గుతోంది. వ‌స‌తులు లేకుండా, సిబ్బంది, విద్యార్థులు లేకుండానే కాలేజీలు న‌డుపుతూ కొంద‌రు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ రూపంలో భారీగా ల‌బ్ధిపొందారు. ఇప్పుడు వాటిపై విచార‌ణ చేయిస్తున్నాం. ఇక ముందు విద్యార్థుల ఖాతాల్లోనే నేరుగా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ వేస్తాం. జీఎస్టీ లీకేజీల‌కు అడ్డుక‌ట్ట వేశాం. ఇసుక విక్ర‌యాల్లో లొసుగుల‌ను అరిక‌ట్ట‌డంతో భారీగా ఆదాయం పెరిగింది. ఆదాయాన్ని క‌చ్చితంగా పెంచుతాం.

​స‌భ‌లు, స‌మావేశాలు, ఆఖ‌రుకు ప్రెస్ కాన్ఫ‌రెన్సుల్లో సైతం ప్ర‌తిప‌క్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ మీద తిట్లు, దూష‌ణలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న చర్చ ఉంది. దీనికి మీరేమంటారు.?
​మేం మా ప‌ని తీరును చెబుతున్నాం. ప్ర‌తిప‌క్షం మాత్రం త‌న సొంత ప‌త్రిక‌, టీవీ, వేలాది యూ ట్యూబ్ ఛానెళ్లు, సోష‌ల్ మీడియా వ‌ర్క‌ర్ల‌తో నాపైనా, మంత్రులు, మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులపైనా దారుణ‌మైన దుష్ప్ర‌చారం చేస్తోంది. అస‌లు ప‌త్రిప‌క్ష నాయ‌కుడు స‌భ‌కు రారు, బ‌య‌ట‌కు కూడా రారు. ఆ కుటుంబానికి చెందిన ఇద్ద‌రు నాయ‌కులు ముఖ్య‌మంత్రి, మంత్రుల‌ను నోటికొచ్చి దూషిస్తున్నారు. మేం అస‌లు స‌మాధానం చెప్ప‌క‌పోతే వాళ్లు ఇంకా రెచ్చిపోతారు.. అందుకే కుక్క కాటుకు చెప్పు దెబ్బ వేయ‌క త‌ప్ప‌దు.

​మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌, మిగిలిన కార్పొరేష‌న్ల‌కు ప‌ద‌వుల పంప‌కాలు ఎప్పుడు ఉంటాయి…?
​అది ప్ర‌భుత్వం, పార్టీ వ్య‌వ‌హారం.. స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాం. పార్టీ అధిష్టానంతో సంప్ర‌దించి చేయాల్సిన ప‌ని. క‌ష్ట‌ప‌డ్డ‌వారికి క‌చ్చితంగా ప‌ద‌వులు వ‌స్తాయి.
​​మీ పార్టీలో ప్రజా ప్రతినిధులు, సీనియర్‌ ‌నేతలు చేసుకుంటున్న బహిరంగ విమర్శలు ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ ‌పార్టీకి నష్టం చేకూర్చవా?. దీన్ని ఎలా చ‌క్క‌దిద్దుతారు..?
​కాంగ్రెస్ జాతీయ పార్టీ.. ప్ర‌తి నాయ‌కుడు, కార్య‌క‌ర్త త‌మ అభిప్రాయాల‌ను స్వేచ్ఛగా వ్య‌క్తం చేసుకునే హ‌క్కు మా పార్టీలో ఉంది. అయితే ఒక ప‌రిధి వ‌ర‌కు చేసే విమ‌ర్శ‌ల‌ను మేం అంగీక‌రిస్తాం. ప్ర‌భుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఎవ‌రైనా వ్య‌వ‌హ‌రిస్తే పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం విచార‌ణ చేప‌ట్టి చ‌ర్య‌లు తీసుకుంటుంది. పార్టీ వ్య‌వ‌హారాల‌ను పీసీసీ అధ్య‌క్షుడు, ఏఐసీసీ చూసుకుంటాయి.

​మోడీ స‌ర్కారుతో సాఫ్ట్‌గా ఉండ‌టం వ‌ల్ల రాష్ట్రానికి న‌ష్టం రాదంటారా…?
​పార్టీ, ప్ర‌భుత్వం వేర్వేరు. పార్టీప‌రంగా బీజేపీ, మోడీ విధానాల‌తో ఏమాత్రం రాజీప‌డం,. విమ‌ర్శించ‌డానికైనా వెనుకాడం. ప్ర‌భుత్వప‌రంగా అలా సాధ్యం కాదు. మ‌న‌ది స‌మాఖ్య వ్య‌వ‌స్థ‌… కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌హ‌క‌రించుకోక‌త‌ప్ప‌దు. అనేక ప‌థ‌కాల అమ‌లుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వాటా నిధులు వినియోగించాల్సి ఉంటుంది. కేంద్రంతో ప్ర‌తి విష‌యానికి కొట్లాడితే రాష్ట్రం న‌ష్ట‌పోతోంది. ఈ విష‌యంలో నాకు స్ప‌ష్ట‌మైన అవగాహ‌న ఉంది.

​స్ట్మార్ట్ రేష‌న్ కార్డులను తీసుకురావ‌టంలో ప్ర‌భుత్వ ఉద్దేశ‌మేంటి..?
​రేష‌న్ పంపిణీలో పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీత‌నం కోస‌మే వాటిని రూపొందించాం. అర్హులైన ప్ర‌తీ పేద‌వాడికి ల‌బ్ది చేకూర్చ‌ట‌మే వాటి ఉద్దేశం.

మీరు, ఒక‌రిద్ద‌రు మంత్రులు త‌ప్ప ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా తిప్పి కొట్ట‌టంలో మిగతా బృందం విఫ‌ల‌ మ‌వుతోంద‌నే విమ‌ర్శ‌లున్నాయి..?
​అదేం లేదు. మా మంత్రులంతా గ‌ట్టిగానే స‌మాధానం ఇస్తున్నారు. అయితే కేటీఆర్‌, హ‌రీశ్‌రావు వాడే నీచమైన భాషను మా మంత్రులు వాడ‌లేరు.. వాళ్ల‌లాగా అబ‌ద్ధాలు, అవాస్త‌వాలు మా వాళ్లు చెప్ప‌లేరు. అందుకే మీకు అలా క‌నిపిస్తుండ‌వ‌చ్చు.

​గ‌త బీఆర్ఎస్ మాదిరిగానే మీ ప్ర‌భుత్వ హ‌యాంలో కూడా అసెంబ్లీని మొక్కుబ‌డిగా నిర్వ‌హిస్తున్నారన్న విమర్శలున్నాయి. దీనికి మీ స్పంద‌న…
​కేసీఆర్ హ‌యాంలో అసెంబ్లీని బీఆర్ఎస్ కార్యాల‌యంలా చూశారు. కానీ మేం అలా చూడ‌డం లేదు. బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ స‌భ్యులకు అడిగినంత స‌మ‌యం ఇస్తున్నాం. వాళ్ల హ‌యాంలో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను నోరు తెర‌వ‌నీయ‌లేదు. మార్ష‌ల్స్‌ను వాళ్లు వినియోగించారు. మేం అలా చేయ‌డం లేదు. అప్పుడు ముఖ్య‌మంత్రి భ‌జ‌న కోస‌మే స‌భ ప‌ని చేసింది. ఇప్పుడు ముఖ్య‌మంత్రి, మంత్రుల‌పై వ‌చ్చే విమ‌ర్శ‌లను సైతం మేం స్వీక‌రిస్తున్నాం. వాటికి స‌మాధానం ఇస్తున్నాం.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడేందుకు ప్ర‌తి స‌భ్యునికి స‌మ‌యం ఇస్తున్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -