Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వాతంత్ర్య వేడుకల్లో మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు

స్వాతంత్ర్య వేడుకల్లో మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు

- Advertisement -

నవతెలంగాణ–పరకాల: పరకాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అమరధామంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరైనప్పటికీ.. కార్యక్రమం ప్రారంభ సమయంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు కార్యాలయ సిబ్బంది అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.జాతీయ పతాక ఆవిష్కరణ వంటి కార్యక్రమాలకు ముందస్తు ఏర్పాట్లు, అధికారుల సమన్వయం, ప్రోటోకాల్‌ అమలుపై మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉన్నప్పటికీ అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయని పలువురు పేర్కొన్నారు. ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్టు రేపాల నరసింహ రాములు, కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్ కార్యక్రమ నిర్వహణలో కీలకంగా వ్యవహరించాల్సి వచ్చినట్లు తెలిసింది.అదేవిధంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రోటోకాల్‌కు అనుగుణంగా ప్రజాప్రతినిధుల ప్రస్తావన, కార్యక్రమ నిర్వహణపై కూడా చర్చ జరిగింది.

ముఖ్యంగా మున్సిపల్ వైస్‌ చైర్మన్‌ వంటి ప్రజాప్రతినిధుల ప్రస్తావన లేకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.మరోవైపు జాతీయ గీతాలాపన సమయంలో మున్సిపల్ కమిషనర్‌ జాతీయ పతాకానికి వందనం సమర్పించకుండా చేతులు కట్టుకుని నిలబడిన తీరు కూడా పలువురి దృష్టిని ఆకర్షించింది. జాతీయ పతాకం, జాతీయ గీతానికి గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొంటూ.. అధికారిక కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే కార్యక్రమ నిర్వహణలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయా అన్న చర్చ సాగుతోంది. ఇకపై జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాల్లో ముందస్తు ఏర్పాట్లు, అధికారుల హాజరు, ప్రోటోకాల్‌ అమలు విషయంలో మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -