– బీఆర్ఎస్ నాయకురాలు, కౌన్సిలర్ వీరపనేని రాధిక బాబీ
– మాజీ ఎమ్మెల్యే సండ్ర జన్మదినం సందర్భంగా నీళ్ల ట్యాంకర్ ప్రారంభం
నవతెలంగాణ – సత్తుపల్లి
బీఆర్ఎస్ నాయకురాలు, 2వ వార్డు కౌన్సిలర్ వీరపనేని రాధిక బాబీ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణంలో ఉచిత మంచినీటి ట్యాంకర్ సేవలను శనివారం ప్రారంభించారు. పట్టణంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ఉచితంగా నీటిని సరఫరా చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు.
తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంత ప్రజలు సమాచారం అందిస్తే వెంటనే వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని పంపిస్తామని ఆమె కోరారు. వేసవి, నీటి కొరత సమయాల్లో ఈ ఉచిత ట్యాంకర్ సేవలు ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని రాధికా బాబీ స్పష్టం చేశారు. ప్రజలు తమ తాగునీటి అవసరాల కోసం ఈ ఉచిత మంచినీటి ట్యాంకర్ సేవలను వినియోగించుకోవాలని కౌన్సిలర్ కోరారు.
హంగామా కేక్ కటింగ్స్ కంటే ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమని నాయకులు కౌన్సిలర్ రాధిక బాబీని అభినందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు పార్టీ నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేశ్, పట్టణ బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



