నల్లగొండలో సీపీఐ(ఎం) కార్యాలయంలోకి చొరబడినేతల అక్రమ అరెస్ట్
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాల
పంపిణీకి ముందు ఖాకీల దుశ్చర్య
స్వాతంత్ర్య దినోత్సవం రోజే అరెస్టులా?: నేతల ఆగ్రహం
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నల్లగొండలో రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతుల మీదుగా జరగాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముందు పోలీసులు వ్యవహరించిన తీరుపై సీపీఐ(ఎం) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అత్యుత్సాహంతో దౌర్జన్యంగా సీపీఐ(ఎం) కార్యాలయంలోకి జొరబడి నాయకులను లాక్కెళ్లారు. ఇండ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని నిరసన తెలిపేందుకు సీపీఐ(ఎం) నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అడ్డుకుంటారన్న నెపంతో పోలీసులు ఈ దుశ్చర్యకు దిగారు.
కార్యాలయంలోకి జొరబడి..
నల్లగొండలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నాయకులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్లి రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డిని, నాయకులు ఎండీ సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, రవీందర్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ తో పాటు మరికొందరు నేతలను అరెస్టు చేశారు. పార్టీ కార్యాలయంలోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడటంపై సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాయకులను అదుపులోకి తీసుకునే సమయంలో కార్యకర్తలు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో కొద్దిసేపు కార్యాలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులు సీపీఐ(ఎం) నేతలను బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి. గుర్రంపోడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టాల కార్యక్రమం ముగిసిన అనంతరం వారిని విడుదల చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజే అరెస్టులా? : వీరారెడ్డి
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకున్న నాయకులను అరెస్టు చేయడం సరికాదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య తీవ్రంగా ఖండించారు.‘స్వాతంత్ర్యం కోసం పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కును కూడా హరించడం ఏమిటి? ప్రజా సమస్యలపై నిరసన తెలిపే అవకాశం ఇవ్వకుండా ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో అర్హులైన పేదలకు న్యాయం చేయాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. ‘ప్రశ్నించే గొంతులను అణచివేయడం కాదు.. ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. మంత్రి పర్యటనకు భద్రత కల్పించడం పోలీసుల బాధ్యతేనని, అయితే అందుకోసం పార్టీ కార్యాలయంలోకి వెళ్లి నాయకులను అరెస్టు చేయడం, నిరసనకు ముందే వారిని అదుపులోకి తీసుకోవడం పోలీసుల అత్యుత్సాహానికి నిదర్శనమని విమర్శించారు.
పోలీసుల వైఖరిపై సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి. సలీం ఆగ్రహం
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టిస్తారనే అపోహతోనే సీఐటీయూ, సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి.సలీం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల హక్కుల కోసం ప్రశ్నించే నాయకులను స్వాతంత్ర్య దినోత్సవం రోజునేఅరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. రోడ్డుపైకి వచ్చినప్పుడు అరెస్టు చేయొచ్చని, కానీ కార్యాలయంలోకి చొరబడి నాయకులను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. కానీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.



