అసెంబ్లీలో చర్చిద్దాం రండీ..రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవం
జగ్గారెడ్డి లాంటి నాయకుడు దొరకడు : ముఖ్యమంత్రి
సంగారెడ్డిలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
‘‘తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీఆర్‌ఎస్, బీజేపీ ప్రశ్నిస్తున్నాయి. ఆ రెండు పార్టీలు ఒకే నాణేనికి బొమ్మ బొరుసులాంటివి. గత ప్రభుత్వంలో వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్.. తన ఫామ్‌హౌస్‌లో మాత్రం వరి సాగు చేశాడు. తాము రైతులకు మేలు చేస్తుంటే ఫామ్‌హౌస్‌లో పడుకుని మాపై విమర్శలు చేస్తున్నాడు. సంగారెడ్డి గడ్డ నుంచి సవాల్ చేస్తున్నా.. రైతులకు తాము చేసిన మేలేంటో… మీరు చేసిన అన్యాయం ఏంటో చర్చించేందుకు అసెంబ్లీకి రండీ’’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చాలెంజ్ చేశారు. శనివారం సంగారెడ్డిలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్స్ లో నిర్వహించిన సభలో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డు కేవలం ఒక కాగితం కాదని, పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. పేదలకు నిత్యావసర సరుకులు అందించేందుకు రేషన్ షాపులను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, పేదల సంక్షేమం కోసం గతంలో వారు ఏం చేశారో ప్రజలు ఆలోచించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని గతంలో విమర్శలు చేసిన వారు ఇప్పుడు వాస్తవాలను చూడాలని హితవు పలికారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. సన్నధాన్యానికి రూ.500 బోనస్, రైతు భరోసా రూ.12 వేల చొప్పున రూ.36 వేల కోట్లను70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.21 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల్లో అతి తక్కువ అప్పుల్లో తెలంగాణ రైతాంగం అని చెప్పింది వాస్తవం కాదా..? బీజేపీ నాయకులు అది చదువుకుంటే కండ్లకు కట్టినట్టు కనిపిస్తుంది కదా? అని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ వాళ్లను నేను అడుగుతున్న.. మోడీ పన్నెండేండ్లు .. రాష్ట్రంలో కేసీఆర్ పదేండ్లు అధికారంలో ఉండి పేదవాడికి సన్నబియ్యం ఇయ్యాలని, చంటి పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టాలని ఏనాడైన ఆలోచించారా? అని ప్రశ్నించారు.
రైతులకు తమ ప్రభుత్వం చేసిన మేలు… గత ప్రభుత్వం చేసిన అన్యాయంపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని చాలెంజ్ చేశారు. బీఆర్‌ఎస్ నాయకుడు హరీశ్‌రావు తెలంగాణలో కరువుకాటకాలు ఏర్పడి, ప్రజలు ఇబ్బందులు పడాలనే దురుద్ధేశంతో శివగంగకు వెళ్లి క్షుద్రపూజలు చేసినవాడన్నారు. తమ ప్రభుత్వం 3 కోట్లా 48 లక్షల మందికి ప్రతి నెల 2లక్షల 16వేల కింటాళ్ల సన్నబియ్యం మీ ఇంటి దగ్గరకు తెచ్చి ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెండున్నరేండ్లలో 72 వేల ఉద్యోగాలిచ్చామని, మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని సీఎం తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నిరుద్యోగ యువత ఇతరుల మాయమాటలకు లోను కాకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు పింఛన్లు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రజల ఆశీర్వాదం తమ ప్రభుత్వానికి కొనసాగాలని కోరారు. వెయ్యి కోట్లు ఇచ్చినా జగ్గారెడ్డి లాంటి నేత దొరకడని ముఖ్యమంత్రి అన్నారు. జగ్గారెడ్డి ప్రజాసేవలో ఉండాలన్నారు. ఓడి పోయినా కుటుంబాన్ని పట్టించు కోకుండా ప్రజల మధ్యే తిరుగుతాడన్నారు.
రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ: మంత్రులు
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 3.42 కోట్ల మంది లబ్దిదారులకు 1.06 కోట్ల రేషన్ కార్డులు అందిస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డు మంజూరీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. కార్మిక, ఉపాధి శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నధాన్యం పండించే రైతులను ప్రోత్సహించేందుకు బోనస్ అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఇందిరాగాంధీ హయాంలోనే ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు పునాది పడిందన్నారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పిన్న ఘనతా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలాజగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మెదక్ ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, కాటా శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



