పాఠాలు చెప్పడం కంటే తల్లిదండ్రుల ఒత్తిడే ఎక్కువ
క్రమశిక్షణ పాటింపజేస్తే ఫిర్యాదుల భయం…
అనేక బాధ్యతలను ఒకేసారి నిర్వహించాల్సిన పరిస్థితులు
మరోపక్క యాజమాన్యాల శ్రమ దోపిడీ
మౌనంగానే అనుభవిస్తున్న ఉపాధ్యాయులు
సోషల్ మీడియా, కరోనా ప్రభావంతో తరగతి గదుల్లో పూర్తిగా మారిన వాతావరణం
ఒకప్పుడు తరగతి గదిలోకి గురువు అడుగుపెడితే విద్యార్థులంతా లేచి నిలబడి ‘గుడ్ మార్నింగ్ టీచర్’ అని పలకరించే రోజులు ఉండేవి. గురువు చెప్పిందే శాసనం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిల్లల ప్రవర్తన, తల్లిదండ్రుల అంచనాలు, సోషల్ మీడియా ప్రభావం, నిరంతర పర్యవేక్షణ, అడ్మినిస్ట్రేషన్ పనులు, మానసిక ఆరోగ్య సమస్యలు… ఇవన్నీ కలిసి ఉపాధ్యాయ వృత్తిని గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు క్లిష్టంగా మార్చేశాయి. పాఠాలు చెప్పడమే కాదు.. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత కూడా గురువులపై పడుతోంది. దీంతో వారు తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తున్నారు. తమ వ్యక్తిగత జీవితాన్ని మౌనమే సమాధానంగా గడుపుతున్నారు.
న్యూఢిల్లీ : ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే జ్ఞానాన్ని అందించే వ్యక్తి మాత్రమే కాదు.. క్రమశిక్షణకు ప్రతీక కూడా. తరగతిలో విద్యార్థులు అల్లరి చేస్తే వారిని బయట నిలబెట్టడం, మందలించడం, అవసరమైతే చిన్నపాటి శిక్ష విధించడం వంటివి ఉండేవి. వీటిని తల్లిదండ్రులు సైతం అంత సీరియస్‌గా తీసుకునేవారు కాదు. గురువుల నిర్ణయాలను ప్రశ్నించకుండా గౌరవించేవారు కూడా. కానీ నేటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు విద్యార్థిని గట్టిగా మందలించడానికే వెనుకాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు చెప్తున్నదేమిటంటే.. ఇప్పుడు పాఠాలు చెప్పడం కంటే యాజమాన్యం, తల్లిదండ్రుల వాట్సాప్ సందేశాలకు సమాధానాలు ఇవ్వడం, వారి ఫోన్లు ఎత్తడం, ఈ-మెయిళ్లకు స్పందించడం, వివిధ రకాల రికార్డులు నిర్వహించడం, విద్యార్థుల ప్రవర్తనపై రిపోర్టులు తయారు చేయడంలోనే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది.
గురువు పాత్ర పూర్తిగా మారింది
ఇప్పటి ఉపాధ్యాయుడు కేవలం బోధకుడు మాత్రమే కాదు… విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని అర్థం చేసుకునే కౌన్సిలర్‌గా, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే నిపుణుడిగా, పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగిగా, కొన్నిసార్లు అత్యవసర వైద్య సహాయం అందించే వ్యక్తిగానూ వ్యవహరించాల్సి వస్తోంది. కొన్ని పాఠశాలలు ఉపాధ్యాయులకు సీపీఆర్, ఆందోళన లక్షణాలను గుర్తించడం వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నాయి.
క్రమశిక్షణ పాటింపజేయడమే సవాలు
నోయిడాలోని ఓ పాఠశాల హిందీ విభాగాధిపతి చారు చెప్తున్న సంఘటన నేటి పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. ఇద్దరు విద్యార్థులు గొడవపడుతుండగా వారిని ఆపేందుకు ఓ ఉపాధ్యాయుడు స్వల్పంగా తాకగానే… ‘‘నన్ను తాకే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మా తల్లిదండ్రులకు చెప్తాను’’ అని విద్యార్థి హెచ్చరించాడట. చివరకు ఆ చిన్న సంఘటన పెద్ద వివాదంగా మారి, తల్లిదండ్రులతో సమావేశాలు, విచారణల వరకూ వెళ్లింది. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు అరుదు కావనీ, ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించడానికి కూడా భయపడుతున్నారని పలువురు తమ అనుభవాలు చెప్తున్నారు.
కరోనా తర్వాత మరింతగా మారిన పరిస్థితులు
కరోనా లాక్‌డౌన్ సమయంలో పిల్లలు ఎక్కువ కాలం ఇంటికే పరిమితమై, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాతో ఎక్కువ సమయం గడిపారని ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఆ ప్రభావం ఇప్పటికీ విద్యార్థుల ప్రవర్తనలో కనిపిస్తోందని అంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా వేదికల్లో మొదలైన చిన్న గొడవలు పాఠశాలల్లో ప్రత్యక్ష ఘర్షణలకు దారితీస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తల్లిదండ్రుల అంచనాలూ పెరిగాయి
ఇప్పటి తల్లిదండ్రులు తమ పిల్లల భావోద్వేగ ఆరోగ్యం, ప్రవర్తన, చదువుపై మరింత శ్రద్ధ చూపుతున్నారు. ఇది సానుకూల పరిణామమే అయినప్పటికీ… కొన్నిసార్లు ప్రతి చిన్న విషయానికీ ఉపాధ్యాయులను ప్రశ్నించడం, వెంటనే స్పందించాలని ఒత్తిడి తేవడం వల్ల గురువుల వ్యక్తిగత జీవితం కూడా ప్రభావితమవుతోందని నిపుణులు అంటున్నారు. రాత్రి పది గంటల తర్వాత కూడా వాట్సాప్ సందేశాలు, ఫోన్లు రావడం సాధారణమైపోయిందని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.
‘పాఠశాల-ఇల్లు’ కలిసి పనిచేయాల్సిందే
పిల్లల్లో విలువలు, క్రమశిక్షణ, మానసిక దృఢత్వం పెంపొందించడంలో పాఠశాలలతో పాటు కుటుంబాల పాత్ర కూడా సమానంగా ఉండాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రతి చిన్న అసౌకర్యాన్ని తొలగించడం కంటే, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని పిల్లల్లో పెంపొందించడం అవసరమని వారు సూచిస్తున్నారు.
ఉపాధ్యాయుడికి కష్టాలు
ఉపాధ్యాయులు రోజంతా నిలబడి బోధించడం వల్ల గొంతు సమస్యలు, కాళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వారిలో పెరుగుతున్నాయి. మరోవైపు మానసిక ఒత్తిడి, నిరంతర పర్యవేక్షణ, తల్లిదండ్రుల అంచనాలు, విద్యార్థుల భావోద్వేగ సమస్యలు, అడ్మినిస్ట్రేషన్ సంబంధిత పనులతో పెరిగిన భారం… ఇవన్నీ కలిసి ఉపాధ్యాయ వృత్తిని గతంతో పోలిస్తే మరింత క్లిష్టంగా మార్చేశాయని నిపుణులు చెప్తున్నారు. ఇక ఇంతగా కష్టపడినా.. వారికి వచ్చే వేతనాలు కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. చాలా కార్పొరేటు, ప్రయివేటు పాఠశాలలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయి. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇలాంటి పరిస్థితులపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా కరువవడంతో కార్పొరేటు, ప్రయివేటు పాఠశాలలు తమకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాయని పరిశీలకులు చెప్తున్నారు. దేశంలో విద్యా వ్యవస్థ మరింత సమర్థవంతంగా ఉండాలంటే పాఠశాలలు, తల్లిదండ్రులు, ప్రభుత్వాలు, విధాన రూపకర్తలు కలిసి ఉపాధ్యాయులపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.



