పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..రైతుల కండ్లల్లో ఆనందం చూస్తాం
విద్యాసూచీలో రాష్ట్రాన్ని 18వ స్థానానికి చేర్చాం
మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే సీఎం కప్
టీజీఐపాస్ ద్వారా 1.29 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం
2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గోల్కొండ కోటలో జాతీయ జెండావిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన నీటి హక్కుల విషయంలో రాజీపడేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతీ నీటి బొట్టునూ సాధించి తీరుతామన్నారు. తుమ్మడిహెట్టి నుంచి పాలమూరు వరకు పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని ఆయన హామీనిచ్చారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతుల కండ్లల్లో ఆనందం చూస్తామని వ్యాఖ్యానించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీఎంకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన ముఖ్యమంత్రి… రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తమ 32 నెలల పరిపాలనలోసాధించిన విజయాలు, అమలు చేసిన పథకాలు, వాటి ఫలితాలను ఆయన సోదాహరణంగా ఏకరువు పెట్టారు. 2025-26లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,932 (దేశ తలసరి ఆదాయం కంటే 91 శాతం అధికం)గా ఉండటాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలమని ఆయన అభివర్ణించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వరి సాగు, విస్తీర్ణంలో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందంటూ హర్షం వ్యక్తం చేశారు. గత యాసంగిలో 81.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు.
విద్యాసూచీలో 18వ స్థానం
విద్యారంగంలో తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు స్పష్టమైన ఫలితాలనిచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో వందకుపైగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణమే లక్ష్యమని చెప్పారు. వీటిలో ఇప్పటికే 105 స్కూళ్లను మంజూరు చేశామనీ, 84 బడులకు అనుమతులిచ్చామని వివరించారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించామనీ, డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 212 శాతం పెంచామని గుర్తు చేశారు. దాదాపు 22 లక్షల మంది పిల్లలకు అల్పాహారం, పాలు, పోషకాహారం అందిస్తున్నట్టు తెలిపారు. జూనియర్ కాలేజీల్లో సైతం మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నట్టు వివరించారు. 11 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయిబర్స్ మెంట్ ను వారి ఖాతాల్లోనే నేరుగా జమ చేసే విధానాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు.
ఆ మాణిక్యాల కోసం సీఎం కప్
గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే క్రీడా విధానాన్ని అమలు చేస్తున్నామని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీతోపాటు గచ్చిబౌలిలో స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ ను ఏర్పాటు చేశామని అన్నారు. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకే సీఎం కప్ ను నిర్వహించినట్టు వివరించారు. త్వరలో తెలంగాణ వేదికగా ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ -2026’ను నిర్వహించబోతున్నట్టు సీఎం ప్రకటించారు. యువతకు విద్యతో పాటు నైపుణ్య కోర్సుల్లో శిక్షణను అందిస్తూ ఉద్యోగవకాశాలను పెంచామని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే 72 వేల ఉద్యోగాలను భర్తీ చేశామనీ, టీజీపీఎస్సీ ద్వారా 456, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 7,435 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత తమదనీ, చదువుకుని ఉద్యోగాలు దక్కించుకోవాల్సిన బాధ్యత యువతదని సూచించారు. ఇతర వ్యాపకాల వైపు మళ్లకుండా పరీక్షలకు సిద్ధపడాలని విద్యార్థులను కోరారు.
వెల్లువలా పెట్టుబడులు…
టీజీఐపాస్ ద్వారా ఇప్పటికే రూ.1.29 లక్షల పెట్టుబడులు సాధించామనీ, వీటితో 78 వేలకు పైగా ఉద్యోగవకాశాలు రాబోతున్నాయని సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరినట్టు చెప్పారు. 2025-26లో ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరాయనీ, ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు 12.14 లక్షలకు పెరిగాయని తెలిపారు. హైదరాబాద్ లో ఇప్పటికే 355కు పైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు ఉన్నాయనీ, 2026లో కొత్తగా 40 సెంటర్లు వచ్చాయని తెలిపారు. దీంతో రాష్ట్రం పెట్టుబడులకు చిరునామాగా మారుతున్నదని సీఎం హర్షం వ్యక్తం చేశారు.
2034 నాటికి కోటి మంది మహిళలు కోటీశ్వరులు
2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ దిశగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలు, ఆర్థిక సాయాల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.60,487 కోట్ల రుణాలను అందించామన్నారు. వడ్డీ లేని రుణాల కింద రూ.1,900 కోట్ల రాయితీని విడుదల చేసినట్టు తెలిపారు. మహిళలను పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులకు యజమానులుగా మార్చామన్నారు.
సామాజిక భద్రతకు పెద్దపీట
తమ ప్రభుత్వం సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తోందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 3.38 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని అన్నారు. రెండో దశలో 2.50 లక్షల కొత్త ఇండ్ల మంజూరుతోపాటు క్యూర్ పరిధిలో లక్ష ఇండ్లను నిర్మిస్తున్నట్టు తెలిపారు. అర్హులైన వారికి కొత్తగా ఫించన్లకు మంజూరు హామీనిచ్చారు. ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లును ఆమోదించామని, మొత్తం వ్యయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి 12.4 శాతం కేటాయించామని తెలిపారు.
కనీస వేతనాల సవరణ
పన్నెండేండ్ల నుంచి పెండింగ్ లో ఉన్న కనీస వేతనాలను తమ ప్రభుత్వం సవరించిందని సీఎం వివరించారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం చట్టం తెచ్చామనీ, అదే విధంగా సినీ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వయస్సు మళ్లిన తల్లిదండ్రుల విషయంలో ఉద్యోగులైన పిల్లల బాధ్యతను గుర్తుచేసేలా చట్టం చేశామని అన్నారు. రోహిత్ వేముల చట్టానికి రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు.
టీజీ సేఫ్ తో కల్తీ నియంత్రణ
డ్రగ్స్ ముప్పుతో పాటు ఆహారకల్తీని పూర్తిగా నియంత్రించేందుకు టీజీసేఫ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. కల్తీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు ఉస్మానియా ఆస్పత్రి, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు నూతన భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఎనిమిది మెడికల్ కాలేజీలకు కొత్త భవనాలను నిర్మించేందుకు నిర్ణయించామని వివరించారు. సీఎం సహాయనిధి కింద నిరుపేద రోగులకు రూ.2,526 కోట్లు అందించినట్టు తెలిపారు.
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సహా ఉద్యోగులందరికి ప్రతీ నెలా మొదటి తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని సీఎం గుర్తు చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను ప్రాధాన్యతా క్రమంలో చెల్లిస్తున్నామనీ, ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రూ.6 వేల కోట్లను విడుదల చేశామని తెలిపారు.
డిజిటల్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పారదర్శకమైన పాలన అందించడంలో భాగంగా త్వరలోనే ఆన్ లైన్ ప్రజావాణి పోర్టల్ ను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా 360 కిలోమీటర్ల ట్రిబుల్ ఆర్ నిర్మాణంతో పాటు 6,092 కిలోమీటర్ల హ్యామ్, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ మెట్రో రెండో దశను ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలిపారు. మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణతోపాటు ఆదిలాబాద్ జాయింట్ యూజ్ ఎయిర్ ఫీల్డ్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రోడ్, రైల్, విమాన, లాజిస్టిక్స్ కనెక్టివిటీ విస్తరించే దిశగా ముందుకెళ్తున్నట్టు తెలిపారు.
సహకరించండి..నష్టపోనివ్వను…
రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించే వారు ఏ మాత్రం నష్టపోకుండా చూస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళనతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ కోసం తమ భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చే నివాసితులు నష్టపోకుండా చూస్తానని భరోసానిచ్చారు. ఇందుకోసం మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్నవారు పెద్ద మనసుతో ముందుకు రావాలని ఆయన కోరారు. దేశ జీడీపీలో రాష్ట్రవాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. గత రెండున్నరేండ్లలో ప్రజల భాగస్వామ్యంతో విజయాలు సాధించామని చెప్పారు. అందరి సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మానవ ప్రయత్నానికి దైవ సంకల్పం తోడైతే తప్పకుండా విజయం సాధిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.



