Sunday, August 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఉద్యమించాలి

సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఉద్యమించాలి

- Advertisement -

సవాళ్ళను ఎదుర్కోవడానికి 
కార్మికులు సిద్ధం కావాలి
సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎమ్.సాయిబాబు
శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ, కార్మికులతో ప్రతిజ్ఞ

నవతెలంగాణ-పటాన్‌చెరు
దేశ స్వాతంత్ర, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు కార్మికవర్గం ఉద్యమించాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సీఐటీయూ అఖిలభారత కోశాధికారి ఎం.సాయిబాబు యువకార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మనం మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవటం, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే ఇది 200 ఏండ్ల పాటు సాగిన జాతీయోద్యమ పోరాట ఫలితమన్నారు. 1946లో రాయల్ నావికాదళం తిరుగుబాటు చేస్తే దేశ స్వాతంత్రం కోసం కార్మిక వర్గం మొత్తం ఆ నావికాదళం తిరుగుబాటుకి మద్దతుగా వీధుల్లోకి వచ్చిందన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కార్మిక వర్గం ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, విద్యావంతుడు, మేధావి బి.టి రణదివే కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించారన్నారు. బీటీఆర్‌ 1970లో అఖిల భారత సీఐటీయూ అధ్యక్షుడిగా పని చేశాడన్నారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల అమరత్వంతో స్వాతంత్రం సిద్ధించిందన్నారు.

నేడు భారత రాజ్యాంగం చాలా ప్రమాదంలో పడిందన్నారు. మళ్లీ ఆర్థిక స్వావలంబన అనేది ఒక పెద్ద సమస్యగా ముందుకు వచ్చిందన్నారు. సీఐటీయూ కార్మిక సంఘంగా జాతీయోద్యమ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న సంఘంగా.. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ సామ్రాజ్యవాద బందీగా, బహుళజాతి కంపెనీల దోపిడీకి గురికాకుండా దేశాన్ని కాపాడుకునేందుకు పోరాడుతుందన్నారు. మన ఆర్థిక స్వాతంత్రాన్ని, స్వావలంబనని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సీఐటీయూ అంగీకరించదన్నారు. ఈ దేశంలో కార్మిక వర్గం హక్కులు, జీవన పరిస్థితుల కోసం సీఐటీయూ రాజీలేని పోరాటాలు చేస్తోందన్నారు. అదే విధంగా దేశ స్వావలంబన, ఆర్థిక, రాజకీయ స్వాతంత్రాలను నిలబెట్టడం, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం కూడా తన పోరాటాలను కొనసాగిస్తుందని తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించన త్యాగదనుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మళ్లీ దేశంలో కులం, మతం, జాతి, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య ఐక్యతకు చిచ్చుపెట్టే విధానాలు కొనసాగకుండా చూడాలన్నారు. నయా ఉదారవాద విధానాల పేరుతో పెట్టుబడికి లాభాలు రావడం కోసం పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులని అనేక రకాల పేరుతో విభజన జరుగుతుందన్నారు. .ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ నాయకులు పి. పాండురంగా రెడ్డి, ఎమ్. సత్తిబాబు, బి. ప్రదీప్ కుమార్, జి. గణేష్, వి. సదాశివ రెడ్డి కమిటీ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు. ​


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -