Sunday, August 16, 2026
E-PAPER
Homeజాతీయంసంస్కరణలు మరింత వేగం

సంస్కరణలు మరింత వేగం

- Advertisement -

రానున్న 5-7 ఏండ్లలో లక్ష్యాలు పూర్తి చేయాల్సి ఉంది
వికసిత్ భారత్ కోసం సప్తధార విజన్
ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి దేశం బయటపడాలి
దేశ అభివృద్ధికి యువతే అతిపెద్ద లబ్దిదారులు
ఎర్రకోట నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో రానున్న 5-7 ఏండ్లలో లక్ష్యాలు పూర్తి చేయాల్సి ఉందని, ఆ లక్ష్యాల సాధనకు సంస్కరణలు మరింత వేగం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని మోడీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ త‌రువాత ఎర్ర‌కోట‌పై వందేమాత‌ర గేయాన్ని వినిపించారు. ఆర్మీ బ్యాండ్‌తో వందేమాత‌రాన్ని ఆల‌పించారు. ఎర్ర‌కోట‌ వేదిక‌పై రెండు ఎంఐ-17 హెలికాప్ట‌ర్లు పూల‌వ‌ర్షం కురిపించాయి. ఓ హెలికాప్ట‌ర్ జాతీయ ప‌తాకాన్ని మోసుకెళ్లింది. మ‌రో హెలికాప్ట‌ర్ వందేమాత‌రం గేయం రాసిన జెండాను తీసుకెళ్లింది. దేశానికి స్వాతంత్య్ర‌ వ‌చ్చిన త‌రువాత‌ మొద‌టిసారి పూర్తిగా వందేమాత‌రం గేయాన్ని ఎర్ర‌కోట వ‌ద్ద ఆల‌పించారు. అనంతరం దేశప్రజలను ఉద్దేశించి ప్ర‌ధాని మోడీ ప్రసంగించారు.
దేశవ్యాప్తంగా ‘వందేమాతరం’ నినాదం మార్మోగుతోం దని, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గత 12 ఏండ్లలో దేశం అనేక రంగాల్లో గణనీయమైన మార్పును సాధించిందని చెప్పారు.

గత 5-7 దశాబ్దాల్లో సాధించలేక పోయిన లక్ష్యాలను రానున్న 5-7 ఏండ్లలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆలోచనా విధానంలోనూ, లక్ష్యాల సాధనలోనూ సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని వివరించారు. 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ను నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పం, సామర్థ్యమే దేశానికి అతిపెద్ద బలమని అన్నారు. కరోనా మహమ్మారి, యుద్ధాలు, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అనేక సవాళ్లు ఎదురైనా భారత్‌ తన అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించిందని మోడీ తెలిపారు. ఒకప్పుడు ‘ఫ్రాజైల్‌ ఫైవ్‌’ దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్‌ ఇప్పుడు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని అన్నారు. ​డీలిమిటేష‌న్‌తో లింకున్న మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును పాస్ చేసేలా మ‌ద్ద‌తు ఇవ్వాల‌నీ, ఆ త‌రువాత ఆ అంశంలో క్రెడిట్ తీసుకోవాల‌ని ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌ధాని మోడీ కోరారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌కు ఆమోదం తెలిపి, రాజ‌కీయ పార్టీలు దానికి క్రెడిట్ తీసుకోవ‌చ్చు అన్నారు. అసెంబ్లీలు, లోక్‌స‌భ‌ల్లో మహిళలకు 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును అమ‌లు చేసి మ‌హిళ‌ల‌ను గౌర‌వించాల‌న్నారు.

కోటి మంది యువ‌త‌కు ఏఐ స్కిల్స్‌
వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని ప్ర‌ధాని మోడీ అన్నారు. దేశ అభివృద్ధికి యువతే అతిపెద్ద లబ్ధిదారులుగా నిలుస్తారని వివరించారు. వికసిత్ భారత్ కోసం సప్తధార ప్రణాళికను ప్రధాని మోడీ ప్రకటించారు. స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘భార‌త్‌లో ప్ర‌స్తుతం సుమారు రెండున్న‌ర ల‌క్ష‌ల స్టార్ట‌ప్‌లు ఉన్నాయి. ఇటీవ‌ల త‌మ ప్ర‌భుత్వం ఏఐ ఇంపాక్ట్ స‌ద‌స్సును నిర్వ‌హించింది. ఏఐ ప‌రిధి చాలా త్వ‌ర‌గా విస్త‌రిస్తోంది. ఎర్ర‌కోట నుంచి దేశ యువ‌త‌కు ఓ ప్ర‌క‌ట‌న చేస్తున్నాను. రాబోయే సంవ‌త్స‌ర కాలంలో దేశంలోని కోటి మంది యువ‌త‌కు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యాన్ని నేర్పించ‌నున్నాం. ఏఐ ప్ర‌పంచంలో ఆ యువ‌తను బ‌లోపేతం చేయ‌నున్నాం. స‌ప్త ధార విజ‌న్‌లో భాగంగా టెక్నాల‌జీ, ఇన్నోవేష‌న్‌ను మూడో శ‌క్తిగా ప‌రిగ‌ణిస్తున్నాం. ఏఐ, క్వాంట‌మ్ టెక్నాల‌జీ, స్పేస్, రోబోటిక్స్‌, డేటా సెంట‌ర్ల రంగం వేగంగా విస్త‌రిస్తోంది. కొత్త అవకాశాల‌ను అందిపుచ్చుకునేందుకు యువ‌త‌కు ట్రైనింగ్ ఇవ్వ‌నున్నాం’’ అని అన్నారు.

​‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కీలకం
దేశం స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా సొంత సామర్థ్యాలను పెంచుకోవడం, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంతో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ నిర్మాణం సాధ్యమవుతుందని వివరించారు. భారత్‌ ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడాలని మోడీ స్పష్టం చేశారు. ‘మేకిన్‌ ఇండియా’, ‘స్వదేశీ’, ‘లోకల్‌ ఫర్‌ లోకల్‌’ కార్యక్రమాలకు ప్రజలు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు.

​సెమీకండక్టర్‌ రంగంలో స్వావలంబనకు అడుగులు
సెమీకండక్టర్‌ రంగంలో స్వావలంబన సాధించేందుకు భారత్‌ కీలక అడుగులు వేస్తోందని ప్ర‌ధాని మోడీ చెప్పారు. ఇప్పటికే మూడు సెమీకండక్టర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. దేశ ఇంధన భద్రతకు అణుశక్తి కీలకమని పేర్కొన్నారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. 2014 నుంచి దాదాపు 40 దేశాలతో భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, వాణిజ్య భాగస్వామ్యాలు కుదుర్చుకుందని తెలిపారు. ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందాలతో దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు భారీ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. గత 12 ఏండ్లలో రక్షణ ఉత్పత్తి దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు ఐదు రెట్లు పెరిగిందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలోనూ భారీ వృద్ధి సాధించామని చెప్పారు.

​రైతుల‌పై ఎరువుల ధ‌ర‌ల ప్ర‌భావం లేకుండా చ‌ర్య‌లు తీసుకున్నాం
ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగినప్పటికీ భారత రైతులపై ఆ ప్రభావం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. 12 ఏండ్ల క్రితం కేవలం 70 నగరాలకే పైప్డ్‌ గ్యాస్‌ సౌకర్యం ఉండగా, ఇప్పుడు 700 నగరాలకు విస్తరించిందని మోడీ తెలిపారు. దేశవ్యాప్తంగా 1.75 కోట్ల కుటుంబాలు పైప్డ్‌ గ్యాస్‌ కనెక్షన్లతో అనుసంధానమయ్యాయని చెప్పారు.

​‘దిమాగీ న‌క్స‌ల్స్’ ఓ కొత్త ర‌క‌మైన శ‌త్రువు
దిమాగీ న‌క్స‌ల్స్ ఓ కొత్త ర‌క‌మైన శ‌త్రువు అని మోడీ తెలిపారు. ‘‘మావోయిస్టు మైండ్‌సెట్ ఉన్న వ్య‌క్తులు ఇప్పుడు దేశ రాజ‌కీయాల్లో భాగ‌స్వామ్యం అవుతున్నారు. కొంద‌రు ప్ర‌భుత్వ క‌మిటీల్లోనూ అడ్వైజ‌ర్‌ల‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. మావోయిస్టు ఐడియాల‌జీ దేశ విధానాల‌పై ప్ర‌భావం చూపింది. ద‌ట్ట‌మైన అడ‌వుల్లో ఉండే మావోయిస్టులను అంతం చేశాం. ఆ సంక్షోభం నుంచి దేశాన్ని ర‌క్షించాం. సాయుధ మావోయిస్టులు అంతమైనా.. ‘దిమాగీ న‌క్స‌ల్స్’ మాత్రం అలాగే ఉన్నారు’’ అని ప్ర‌ధాని అన్నారు. ‘ఆ నక్సల్స్‌’ దేశంలో హింస‌, అల్ల‌ర్లు సృష్టిస్తున్నార‌ని మోడీ ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -