Sunday, August 16, 2026
E-PAPER
Homeసోపతిబొంబాయి ప్రోగ్రెసివ్‌లు

బొంబాయి ప్రోగ్రెసివ్‌లు

- Advertisement -

స్వరాజ్యం కోసం పోరాటం సాగిస్తున్న భారతీయులకు 1940 నాటికి మనదంటూ ఒక గుర్తింపు కావాలనీ, ఆ గుర్తింపు మన ఆలోచనల ప్రతిబింబం అవ్వాలని, ముఖ్యంగా కళాకారులు అడుగు ముందుకు వేశారు. బ్రటీష్‌వారు వారి ఆర్ట్‌ స్కూళ్లలో నేర్పే చిత్రాలను, అలాగే బ్రిటీష్‌వారి కళా పద్ధతులకు విరుద్ధంగా సంప్రదాయ సంస్కృతికి తిరోగమన పద్ధతిలో పీట వేసిన బెంగాల్‌ వారి కళలను, కళాకారులు వదిలి పెట్టారు. బొంబాయిలోని జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ కొంత వేరు ఆలోచనలతో ముందడుగు వేసేందుకు విద్యార్థులకు వెసులుబాటు కలిగించింది. అలా అని పూర్తి స్వాతంత్య్రమూ లేకపోయింది. ఫ్రాన్సిస్‌ న్యూటన్‌ సూజా అనే విద్యార్థికి తన ఆలోచనలతో వేసిన చిత్రాలకు తావులేక పోయింది. అలాగే అతను స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడని కళాశాల నుండి పంపేశారు.

బయటకు వచ్చిన సూజా మరిన్ని పురోగమన ఆలోచనలతో ముందుకు నడిచారు. మరో 5గురు కళాకారులు సయ్యద్‌ హైదర్‌ రజా, మఖ్బుల్‌ ఫిదా హుస్సేన్‌, కృష్ణాజీ హౌలాజీ ఆరా, సదానంద బాక్రే, హరి అంబాదాస్‌ గాడీతో కలిసి ‘బాంబే ప్రోగ్రెసివ్‌ కళాకారులు’ అనే సమూహం కూర్చాడు. దీని ముఖ్య ఉద్దేశ్యం భారతీయ సామాజిక సాంస్కృతిక విశిష్టతను వెలికి తీయటం. అది పల్లె, పట్టణ జీవనం కావచ్చు, పండుగలు కావచ్చు. అలాగే టెక్నాలజీ మార్పు జరుగుతున్న యువ భారతదేశంలో దేశం, విదేశం అనే భేదం కాక వారి భావ ప్రకటనకు సరిపడిన పద్ధతిలో చిత్రం చిత్రించడటం. అందుకు వారు పూర్తి యూరోప్‌లో ప్రబలిన అనేక కళాపద్ధతులు అవగాహన చేసుకుని ముందుకు అడుగువేశారు. 1947లో బొంబాయిలో కొత్తగా తెరచిన జహంగీర్‌ ఆర్ట్‌ గ్యాలరీలో తమ ప్రదర్శన ఏర్పాటు చేశారు. వారి కళలను వివరించే పట్టిక, క్యాటలాగ్‌లో వారు ఒక విప్లవాత్మక పురోగమనం కోసం చూస్తున్నారని అర్థం అవుతుంది. ఈ ప్రదర్శన తర్వాత కళలు బొంబాయిలో కేంద్రీకతమయ్యాయి.
అలాగే భారతీయ ఆధునిక కళల దారికి ఒక మార్పు తీసుకువచ్చింది. ఆనాటి వరకూ స్వతంత్రపోరాటంలో దేశవిముక్తి, స్వదేశం కోసం అందరూ ఏకమై ఒకటే ఉద్దేశ్యంతో ముందడుగు వేశారు. స్వతంత్ర భారతంలో మన గుర్తింపు ఏమిటి అనే ప్రశ్న కళాకారుల్లో మొదలయింది. పురోగమన దారిలో ముందడుగు వేస్తున్న ఈ ప్రపంచంలో మనమూ మన గుర్తింపుతో పాటు పురోగమన అడుగులు వేయాలనేది వీరి ఉద్దేశ్యం. ఈ ఆరుగురు కళాకారుల కళల వివరణలో వారి ఉద్దేశ్యాలూ విశదమౌతాయి.

ఎఫ్‌.ఎన్‌.సూజా : ఈ బాంబే ప్రోగ్రెసివ్‌ కళాకారులు సమూహంగా పనిచేయటానికి ముఖ్యకారకుడు. ఈయన 1924లో పోర్చుగీసువారి కాలనీ గోవాలో జన్మించాడు. పుట్టిన 3 నెలలకు తండ్రి పోయాడు. తల్లి బొంబాయిలో పనిచేస్తున్నా అనారోగ్యం వల్ల ఇతను గోవాలోనే వుండిపోయాడు. అక్కడి ప్రాంతీయ కథలు, జానపద కళలు, అలంకరణలు, క్రైస్తవ చర్చీలు ఇతన్ని ఎంతో ఆకర్షించేవి. అలాగే అమ్మమ్మ వద్ద చర్చీల ప్రొఫెట్‌ల దురదష్ట కథలూ విన్నాడు. తల్లి ఇతను చర్చికి ప్రీస్ట్‌ కావాలని ఆశపడింది. అది కుదరలేదు. కళల మీద ఆసక్తితో బొంబాయిలోని జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌లో చేరాడు. ఇతను వేసే అశ్లీల చిత్రాల వల్ల, స్వదేశీ పోరాటంలో పాల్గొనటం వల్ల కళాశాల నుండి తీసేశారు. ఏ ప్రదర్శనలోనూ భాగమయ్యే అవకాశం ఇవ్వలేదు. 1947లో ఒక కొత్త ఆలోచనా పద్ధతిలో కళలు చిత్రించాలనే భావంతో బొంబాయి ప్రోగ్రెసివ్‌ల కళాసంస్థని నిర్మించాడు. ఈ సంస్థ ఉద్దేశ్యం కొత్తరకంగా కళలలో భావప్రకటన చేయాలని.
మానవనైజం మంచి చెడుల కలయిక. మనుషులు అందమైన ముసుగు వేసుకున్నట్టు మాట్లాడుతున్నా వారి మనసులో దాగిన విషపూరిత ఆలోచనల తెరలాగి చూసినట్టు, వారి మనసున దాగిన నిజాన్ని చిత్రంగా వేయగలడు ఇతను. కత్తిలాంటి నిజాన్ని చూపే ఇతని ధైర్యం ప్రశంసనీయం. ‘టెంపుల్‌ డాన్సర్‌’ అనే శీర్షికన వేసిన దేవదాసి గురించిన చిత్రాలు మనుషుల మనసును బయట పెడతాయి. దేవదాసి అనగానే అందమైన దృశ్యం, చిత్రం కోసం ఎదురు చూస్తారు దర్శకులు. కానీ ఈయన చిత్రం మరో నిజం చెపుతుంది. దేవదాసిని చూసినప్పుడు మగవారి మనసులో కలిగిన వికార చేష్టలు, ఆ స్త్రీని అందరూ వస్తువులా చూసినప్పుడు ఆమెకు కలిగిన బాధని తెలియజేస్తుంది. చిత్రం అంటే అందమైన గీతల రంగుల కలయిక కాదు. మనుషుల నిజాలను తెలిపే దర్పణమన్నట్టు వుంటాయి ఈ చిత్రాలు. ఈయన శిలపైకి ఎక్కించిన క్రీస్తు చిత్రం వేస్తే అది ఆధ్యాత్మిక చిత్రం కాదు. ఆ మానవ శరీరం కార్చుకున్న రక్తం, బాధ వైపు ఇతని దృష్టి వుంటుంది. ఈయన వేసే రేగడిమట్టి రంగులు, వంకరలు దిద్దిన నలుపు రంగులు, ఆదిమానవుల్లాంటి చిత్రాలు మనని ఆలోచింపజేస్తాయి. ఆలోచనల మార్పుకు దోహదం చేస్తాయి.

ఈయనకు సంప్రదాయ భారతీయ సంగీతం, మందిరాలపై వున్న శిల్పకళ ఎంతో ఇష్టం. ఏ విషయమైనా వివేచనతో విశ్లేషించి మంచి చెడులను అర్థం చేసుకోవాలన్నది ఆధునికత. గుండెను కత్తితో పొడిచి లోపల దాగున్న నిజాన్ని చూసి చిత్రం వేస్తాడా అనే ఆలోచన వస్తుంది ఈయన చిత్రం చూస్తే. 2001లో సూజా తన ఆలోచనల గురించి చెప్తూ చిత్రం తనకు అందమైనది కాదు, ఒక సరీసపంలా, వికృత అర్థాలు చెప్పవలసిన నిజమనిపిస్తుంది అన్నాడు. 1949లో ఇతను లండన్‌, ఆపై న్యూయార్క్‌ వెళ్లిపోయాడు. అక్కడా చిత్రకళ అభ్యసించాడు. ఇతని చిత్రాలు దేశవిదేశాల్లో పొందుపరచి వున్నాయి. 2002లో కన్నుమూశాడు.

కృష్ణాజీ హౌలాజీ ఆరా : హైదరాబాద్‌ బొల్లారంలో 1914లో జన్మించాడు. కాలాఘోడా, బొంబాయిలో నెలకొల్పిన బాంబే ప్రోగ్రెసివ్‌ కళాకారుల సంస్థలో ఒకడు. ఆరా బొంబాయిలోనే వుండి పనిచేశాడు. ఎన్నో ప్రదర్శనలూ చేశాడు. ఇతను ప్రకృతి దృశ్యాల మీద, మన రోజువారి వస్తువులపై నిశ్చల చిత్రాలు వేశాడు. ఆ చిత్రాలు ప్రకతి సిద్ధం అనిపిస్తాయి. అలాగే సామాజిక రాజకీయ చిత్రాలు కూడా వేశాడు. ఈయన చిత్రాలు చూస్తే ఫ్రెంచ్‌ కళాకారుడు పాల్‌ సిజాన్‌ వేసిన నిశ్చల వస్తువుల చిత్రాలను చూసి ప్రేరణ పొందాడని అర్థమవుతుంది. నిజానికి కళాచరిత్రో నిశ్చల వస్తువుల చిత్రాలు, ప్రకృతి దృశ్య చిత్రాలు ముఖ్య చిత్రాలుగా లెక్కపెట్టలేదు. ముఖ్య చిత్రం వేసినప్పుడు పక్కన వేసే లఘుచిత్రాలనే అర్థం చేసుకున్నారు ఈ రెండు రకాల చిత్రాలను.
17వ శతాబ్దంలో డచ్‌ కళాకారులు, బతుకు తెరువు కోసం యాత్రికులు వచ్చే ప్రదేశాలకు వెళ్లి, ప్రకృతి దృశ్యాలు, నిశ్చల వస్తు చిత్రాలు వేసి అమ్ముకునేవారు. ఆ సందర్భాన వారు ఆ చిత్రాలలోని సౌందర్యాన్ని కవితలాగో, ఒక నాటకంలాగానో ఆనందించారు. నిజానికి వీరూ ఒక మొదటితరం పాశ్చాత్య ఆధునిక కళాకారులని చెప్పవచ్చు. చరిత్ర చెప్పని విషయాల్ని బయటకు తెలియజేయటం ఆధునికతకు ఒక అర్థం. ఆరా ఎంచుకున్న ఆధునికత అదే.. మన జీవన, వస్తు విషయాలను మనపరంగా చిత్రించటం.
ఇతనికి మూడేండ్లునప్పుడు తల్లిపోయింది. తండ్రి మళ్లీ వివాహమాడాక 7 ఏండ్ల వయసుకు ఇతను బొంబాయి వెళ్లిపోయాడు. అక్కడ కార్లు తుడిచాడు. ఒక ఇంగ్లీషు వారి ఇంట పనిచేశాడు. పని మధ్యన దొరికిన సమయాన చిత్రాలు వేసేవాడు. ఆ ఇంగ్లీషు వారి ఇంటికి వచ్చే రూడీవాన్‌ లీడన్‌ అనే కళాభిమాని దృష్టిలో ఇతని చిత్రాలు పడ్డాయి. ఆపై వాల్టర్‌ లాంగ్‌హామర్‌ అనే కళా ప్రేమికుడి దృష్టినీ ఆకర్షించి జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ బొంబాయిలో చిత్ర అభ్యాసం కోసం చేరాడు. 1942లో అక్కడి ఒక రెస్టారెంట్‌లో ఇతను తన మొదటి ప్రదర్శన ఇచ్చాడు. 1963లో అతను వేసిన ‘బ్లాక్‌ న్యూడ’ శీర్షిక చిత్రాలు గుర్తిండిపోయిన ప్రదర్శనయింది. స్వదేశీ విప్లవంలోనూ పాల్గొన్నాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. 5 నెలల జైలు శిక్ష అనుభవించాడు. దేశానికి స్వతంత్రం వచ్చిన గుర్తుగా పెద్ద కాన్వాస్‌పై చిత్రం వేశాడు. 1944లో ఇతను గవర్నర్‌ అవార్డ్‌, విండసర్‌, న్యూటన్‌ క్యాష్‌ అవార్డ్‌, బొంబాయి ఆర్ట్‌ సొసైటీ బంగారు పతకం, యునెస్కో అవార్డు అందుకున్నాడు. అహ్మదాబాద్‌, బరోడా, కలకత్తా, బొంబాయి, విదేశాలలో ప్రదర్శనలిచ్చాడు. కష్టపడుతున్న ఎందరో కళాకారులకు తన పరిస్థితి అంతంత మాత్రమే అయినా సాయం చేశాడు. వివాహమాడలేదు.1985లో కన్నుమూశాడు.
(బొంబాయి ప్రోగ్రెసివ్‌ సమూహంలోని మిగిలిన కళాకరుల గురించి ఆ పై సంచికలో)

డా||యం.బాలామణి, 8106713356

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -