ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అమరవీరుడు కామ్రేడ్ రాగిరెడ్డి వీరారెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ తెలిపింది. వీరారెడ్డి వర్థంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించింది. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఆఫీస్ కార్యదర్శి రమేశ్ అధ్యక్షతన జరిగిన సభలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్. రజినీకాంత్, టి. నాగరాజు మాట్లాడారు. తన ఆశయాలతో వీరారెడ్డి నిత్యం ప్రజల గుండెల్లో జీవించే ఉంటారని వారు తెలిపారు. నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ తాలూకా, నాయనిపాలెం గ్రామంలో 1958లో జన్మించిన వీరారెడ్డి విద్యార్థి దశ నుంచే సామాజిక చైతన్యంతో పని చేశారని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వంతో పాటు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ప్రజా పోరాటంలో అమరులైన గాదె శ్రీనివాస్ రెడ్డి, బిక్ష్యానాయక్, సీతారాంరెడ్డిల స్ఫూర్తిని పొందారని తెలిపారు. ఆయన ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. “ఆదర్శాలు వల్లించడం కాదు, వాటిని ఆచరణలో చూపాలని” కామ్రేడ్ సుందరయ్య చెప్పిన మాటలను జీవితాంతం పాటించారని తెలిపారు. పేదలు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ విద్యాసంస్థల్లో ఎస్ఎఫ్ఐ నిర్మాణానికి దృష్టి పెట్టారని చెప్పారు.
విద్యార్థి సంఘ ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడి, ఓటమి పాలైనా నిరుత్సాహపడకుండా వీరారెడ్డి ముందుకెళ్లే వారన్నారు. హాస్టల్ సమస్యలపై పోరాడుతూ పాత సంప్రదాయాల్ని ప్రశ్నిస్తూ, పరిష్కారాలు కనుగొనే మార్గంలో నడిచిన వీరారెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని ప్రకటించారు.వీరారెడ్డి తన వ్యక్తిగత జీవితంలోనూ బాల్యవివాహాన్ని వ్యతిరేకించారని తెలిపారు. తన మేనమామ కూతురికి పునర్వివాహం జరిపించి సామాజిక సంస్కర్తగా నిలిచారని గుర్తుచేశారు. భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా, దళితులకు ప్రభుత్వం కేటాయించిన బంజరు భూముల రక్షణ కోసం ఎర్రజెండా పట్టి ముందుండి పోరాడారన్నారు. ఆయన ఎదుగుదలను, ప్రజాదరణను ఓర్వలేని కాంగ్రెస్ గుండాలు 1985 ఆగష్టు 15న అతి కిరాతకంగా ఆయనను హత్య చేశారని తెలిపారు. వీరారెడ్డి త్యాగం వృధా పోదని, ఆయన చూపిన పోరాట బాటలో పయనించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. కిరణ్, అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్, హైదరాబాద్ జిల్లా నాయకులు రజినీకాంత్, ప్రవీణ్, అంజి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
అమరుడు కామ్రేడ్ రాగిరెడ్డి వీరారెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



