Sunday, August 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకొత్త గనులతో సింగరేణికి నూతన జవసత్వాలు

కొత్త గనులతో సింగరేణికి నూతన జవసత్వాలు

- Advertisement -

పోటీ మార్కెట్లో నిలబడడానికి
 ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలి : 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో సింగరేణి సీఎండీ డాక్ట‌ర్ బుద్ద‌ప్ర‌కాష్ జ్యోతి
నవతెలంగాణ-కొత్తగూడెం

కొత్త గనులతో సింగరేణికి నూతన జవసత్వాలు వస్తాయని, సింగరేణి సంస్థ పోటీ మార్కెట్లో నిలబడడానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సింగరేణి సీఎండీ డాక్ట‌ర్ బుద్ద‌ప్ర‌కాష్ జ్యోతి అన్నారు. శనివారం కొత్తగూడెం ప్ర‌కాశం స్టేడియంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తొలుత జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ… సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ చొరవ, సహకారంతో రెండు కొత్త బ్లాకులు లభించాయని, రానున్న రోజుల్లో మ‌రికొన్ని గనుల సాధనతో నూతన జవసత్వాలు సంతరించుకొని రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తగినంత బొగ్గును అందిస్తూ దేశ సేవ‌కు పున‌రంకితం అవుతుంద‌న్నారు. సింగరేణి సంస్థ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న‌ తాడిచర్ల -2 బ్లాకుకు మైనింగ్ లీజు ల‌భించింద‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక కృషితో ద‌క్కిన ఈ బ్లాక్ వ‌ల్ల సుమారు 340 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే అవ‌కాశం ల‌భించింద‌న్నారు. త‌ద్వారా 40 ఏండ్ల పాటు అక్క‌డ మైనింగ్ చేయ‌డానికి అవ‌కాశం క‌లిగింద‌న్నారు. అలాగే మ‌ణుగూరు ఏరియాకు ఉజ్వ‌ల భ‌విష్య‌త్‌ను అందించే పీకే ఓసీ-2 డిప్‌సైడ్ బ్లాక్‌ను సింగ‌రేణి సంస్థ వేలంలో ద‌క్కించుకుంద‌ని వివ‌రించారు. దీనివ‌ల్ల 120 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను తవ్వి తీసే గొప్ప అవకాశం కలిగిందని, ఇది మణుగూరుతో పాటు కొత్తగూడెం రీజియన్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు.

సంస్థ ఉన్నతికి, విస్తరణకు సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన వనరుల శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు సింగరేణి యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశిస్తుందని, కర్నాటకలోని దేవ దుర్గ ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు లైసెన్సు సాధించామని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. సింగరేణి సంస్థలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో గల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను వెలికి తీయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రయోజనాలు అత్యంత ముఖ్యమైనవి, ఇందులో భాగంగా తెలంగాణ లో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల‌కు అధిక బొగ్గును స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్టు తెలిపారు. అలాగే ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ లో ఉత్ప‌త్తి అవుతున్న బొగ్గును కూడా ఎస్టీపీపీకి తీసుకొచ్చిన‌ట్టు చెప్పారు. ఇది సింగ‌రేణి చ‌రిత్ర‌లో ఒక గొప్ప మైలురాయి అని వెల్లడించారు.

సంస్థ నిలబడాలంటే రక్షణతో పనిచేస్తూ ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలని, తద్వారా బొగ్గు ఉత్పత్తి ఖర్చు తగ్గుతుందని, ఇందుకోసం ఖర్చు నియంత్రణ చర్యలను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల నుంచి ఎంపికైన ఉత్తమ కార్మికులను, అధికారుల‌ను సంస్థ సీఎండీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి సూర్య నారాయణ, డైరెక్టర్(ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) గౌతమ్ పోట్రు, డైరెక్టర్ (ఈఅండ్ఎం) ఎం.తిరుమలరావు, గుర్తింపు, ప్రాతినిథ్య‌, అధికార సంఘాల నాయ‌కులు వి.సీతారామ‌య్య‌, త్యాగ‌రాజ‌న్‌, పెద్ది నర్సింహులు, వివిధ విభాగాల జీఎంలు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -