రెండేండ్ల తర్వాత కేసీఆర్
సీఎం కావడం ఖాయం
బీఆర్‌ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ భవన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశ నిర్మాణంలో ప్రతి భారతీయుడూ భాగస్వామి కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అన్ని రాష్ట్రాల సమాన అభివృద్ధే నిజమైన దేశభక్తి అని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మహాత్మాగాంధీని గొప్పగా గౌరవిస్తుంటే, దేశంలో మాత్రం ఆయన్ను అవమానించేలా, హత్య చేసిన వారిని కీర్తించేలా కొందరు వ్యవహరించడం బాధాకరమని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను చిన్నచూపు చూడటం దేశానికి మంచిది కాదన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. 1980లలో భారత్-చైనా ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ముందున్నప్పటికీ, నేడు చైనా ఆర్థిక వ్యవస్థ 20 ట్రిలియన్ డాలర్లకుపైగా ఉందని గుర్తు చేశారు. కానీ భారత్ సుమారు 3.4 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉందన్నారు.భారత్ కంటే దాదాపు ఆరు రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఎదిగిందన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి బలహీన దేశాలతో పోల్చుకుని గొప్పగా ఉన్నామని చెప్పుకోవడం సరైన అభివృద్ధి ప్రమాణం కాదన్నారు.. దేశంలో యువత ఎదిగేందుకు, వారికి ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వాలు దృష్టిసారించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ‘డబుల్ ఇంజన్’ నినాదాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్న వాదన సరికాదన్నారు. తెలంగాణ కంటే మెరుగ్గా పనిచేసిన ఒక్క డబుల్ ఇంజన్ రాష్ట్రాన్ని చూపించాలని కేటీఆర్ సవాల్ చేశారు. రాజకీయ విభేదాల కారణంగా రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
దేశ నిర్మాణం తెలంగాణ అభివృద్ధి నుంచే మరోసారి ప్రారంభం కావాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నారు. రెండేండ్ల తర్వాత ఆయన సీఎం కావడం ఖాయమనీ, తెలంగాణ అభివృద్ధి బాట పట్టడం కూడా ఖాయమని అన్నారు. రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్‌కు రెండు దశాబ్దాలు
ఆగస్టు 14తో తెలంగాణ భవన్ నిర్మాణానికి సరిగ్గా 20 ఏండ్లు పూర్తయ్యాయని కేటీఆర్ చెప్పారు. రెండు దశాబ్దాల ప్రయాణంలో ఈ భవనం కేవలం పార్టీ కార్యాలయంగా కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్రకు, పార్టీ ప్రస్థానానికి, కార్యకర్తల త్యాగాలకు ప్రతీకగా నిలిచిందన్నారు. ఈ భవనం పార్టీ భవిష్యత్తుకు స్టేట్‌మెంట్ కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ భవన్‌లో పనిచేస్తున్న 26 మంది ఉద్యోగులను శాలువాలతో సత్కరించి రూ.ఐదు లక్షల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను కేటీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీమంత్రులు మహమూద్‌అలీ, పొన్నాల లక్ష్మయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీలు సురేష్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, నాయకులు దేవీప్రసాద్, బీఆర్‌ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



