మీరు ఏమిటో స్పష్టంగా చూపగలిగేదే మీకు తగిన ఉపాధి. మీ ఆత్మ సంతృప్తికి కారణభూతమయ్యే ఉపాధిని మీరు ఎంచుకోగలిగినపుడు మీరు ఎల్లవేళలా ఒత్తిడి లేనటువంటి ఉత్సాహభరితమైన జీవితాన్ని గడపగలుగుతారు.
మీ చేతుల్లోనే, చేతల్లోనే
మీరు ఎంచుకునే కెరీర్ ఏదైనా సరే, అది మిమ్మల్ని, మీ మనస్తత్వాన్ని ప్రతిబించేదిగా వుండాలి..! మీ దృక్పధం అందులో స్పష్టమవ్వాలి. మీ విలువలు మీ విద్యుక్త ధర్మాలలో కాంతులీనాలి. అప్పుడే మీరు ఫలానా పనిని అత్యంత సమర్ధవంతంగా నిర్వర్తించగలరనే ‘ముద్ర’ మీ మీద పడుతుంది. అట్లా ఒక ‘ముద్ర’ మీ మీద పడిన తరువాత మీ ఉపాధికి ఢోకా వుండదు. మీ స్వయం అభివృద్ధి మీ చేతుల్లోనే, చేతల్లోనే సమృద్ధిగా వుంటుంది. మీ ఉజ్వలమైన భవిష్యత్తుకోసం మీరు ఏ అదృష్టాన్ని నమ్ముకోనవసరం వుండదు. విధి వంచితులమయ్యామనే దిగులు చెందనవసరం వుండదు. మీరు ఉపాధికోసం ఎదురు తెన్నులు చూస్తూ గడపాల్సిన అగత్యమే వుండదు. మీకు ఎప్పుడూ చేతినిండా పని వుంటుంది. ఆ పని మీకు ఎంతో ప్రియమైనది కాబట్టి, దాన్ని పూర్తిచేసి మరొక పనిని చేపట్టి, నిరంతరం మీరు అభివృద్ధి పథంలోనే సాగిపోతారు. ఇక నిరాశగా, కృంగిపోతూ కూలబడిపోవల్సిన అగత్యం మీకు కలగదు. మీరు చేయవల్సిందల్లా ఎంచుకునేటపుడే సరైన కెరీర్‌ను ఎంచుకోవటం. అది మిమ్మల్ని ప్రతిబింబింపచేసేదిగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం.
స్వేచ్ఛ వుంటుంది
మీకు నచ్చిన, మిమ్మల్ని ప్రతిబింబంపచేసే ఉపాధిని ఎంచుకోవటంలో మీకు ఎప్పుడూ స్వేచ్ఛ వుంటుంది. పరిస్థితుల ప్రాబల్యం కారణంచేతనో, మీ సామర్థ్యాలపట్ల మీకు స్పష్టమైన అవగాహన లేకపోవటం చేతనో, ఏది సరియైన ఉపాధో మీరు తేల్చుకోలేక పోవడంచేతనో, సరియైన సమయంలో సరియైన నిర్ణయం చేయలేక పోవడంతోనో మీరు మిమ్మల్ని ప్రతిబింబంపచేయని ఉపాధిని ఎంచుకోవచ్చు. దానిలో మీ ప్రతిభను కనబరచాలని మీరు ఎంత తీవ్రంగా ప్రయత్నించినా, మీరు ముందుగా వూహించినట్లుగానే విధి మిమ్మల్ని వెక్కిరించినట్లవుతుంది. ఆ పిదప మీరు నిస్తేజంతో ఎదురు చూపులు చూస్తూనే వుండిపోవటానికి పరిమితమైపోతారు. మీ ఎదురుగా వున్న స్వేచ్ఛను మీరు ఉపయోగించుకుని, మీకు తగిన ఉపాధిని మీరు ఎంచుకోవాలి. మిమ్మల్ని ప్రతి బింబింపచేసే ఇమేజ్‌ని నిర్మాణాత్మకంగా నిర్మింపచేసుకోవటానికి వీలయిన ప్రాజెక్టులను చేపట్టాలి.
సాధారణం.. అసాధారణం
మొక్కుబడిగా టెస్టులు రాసి, ఉద్యోగం సంపాదించుకుని, ఓ ఉద్యోగంలో స్థిరపడి, ఆపైన పెండ్లి చేసుకుని, పిల్లల్ని కని, పిల్లలకు పెండిండ్లు చేసి, వద్ధాప్యంలో పింఛను రాళ్ళతో సరిపెట్టుకోవటం ఒక సాధారణ జీవితం. ఈ సాదాసీదా జీవితం ద్వారా మీరు ఒక ముద్రను ఎప్పటికీ వేయలేరు. మీ అకుంఠిత దీక్షను ఆకర్షింపచేయగల రంగంలో మీరు కష్టించి పనిచేస్తారు. ఫలితం కోసం అహరహం శ్రమిస్తారు. ఒక శిల్పి ఒక బండరాయిని ఒక అందమైన శిల్పంగా మలిచినట్లుగా మీరు మీ జీవితాన్ని మలచుకోగలుగుతారు. మీరు ఎప్పుడైతే మీ తత్వాన్ని ప్రతిబింబింప చేసేదాన్ని ఎన్నుకోగలుగుతారో అందులో మీరు అసాధారణమైన ప్రజ్ఞాపాటవాల్ని ప్రదర్శించి నిజంగానే అసాధారణమైన విజయాలను చవిచూస్తారు.
‘ఓవర్ టైం’ లో ప్రతిఫలమెంత..?
సాదాసీదా ఉద్యోగం చేస్తూ, వారానికి వీలయిన అదనపు గంటలు పనిచేసి, కంపెనీ వారు కానీ, ప్రభుత్వం కానీ ఇచ్చే ఓవర్ టైం డబ్బులతో సంతప్తి పడి పోతూవుంటారు చాలామంది. మీరు మిమ్మల్ని ప్రతిబింబింప చేసే చక్కని ఉపాధిని ఎంచుకుని కష్టపడినపుడు, మీకు తెలియకుండానే అదనపు గంటలు పనిచేస్తారు. ఫలితం రావటానికి పరిమితమైన గంటలకు మించి కష్టపడతారు. ఫలితంగా మీరు ఊహించిన దానికంటే అసాధారణమైన ప్రతిఫలం మీకు ముడుతుంది. సాధారణ ఉద్యోగం చేస్తూ లభించే ఓవర్ టైం కన్నా ఇది ఎన్నో ఎక్కువ రెట్లు ప్రయోజనాన్ని అందిస్తుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. మిమ్మల్ని మీరు మరింత ఎక్కువగా, స్పష్టంగా ప్రతిబింబింప చేసుకోవటానికి మీరు ఈ అదనపు పనిని, కార్యభారాన్ని భరిస్తారు కాబట్టి అత్యుత్తమ ఫలితాలు మీ కైవసమవుతాయి. మీ చుట్టూ వున్నవారిలో విశేషమైన వ్యక్తిగా కనబడటానికి, విశేషమైన పనిని చేసే వ్యక్తిగా కీర్తి పొందటానికి మీరు నిరంతరం ఉద్యుక్తులుగా వుంటారు.
ఉత్సాహం ఇనుమడిస్తుంది
విశేషమైన వ్యక్తిగా కొనియాడబడుతూ వుండటం వల్ల మీకు ఏర్పడే దీర్ఘకాల ప్రయోజనంతో ఎల్లప్పుడూ ఉత్సాహంగా వుంటారు. ఈసురోమని భారాన్ని మోసే ఉద్యోగి పడే కష్టాలు మీకు వుండవు. కార్యభారం వల్ల ఏర్పడే ఒత్తిడి మీ విషయంలో వర్తించదు. మీరు ఇష్టపడి ఎంచుకున్న పని కాబట్టి మీరు ఎంత కష్టపడినా, ఎంత అలసటకు లోనయినా మీలో మానసిక ఒత్తిడి మచ్చుకయినా కానరాదు. పైగా మరింత ఎక్కువ వుత్సాహంగా ఎప్పుడూ నవయవ్వనంతో, నవ చైతన్యంతో కళ కళలాడుతుంటారు.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్



