Friday, April 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతాంగ ఉద్యమాలకు మహాసభలు వేదిక

రైతాంగ ఉద్యమాలకు మహాసభలు వేదిక

- Advertisement -

23, 24, 25 తేదీల్లో కొత్తగూడెంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు : ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ రావు

నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల దేశం, రాష్ట్రంలో రైతాంగాన్ని కాపాడటానికి, వ్యవసాయాన్ని రక్షించడానికి, ఉద్యమాలను రూపకల్పన చేయటానికి కొత్తగూడెంలో ఏప్రిల్‌ 23, 24, 25 తేదీల్లో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం 3వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు పిలుపు నిచ్చారు. గురువారం కొత్తగూడెంలోని మంచిగంటి భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో పోతినేని మాట్లాడుతూ.. దేశంలో 60 శాతం మందికి పైగా వ్యవసాయంపైన ఆధారపడి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.53 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టగా.. దానిలో వ్యవసాయానికి కేవలం రూ.1.60లక్షల కోట్లు కేటాయించడం దారుణమన్నారు.

వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయటం కోసం విద్యుత్‌ సవరణ చట్టం, ఎరువులపై సబ్సిడీని ఎత్తివేయడం, యూరియాని రైతులకి అందుబాటులో లేకుండా చేయడం, రైతులకు బీమా సౌకర్యం లేకుండా చేయటం వంటి రైతు వ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల రైతాంగం దివాళా తీసే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకి అర్థం కాని, అందుబాటులో లేని, యాప్‌లు తీసుకొచ్చి వాటి ద్వారా ఎరువులు, యూరియా, పంటలు కొనుగోలు, అమ్మకాలు చేయాలనడం నష్టదాయకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే పంథాను అవలంబిస్తున్నదని తెలిపారు. బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు చేస్తూ రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఆరు సార్లు ఇవ్వాల్సిన రైతు భరోసాను రెండు సార్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని అన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా సాగవుతున్న పామాయిల్‌ పంటకి తగ్గట్టు పామాయిల్‌ ఫ్యాక్టరీల నిర్మాణం జరగాలని పోతినేని అన్నారు. అశ్వారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీ 30 టన్నుల నుంచి 60 టన్నుల సామర్థ్యానికి పెంచి ఆధునీకరించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు, ములకలపల్లి ప్రాంతంలో మరొక ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఇక్కడ శుద్ధి చేసిన ముడి ఆయిల్‌ను సిద్దిపేటకు తీసుకుపోకుండా ఇక్కడే రిఫైనరీ సెంటర్‌ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పోడు సాగుదారులకి రక్షణ కల్పించేలా పట్టాలు ఇవ్వాలని కోరారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా నాలుగు ఎకరాలకు కూడా నీరు అందించక పోవడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా లింక్‌ కెనాల్స్‌, బ్రాంచ్‌ కెనాల్స్‌ నిర్మాణం కోసం చేయాల్సిన భూ సేకరణను చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై 3వ రాష్ట్ర మహాసభల్లో కూలంకషంగా చర్చించి రైతాంగ ఉద్యమాల్ని బలోపేతం కోసం కార్యచరణ రూపొందించడానికి కావల్సిన తీర్మానాల రూపకల్పనకు ఈ మహాసభ వేదిక కానున్నదని తెలిపారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు జలసూత్రం శివరాం ప్రసాద్‌ మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యమాలకు, పోరాటాలకు పుట్టినిల్లని, ఈ గడ్డపై తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం ఆయా వర్గాలకు మేలు చేకూరుతుందని అన్నారు. రాష్ట్ర మహాసభలు విజయవంతానికి ఆహ్వాన సంఘం పటిష్టమైన ఏర్పాట్లు, సౌకర్యాలను సమకూర్చడానికి అన్ని వర్గాల సహాయ, సహకారాలను అందించాలని కోరారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు, వ్యవసాయ కూలీ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఐక్యపోరాటాలకు సిద్దం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎలమంచి వంశీకృష్ణ, అన్నవరపు సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు కున్సోత్‌ ధర్మ, కొండబోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -