Monday, August 17, 2026
E-PAPER
Homeఖమ్మంసత్తుపల్లి 'ట్రంక్' భూసేకరణకు రూ.45 కోట్లు విడుదల

సత్తుపల్లి ‘ట్రంక్’ భూసేకరణకు రూ.45 కోట్లు విడుదల

- Advertisement -

– ​మూడు నుంచి నాలుగో పంప్‌హౌస్ మధ్య 532 ఎకరాల భూ సేకరణకు నిధులు
– ​ఈ సీజన్‌లోనే ఆయకట్టుకు గోదావరి జలాలు
– ​పనులు వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం
– ​సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి తుమ్మల
నవతెలంగాణ – సత్తుపల్లి

సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి ట్రంక్ పరిధిలోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. మంత్రి తుమ్మల ప్రత్యేక కృషితో మూడు మండలాలు సస్యశ్యామలం కానున్నాయి. మూడో పంప్‌హౌస్ నుంచి నాలుగో పంప్‌హౌస్ మధ్య అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు విడుదల చేసింది. దమ్మపేట, అశ్వారావుపేట మండలాల పరిధిలో మొత్తం 532 ఎకరాల భూమి సేకరణకు ఈ నిధులను వినియోగించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయి, దమ్మపేట, అశ్వారావుపేట, సత్తుపల్లి మండలాల పరిధిలో 532 ఎకరాల భూసేకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో దమ్మపేట, అశ్వారావుపేట, సత్తుపల్లి మండలాల్లోని భూములు సస్యశ్యామలం కానున్నాయి. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు సైతం శాశ్వత పరిష్కారం లభించనుంది. ఈ భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, మూడో పంప్‌హౌస్ నుంచి నాలుగో పంప్‌హౌస్ ద్వారా నీటిని విడుదల చేసేందుకు అవసరమైన పనులను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ఈ సీజన్‌లోనే ఆయకట్టుకు నీరు అందించేలా పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు

​సీతారామ ప్రాజెక్టు పూర్తిస్థాయిల అందుబాటులోకి వస్తే దమ్మపేట, అశ్వారావుపేట, సత్తుపల్లి మండలాలకు గోదావరి జలాలు చేరనున్నాయి. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం సుమారు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పటివరకు వర్షాధార పంటలను సాగు చేస్తున్న రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయాల్లో సీతారామ ప్రాజెక్టు జలాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు.

​సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌కు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు
సత్తుపల్లి ట్రంక్ భూసేకరణకు రూ.45 కోట్లు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భూసేకరణ, పైప్‌లైన్, పంప్‌హౌస్ తదితర పనులను సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఆయకట్టుకు చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తుమ్మల తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -